Pahalgam attack: పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ.. ఎన్ని వందల కోట్లు కోల్పోతారంటే..
ABN , Publish Date - May 07 , 2025 | 06:35 PM
ఇటీవల జమ్మూ, కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి మరో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పనిలో పనిగా బంగ్లాదేశ్‌కు షాక్ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
భారత జట్టు, పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడి దాదాపు 15 సంవత్సరాలకు పైనే అయింది. కేవలం ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్‌లలో మాత్రమే దాయాది జట్లు తలపడుతున్నాయి. ఇటీవల జమ్మూ, కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డును పూర్తిగా బహిష్కరించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంటే ఇకపై ఐసీసీ టోర్నీలో, ఆసియా కప్‌లతో సహా పాకిస్తాన్‌తో ఏ రూపంలోనూ ఆడకపోవచ్చు. ఈ బహిష్కరణను మహిళా, యువ క్రికెట్‌కు కూడా అన్వయించే అవకాశం ఉంది. అంటే ఇకపై ఇక ఏ రూపంలోనూ పాకిస్తాన్‌తో టీమిండియా తలపడేది ఉండదు. ఇప్పటికే భారత్‌తో సిరీస్‌లు లేకపోవడం వల్ల పాకిస్తాన్ చాలా కోల్పోతోంది. ఐపీఎల్‌లో ఎంట్రీ లేకపోవడంతో పాకిస్తాన్ క్రికెటర్లు కూడా చాలా ఆదాయాన్ని కోల్పోతున్నారు. ఇక, ఐసీసీ ఈవెంట్లలో కూడా పాకిస్తాన్‌తో ఆడకూడదని బీసీసీఐ నిర్ణయించుకుంటే పాక్ మరింత ఆదాయం కోల్పోక తప్పదు.

పాకిస్తాన్‌తో మాత్రమే కాదు.. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ కూడా భారత్‌కు ప్రత్యర్థిగా మారాలని తహతహలాడుతోంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి ఆ దేశంతో భారత ప్రభుత్వ సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహ్మద్ యూనస్ నియమితుడైన తర్వాత ఆ దేశంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఇక, ఇటీవల పహల్గామ్ దాడి తర్వాత బంగ్లాదేశ్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఏఎల్‌ఎమ్ ఫజ్లూర్ రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పాకిస్తాన్‌పై దాడి చేస్తే భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాన్ని బంగ్లాదేశ్ స్వాధీనం చేసుకోవాలని ఆయన సూచించడం వివాదానికి దారితీసింది. దీంతో బంగ్లాదేశ్‌ను కూడా భారత్ అనుమానంగా చూస్తోంది. ఈ ఏడాది చివర్లో ఆసియా కప్ కంటే ముందు భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది.

భద్రతా కారణాల రీత్యా బంగ్లాదేశ్ పర్యాటనను భారత్ రద్దు చేసుకునే అవకాశం ఉంది. 2022, డిసెంబర్‌లో భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం బంగ్లాదేశ్‌లో పర్యటించింది. ఆ సిరీస్ ద్వారా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రూ. 70-80 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది టీమిండియా పర్యటన ద్వారా రూ.100 కోట్లు రావొచ్చని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆశలు పెట్టుకుంది. అయితే బీసీసీఐ నిర్ణయంతో బంగ్లాదేశ్ ఆ మొత్తాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

ప్రతి ఏటా ఐసీసీకి వస్తున్న ఆదాయంలో దాదాపు 80 శాతం బీసీసీఐ నుంచే వస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి క్రికెట్ బోర్డులు ఈ ఆదాయంతోనే తమ కార్యకలాపాలను కొనసాగిస్తుంటాయి. కాగా, ఏలాంటి ఫార్మాట్‌లో అయినా ఆ రెండు దేశాలో క్రికెట్ ఆడకూడదని బీసీసీఐ నిర్ణయించుకుంటే.. పాకిస్తాన్ 220 కోట్ల రూపాయలు, బంగ్లాదేశ్ రూ.130 కోట్లు కోల్పోతాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..