World Boxing Cup Finals: నిఖత్ పసిడి పంచ్
ABN , Publish Date - Nov 21 , 2025 | 02:44 AM
వరల్డ్ బాక్సింగ్ కప్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. మొత్తం 20 మంది బరిలోకి దిగితే.. అందరికీ పతకాలు లభించాయి. మనోళ్లు ఏకంగా 9 స్వర్ణాలతో అదరగొట్టారు. మహిళా బాక్సర్లు నిఖత్ జరీన్...
9 స్వర్ణాలు కొల్లగొట్టిన భారత్ జూ మొత్తం 20 పతకాలతో అదుర్స్
వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్
గ్రేటర్ నోయిడా: వరల్డ్ బాక్సింగ్ కప్‌లో భారత బాక్సర్లు పతకాల పంట పండించారు. మొత్తం 20 మంది బరిలోకి దిగితే.. అందరికీ పతకాలు లభించాయి. మనోళ్లు ఏకంగా 9 స్వర్ణాలతో అదరగొట్టారు. మహిళా బాక్సర్లు నిఖత్ జరీన్ (51 కిలోలు), మీనాక్షి హుడా (48 కి), ప్రీతి పవార్ (54 కి), జాస్మిన్ లంబోరియా (57 కి), పర్వీన్ (60కి), అరుంధతి చౌధరి (70 కి), నూపుర్ షెరాన్ (80+ కి)తోపాటు సచిన్ (60 కి), హితేష్ (70 కి) పసిడి కాంతులీనారు. మొత్తంగా భారత్ (9 బంగారు, 6 రజత, 5 కాంస్య) 20 పతకాలు సాధించింది. గురువారం జరిగిన ఫైనల్లో నిఖత్ 5-0తో గువా యి గ్జువాన్ (చైనీస్ తైపీ)ని మట్టికరిపించింది. పారిస్ ఒలింపిక్స్ రౌండ్-16లో ఓటమి తర్వాత వరల్డ్ చాంపియన్ నిఖత్ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది. వేగంగా కదులుతూనే పవర్ పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రతి రౌండ్‌లోనూ సాంకేతికంగా మెరుగైన ప్రదర్శన కనబర్చింది. ఈ పోటీల్లో నిఖత్ ఆడింది 2 బౌట్లు మాత్రమే. బై లభించడంతో ఆమె నేరుగా సెమీ్‌సలో తలపడింది. ఇక మీనాక్షి 5-0 తో ఆసియా చాంపియన్ ఫర్జోనా ఫొటిలోవా (ఉజ్బెకిస్థాన్)పై, అరుంధతి 5-0తో జొకిరోవా (ఉజ్బెకిస్థాన్)పై, ప్రీతి 5-0తో సిరిన్ చర్రా బి (ఇటలీ)పై, నూపుర్ 3-2తో సోతిమ్‌బయేవా (ఉజ్బెకిస్థాన్)పై, వరల్డ్ చాంపియన్ జాస్మిన్ 4-1తో పారిస్ ఒలింపిక్స్ పతక విజేత ఉ షి (చైనీస్ తైపీ)పై, పర్వీన్ 3-2తో అయాక తగుచి (జపాన్)పై గెలిచి స్వర్ణాలు నెగ్గారు. అయితే, 80 కిలోల విభాగంలో కజ్మర్‌స్కా (పోలెండ్) చేతిలో ఓడిన పూజారాణి రజతానికే పరిమితమైంది. పురుషుల విభాగం ఫైనల్లో సచిన్ 5-0తో సీట్‌బెక్ (కిర్గిస్థాన్)పై, హితేష్ 3-2తో నూర్‌బెక్ (కజకిస్థాన్)పై నెగ్గి స్వర్ణాలు సాధించారు. జాదూమణి (50 కి), పవన్ బర్త్వాల్ (55 కి), అవినాష్ (65 కి), అంకుష్ (80), నరేందర్ (90+ కి) తుది పోరులో ఓడి రజతాలు దక్కించుకొన్నారు.
ప్రతి ఒక్కరికీ పతకం: భారత్‌నుంచి మహిళలు, పురుషుల విభాగాల్లో పదేసి మంది చొప్పున 20 మంది దిగారు. వీరిలో ప్రతిఒక్కరూ పతకం సాధించారు. మహిళలకు 7 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలు లభించాయి. పురుషులు 2స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు కైవసం చేసుకున్నారు.
టాప్ బాక్సర్లు దూరం..
అగ్రశ్రేణి బాక్సర్లు చాలా మంది ఈ ఈవెంట్‌కు దూరం కావడంతో టోర్నీ కళతప్పింది. బాక్సింగ్ పవర్‌హౌస్‌లైన కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్‌లు తృతీయ శ్రేణి జట్లను బరిలోకి దించడంతో మనోళ్లకు పెద్దగా పోటీ ఎదురుకాలేదు.

మళ్లీ ఒలింపిక్స్ రేసులోకి..
దాదాపు ఇరవై నెలల తర్వాత అంతర్జాతీయ బాక్సింగ్ రింగ్‌లో నిఖత్ జరీన్ గర్జించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఓటమి తర్వాత కొద్ది కాలం గాయాలతో.. ఆ తర్వాత వెయిట్ విభాగంలో మార్పులతో ఒడిదుడుకులకు లోనైన నిఖత్.. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో స్వర్ణం సాధించి మరోసారి సత్తా చాటుకుంది. ఈ విజయానంతరం ‘ఆంధ్రజ్యోతి’తో నిఖత్ పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే...
సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ పోటీల్లో పసిడి పతకం సాధించడం సంతోషంగా ఉంది. ఈ విజయం నన్ను తిరిగి ఒలింపిక్స్ రేసులోకి తీసుకొచ్చింది. పారిస్ ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఓడిన తర్వాత తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ విజయం నాలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ ఉత్సాహంతో త్వరలో జరిగే ఆసియా చాంపియన్‌షి్‌పలోనూ సత్తా చాటుతా. వచ్చే ఒలింపిక్స్‌కు రెట్టింపు ఉత్సాహంతో ఇప్పటినుంచే సన్నాహకాలు మొదలుపెడతా. ఇందుకోసం వచ్చే రెండేళ్లు అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణించాల్సి ఉంది.
హైదరాబాద్‌లో సరైన సదుపాయాలు లేవు..
హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగిన విధంగా బాక్సింగ్‌లో సాధన చేసేందుకు అకాడమీలు, సదుపాయాలు లేవు. నేను కూడా పటియాల, బళ్లారి వంటి ప్రాంతాలకు వెళ్లి సాధన చేయాల్సి వస్తోంది. నగరంలో మంచి బాక్సింగ్ అకాడమీని నెలకొల్పేందుకు గతంలో సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించాను. ఆయన సానుకూలంగా స్పందించారు. బాక్సింగ్‌లో నా లాంటి అమ్మాయిలు తెలంగాణ నుంచి మరింత మంది రావాలంటే రాష్ట్రంలో బాక్సింగ్ మౌలిక సదుపాయాలు మెరుగుపడాల్సి ఉంది. ఇందుకోసం అకాడమీ ఏర్పాటుపై ముఖ్యమంత్రిని మరోసారి కలిసి చర్చిస్తాను.
(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్)
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి