Share News

మెద్వెదెవ్‌ అవుట్‌

ABN , Publish Date - Jan 17 , 2025 | 05:32 AM

సాఫీగా సాగుతున్న ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు పెద్ద ఝలక్‌. స్టార్లంతా జోరు ప్రదర్శిస్తున్న వేళ ఐదోసీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌కు షాక్‌ తగిలింది....

మెద్వెదెవ్‌ అవుట్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

అమెరికా టీనేజర్‌ లెర్నర్‌ టీన్‌ సంచలన విజయం

  • మూడోరౌండ్లో స్వియటెక్‌తో రదుకాను ఢీ

  • సిన్నర్‌, టేలర్‌ ముందంజ

మెల్‌బోర్న్‌: సాఫీగా సాగుతున్న ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు పెద్ద ఝలక్‌. స్టార్లంతా జోరు ప్రదర్శిస్తున్న వేళ ఐదోసీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌కు షాక్‌ తగిలింది. అమెరికన్‌ టీనేజర్‌, 19 ఏళ్ల లెర్నర్‌ టీన్‌ రెండోరౌండ్‌లో నిరుటి రన్నరప్‌ డానిల్‌ను కంగుతినిపించాడు. ఇక మహిళల 2వ సీడ్‌ ఇగా స్వియటెక్‌, 4వ సీడ్‌ పోలిని, 6వ సీడ్‌ రిబకినా, 2021 యూఎస్‌ ఓపెన్‌ విజేత ఎమ్మా రదుకాను మూడో రౌండ్‌లో ప్రవేశించారు.


డానిల్‌ ఐదు సెట్లు పోరాడినా..: గత ఏడాదేకాదు.. 2021, 2022లోనూ మెల్‌బోర్న్‌ పార్క్‌లో ఫైనల్లో భంగపడిన మెద్వెదెవ్‌(రష్యా) ఈసారి ఎలాగైనా టైటిల్‌ దక్కించుకోవాలన్న పట్టుదలతో బరిలో దిగాడు. కానీ గురువారం జరిగిన దాదాపు ఐదు గంటల పోరులో క్వాలిఫయర్‌ లెర్నర్‌ 6-3, 7-6 (4), 6-7 (10), 1-6, 7-6 (7)తో 28 ఏళ్ల మెద్వెదెవ్‌కు షాకిచ్చాడు. ఈ క్రమంలో 1990లో సంప్రాస్‌ తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పిన్న వయస్సులో మూడోరౌండ్‌ చేరిన అమెరికన్‌గా లెర్నర్‌ రికార్డు సృష్టించాడు. టాప్‌సీడ్‌ సిన్నర్‌ 4-6, 6-4, 6-1, 6-3తో ట్రిస్టాన్‌ను, ఫ్రిట్జ్‌ 6-2, 6-1, 6-0తో క్రిస్టియన్‌ను, డిమినార్‌ 6-2, 6-4, 6-3తో బోయర్‌ను, 13వ సీడ్‌ హోల్గర్‌ రూన్‌ 7-6, (3), 2-6, 6-3, 7-6 (6)తో బెరెటినిని ఓడించి మూడో రౌండ్‌లో అడుగుపెట్టారు.


ఎమ్మాతో ఇగా పోరు: మహిళల ఫేవరెట్‌ ఇగా స్వియటెక్‌ 6-0, 6-2తో రెబెకా స్రంకోవాపై గెలిచింది. తదుపరి రౌండ్‌లో ఎమ్మా రదుకానుతో స్వియటెక్‌ తలపడుతుంది. 22 ఏళ్ల బ్రిటన్‌ ప్లేయర్‌ రదుకాను 6-3, 7-5తో అమందాపై గెలిచింది. 4వ సీడ్‌ పోలిని 6-2, 6-3తో రెనటాపై, 6వ సీడ్‌ రిబకినా 6-0, 6-3తో జోవిక్‌పై, 8వ సీడ్‌ ఎమ్మా నవారో 6-3, 3-6, 6-4తో వాంగ్‌ షియుపై, 9వ సీడ్‌ కసట్కినా 6-2, 6-0తో యఫాన్‌పై, కొలిన్స్‌ 7-6 (4), 4-6, 6-2తో అయావాపై నెగ్గారు.

బాలాజీ జోడీ శుభారంభం: పురుషుల డబుల్స్‌లో భారత్‌కు చెందిన శ్రీరామ్‌ బాలాజీ జోడీ/మిగ్వెల్‌ ఆంజెల్‌ (మెక్సికో) ద్వయం 6-4, 6-3తో డచ్‌, కజక్‌ జంట రాబిన్‌/అలెగ్జాండర్‌పై గెలుపొందింది.

Updated Date - Jan 17 , 2025 | 05:32 AM