National Sports Awards : కనుల పండుగ.. క్రీడా అవార్డుల వేడుక
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:17 AM
క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా సత్కరించారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో జాతీయ క్రీడా అవార్డుల వేడుక కన్నుల పండుగగా జరిగింది.

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘనంగా సత్కరించారు. శుక్రవారం రాష్ట్రపతి భవన్‌లో జాతీయ క్రీడా అవార్డుల వేడుక కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డును డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ మను భాకర్, వరల్డ్ చెస్ చాంపియన్ గుకేశ్‌లతో పాటు హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారాలింపిక్స్ విజేత ప్రవీణ్ కుమార్ అందుకున్నారు. వీరికి సర్టిఫికెట్, మెడల్‌తో పాటు తలా రూ.25 లక్షల రివార్డు దక్కుతుంది. అలాగే 32 మంది అథ్లెట్లు అర్జున అవార్డును అందుకోగా, ఐదుగురు ద్రోణాచార్య స్వీకరించారు. తెలంగాణకు చెందిన పారా అథ్లెట్ దీప్తి జివాంజితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ జ్యోతి యర్రాజిలకు అర్జున దక్కింది. దీప్తి అవార్డును స్వీకరించగా, జ్యోతి శిక్షణ నిమిత్తం దక్షిణాఫ్రికాలో ఉండడంతో వేడుకకు హాజరుకాలేకపోయింది. ఈ పురస్కారంతో పాటు రూ.15 లక్షల రివార్డు వీళ్లకు దక్కనుంది.
ఆనందంగా ఉంది
రాష్ట్రపతి చేతులమీదుగా క్రీడా పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పారా అథ్లెట్ దీప్తి జివాంజి తెలిపింది. క్రీడల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకునేందుకు ఈ అవార్డు దోహదం చేస్తుందని దీప్తి వెల్లడించింది. ఇక, అర్జున అందుకున్న మన క్రీడారత్నం, వరంగల్ ముద్దుబిడ్డ దీప్తికి అభినందనలు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ’ఎక్స్’లో పోస్ట్ చేశారు. గతేడాది పారి్‌సలో జరిగిన పారాలింపిక్స్‌లో మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో దీప్తి కాంస్య పతకం గెలుచుకొని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రపతి స్వయంగా ముందుకొచ్చి..
అర్జున అవార్డు కోసం దశాబ్ధాలుగా ఆయన పోరాటానికి ఫలితం దక్కింది. పారాలింపిక్స్‌లో దేశానికి తొలి స్వర్ణం అందించిన 80 ఏళ్ల మురళీకాంత్ పేట్కర్ చివరకు అర్జున అవార్డు (లైఫ్‌టైమ్) అందుకున్నాడు. అయితే ఈ సందర్భంలో అంతటా భావోద్వేగం చోటుచేసుకుంది. 1965లో పాకిస్థాన్‌తో యుద్ధంలో పేట్కర్‌కు బుల్లెట్ గాయం తగిలి నడుం కింది భాగానికి వైకల్యం ఏర్పడింది. ఆ తర్వాత 1972 పారాలింపిక్స్ స్విమ్మింగ్‌లో అతను స్వర్ణం సాధించాడు. ఆహూతుల హర్షధ్వానాల మధ్య అతను చేతి కర్రల సహాయంతో అవార్డును స్వీకరించేందుకు రాగా, రాష్ట్రపతి స్వయంగా ముందుకు వచ్చి పేట్కర్‌ను సత్కరించడం అందరినీ ఆకట్టుకుంది.