Share News

Lionel Messi India Tour: మళ్లీ వస్తా

ABN , Publish Date - Dec 16 , 2025 | 06:05 AM

దిగ్గజ ఫుట్‌బాలర్‌, అర్జెంటీనా సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ మూడు రోజుల సుడిగాలి పర్యటన ముగిసింది. ‘ది గోట్‌ ఇండియా టూర్‌’లో భాగంగా ఈనెల 13న మెస్సీ కోల్‌కతాలో అడుగుపెట్టిన...

Lionel Messi India Tour: మళ్లీ వస్తా

బైబై భారత్‌

ముగిసిన మెస్సీ పర్యటన

చివరి రోజు ఢిల్లీలో సందడి

న్యూఢిల్లీ: దిగ్గజ ఫుట్‌బాలర్‌, అర్జెంటీనా సూపర్‌ స్టార్‌ లియోనెల్‌ మెస్సీ మూడు రోజుల సుడిగాలి పర్యటన ముగిసింది. ‘ది గోట్‌ ఇండియా టూర్‌’లో భాగంగా ఈనెల 13న మెస్సీ కోల్‌కతాలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తొలి రోజు సాల్ట్‌ లేక్‌ స్టేడియంలో నిర్వహణాలోపంతో ఈవెంట్‌ రసాభాస అయినప్పటికీ.. అదే రోజు రాత్రి హైదరాబాద్‌లో.. ఆదివారం ముంబైలో మాత్రం మెస్సీ ఈవెంట్‌ సక్సెస్‌ అయ్యింది. ఎలాంటి అడ్డంకులు లేకుండా అభిమానులతో పాటు సెలెబ్రిటీలు, అధికారులు, క్రీడా ప్రముఖులు అతడిని ప్రత్యక్షంగా తిలకించి మురిసిపోయారు. ఇక చివరి అంచెలో భాగంగా సోమవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో అడుగుపెట్టిన మెస్సీ బృందం తరగని ఉత్సాహంతో అరుణ్‌ జైట్లీ మైదానంలో ప్రేక్షకులను అలరించింది.

కాస్త ఆలస్యంగా..: షెడ్యూల్‌ ప్రకారం ముంబై నుంచి మెస్సీ ప్రత్యేక విమానం ఉదయం 10.45కు ఢిల్లీ చేరుకోవాలి. కానీ అధిక మంచు ప్రభావంతో మధ్యాహ్నం 2.30 గంటలకు మెస్సీ స్థానిక ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టాడు. నేరుగా అక్కడి నుంచి లీలా ప్యాలెస్‌ హోటల్‌కు వెళ్లిన అతను కాస్త సేద తీరాక ఎంపిక చేసిన పలువురితో మీట్‌ అండ్‌ గ్రీట్‌ సెషన్‌లో గడిపాడు.

గంటకుపైగా స్టేడియంలోనే..: ఉదయం నుంచే అభిమానులు వయస్సు తేడా లేకుండా జైట్లీ స్టేడియానికి పోటెత్తారు. మెస్సీ రాకకు కొన్ని గంటల ముందుగానే 25వేల మందికి పైగా ప్రేక్షకులతో స్టేడియం నిండిపోయింది. ముందుగా 20 నిమిషాలపాటు సెలెబ్రిటీ మెస్సీ ఆల్‌ స్టార్స్‌- మినర్వా మెస్సీ ఆల్‌ స్టార్స్‌ మధ్య ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటలకు మెస్సీ తన సహచరులు సువారెజ్‌, డి పాల్‌తో కలిసి స్టేడియంలో అడుగుపెట్టడంతో ఒక్కసారిగా సందడి నెలకొంది. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదలగా.. మెస్సీ ప్రతి కదలికను కూడా ఫ్యాన్స్‌ తమ మొబైల్‌ ఫోన్స్‌లో బంధించడం కనిపించింది. అలాగే మ్యాచ్‌ ఆటగాళ్లను కలిసి వారితో మెస్సీ ఫొటో దిగాడు. ఇక్కడ కూడా స్టేడియంలో కలియదిరుగుతూ బంతులను స్టాండ్స్‌లోకి పంపి వారిలో మరింత జోష్‌ నింపాడు. ఈ క్రమంలో చిన్నారులతో కాసేపు ఆడి ఫొటోలు దిగిన సాకర్‌ స్టార్‌.. వారి జెర్సీలపై సంతకం చేసి మరింత ఆనందంలో ముంచెత్తాడు.


వెలకట్టలేని

ప్రేమను

తీసుకెళ్తున్నా

గంటకు పైగా స్టేడియంలో సందడి చేసిన మెస్సీ చివర్లో తన మాటలతో మరింత ఉర్రూతలూగించాడు. ఏదో ఒకరోజు మళ్లీ భారత్‌కు వస్తానని అన్నాడు. ‘ఈ మూడు రోజులపాటు భారత్‌లో నేను తక్కువ సమయమే ఉన్నప్పటికీ మీరంతా చూపిన ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు. నన్నిక్కడ అభిమానిస్తారని ముందే తెలుసు. కానీ ప్రత్యక్షంగా ఆ అనుభూతిని పొందడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ వెలకట్టలేని ప్రేమనంతా తీసుకెళుతున్న నేను భవిష్యత్‌లో మరోసారి కచ్చితంగా ఇక్కడికి వస్తా’ అని స్పాని్‌షలో మెస్సీ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

కరచాలనానికి కోటి!

న్యూఢిల్లీ: చివరిరోజు మెస్సీ పాల్గొన్న ఢిల్లీ ఢిల్లీ కార్యక్రమాల్లో ‘మీట్‌, గ్రీట్‌’ కూడా ఒకటి. ఈ ఈవెంట్‌లో మెస్సీని కలిసి అతడితో కరచాలనం చేసేందుకు కార్పొరేట్‌ సంస్థల వ్యక్తులు, వీఐపీలు రూ. కోటి చెల్లించినట్టు సమాచారం. ఈ కార్యక్రమం స్థానిక లీలా ప్యాలెస్‌ హోటల్‌లో జరిగింది. అయితే కోల్‌కతా, హైదరాబాద్‌లో ఈ ‘మీట్‌, గ్రీట్‌‘ ఈవెంట్‌కు ఒక్కొక్కరికి రూ. 10 లక్షలే చార్జ్‌ చేయడం గమనార్హం.

మెస్సీ..ఊపిరితిత్తులకు

బీమా ఉందా..?

దేశ రాజధానిని దట్టమైన పొంగమంచు, కాలుష్యం కమ్మేశాయి. ఈ తరుణంలో మెస్సీ న్యూఢిల్లీలో అడుగుపెట్టాడు. దాంతో ఇక్కడి కాలుష్యం నేపథ్యంగా నెటిజన్లు మెస్సీపై సరదాగా చేసిన కామెంట్లు, మీమ్‌లు సోషల్‌మీడియాను ముంచెత్తుతున్నాయి. ‘ఢిల్లీలో మెస్సీకి స్వాగతం. నీ ఎడమ పాదాన్ని రూ. 8వేల కోట్లకు బీమా చేయించావని విన్నా. కానీ నీ ఊపిరితిత్తుల పరిస్థితి ఏమిటి’ అని ఒకరు.. ‘మెస్సీ కెరీర్‌లో 896 గోల్స్‌ చేశాడు. కానీ రేపటి ఢిల్లీ కాలుష్య సూచీ దానిని దాటేస్తుంది’ అని మరొకరు పోస్ట్‌లు చేశారు.

ఇవి కూడా చదవండి:

ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు

వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు

Updated Date - Dec 16 , 2025 | 06:05 AM