Share News

Asia Cup 2025: పాక్‌ పిచ్చి చేష్టలు

ABN , Publish Date - Sep 23 , 2025 | 05:49 AM

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య దశాబ్దాలుగా ఎన్నో మ్యాచ్‌లను చూసుంటాం. కానీ ఆసియాకప్‌ సూపర్‌-4లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం దాయాది క్రికెటర్ల ప్రవర్తన...

Asia Cup 2025: పాక్‌ పిచ్చి చేష్టలు

ఫర్హాన్‌, రౌఫ్‌ల వివాదాస్పద తీరు

నివ్వెరపోయిన క్రీడాలోకం

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య దశాబ్దాలుగా ఎన్నో మ్యాచ్‌లను చూసుంటాం. కానీ ఆసియాకప్‌ సూపర్‌-4లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం దాయాది క్రికెటర్ల ప్రవర్తన అందరినీ షాక్‌కు గురి చేసింది. గ్రూప్‌ మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లతో షేక్‌హ్యాండ్‌కు నిరాకరించినందుకే క్రీడల్ని రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని పాక్‌ బోర్డు పెద్దలు, మాజీలు భారత్‌కు ఉపదేశాలిచ్చారు. కానీ దానికి వంద రెట్లు మించినట్టుగా పాక్‌ ఓపెనర్‌ ఫర్హాన్‌, పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ల చేష్టలున్నాయి. అర్ధసెంచరీ అయ్యాక ఫర్హాన్‌ బ్యాట్‌ను గన్‌గా మార్చి బుల్లెట్లు పేల్చుతున్నట్టుగా పహల్గామ్‌ దాడిని గుర్తు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇక బౌండరీ లైన్‌ దగ్గర రౌఫ్‌ భారత అభిమానులను మరింత కవ్వించేలా ప్రవర్తించాడు. ఆపరేషన్‌ సింధూర్‌లో భారత్‌కు చెందిన ఆరు రఫేల్‌ విమానాలను కూల్చేశామని అప్పట్లో పాక్‌ ప్రగల్భాలు పలికింది. దాన్ని ఉదహరిస్తూ.. అతను ప్రేక్షకులకు ఆరు వేళ్లను చూపించాడు. అంతేకాకుండా విమానం కింద పడుతున్నట్టుగా చేతులతో సైగ చేయడం కనిపించింది. అటు రౌఫ్‌ భార్య ఇవే ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసి ‘మ్యాచ్‌ ఓడినా, యుద్ధంలో గెలిచాం’ అంటూ భర్తకు వంత పాడింది. ఇక ఫర్హాన్‌ తన ఫైరింగ్‌ సంబరాలను నిస్సిగ్గుగా సమర్థించుకున్నాడు. ‘గతంలో నేనెప్పుడూ సంబరాలు చేసుకోలేదు. కానీ ఈసారి ఎందుకో చేసుకోవాలనిపించింది. ఎవరేమనుకున్నా నేను లెక్కచేయను’ అని తెగేసి చెప్పాడు. వాస్తవానికి గతంలో పాక్‌ క్రికెటర్ల నుంచి ఇలాంటి మిలిటెంట్‌ మనస్థత్వాన్ని ఎన్నడూ చూడలేదు. మైదానంలో మాటా మాటా అనుకోవడం వరకే పరిమితమయ్యేది.


భారత మీడియాకు భయపడి..

భారత మీడియాను ఎదుర్కొనేందుకు పాక్‌ క్రికెట్‌ జట్టు వెనుకంజ వేస్తోంది. గ్రూప్‌ మ్యాచ్‌లో ఓడాక.. అలాగే యూఏఈతో మ్యాచ్‌ ముగిశాక కూడా విలేకరుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు భయపడి పాక్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడు రెండో ఓటమి తర్వాత మాత్రం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు వచ్చాడు. కానీ కేవలం పాకిస్తాన్‌ మీడియాకు తప్ప, భారత విలేకరులను ప్రశ్నలను అడిగేందుకు అనుమతించకపోవడం గమనార్హం.

ఏకే 47కు జవాబుగా బ్రహ్మోస్‌: డానిష్‌

భారత్‌తో మ్యాచ్‌లో పాక్‌ క్రికెటర్ల హింసాత్మక ప్రవృత్తిని ఆ దేశ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా తప్పుపట్టాడు. ‘ఓపెనర్‌ ఫర్హాన్‌ ఏకే 47ను పేల్చినట్టుగా సంజ్ఞ చేశాడు. కానీ అభిషేక్‌, గిల్‌ వారిపై ఏకంగా బ్రహ్మోస్‌ క్షిపణినే పేల్చారు. పాక్‌ చర్యకు భారత్‌ ప్రతిచర్య భారీ స్థాయిలో ఉంది. ఇక ఇప్పుడు పాక్‌ జట్టు ఫఖర్‌ జమాన్‌ క్యాచ్‌ను వివాదంగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది’ అని కనేరియా అన్నాడు.

అందుకే రెచ్చిపోయా: అభిషేక్‌

పాక్‌ బౌలర్లను తొలి బంతి నుంచే ఊచకోత కోసిన భారత ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ జట్టు విజయంలో కీలకమయ్యాడు. అయితే అకారణంగా పాక్‌ ప్లేయర్లు తమ మీదికి రావడం నచ్చలేదన్నాడు. మ్యాచ్‌లో పేసర్లు షహీన్‌, రౌఫ్‌లతో అతడికి వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే . ‘వారు ఎలాంటి కారణం లేకుండా మాతో అలా ప్రవర్తించారు. నాకిలాంటివి నచ్చవు. అందుకే ప్రతీ బంతిని బాది వారికి సరైన మెడిసిన్‌ ఇవ్వాలనుకున్నా’ అని అభిషేక్‌ తెలిపాడు.


పాక్‌.. మాకు ప్రత్యర్థే కాదు: సూర్యకుమార్‌

సరైన ప్రత్యర్థి అంటే మైదానంలో నువ్వా.. నేనా? అనే రీతిలో తలపడాల్సి ఉంటుందని, కానీ పాక్‌ జట్టుతో తమకు పోటీ ఎక్కడుందని భారత కెప్టెన్‌ సూర్యకుమార్‌ ప్రశ్నించాడు. ‘ఇక నుంచి పాక్‌ జట్టును మాకు ప్రత్యర్థి అని అనకండి. ఏదేనీ రెండు జట్లు 15 మ్యాచ్‌ల్లో తలపడి 8-7తో ఉంటే అప్పుడు ఓకే. కానీ ఇక్కడ 12-3తో మేం స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాం. ఇక పోటీ ఏముంది?’ అని పాక్‌ విలేకరి అడిగిన ప్రశ్నకు సూర్య సూటిగా జవాబిచ్చాడు.

ఇవి కూడా చదవండి..

హాఫ్ సెంచరీ తర్వాత గన్ సెలబ్రేషన్స్.. ఫర్హాన్ రియాక్షన్ వింటే..

ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్

Updated Date - Sep 23 , 2025 | 05:49 AM