Share News

అవును.. విడిపోయాం

ABN , Publish Date - May 01 , 2025 | 05:27 AM

భర్త కరుంగ్‌ ఆంఖోలెర్‌తో తాను విడాకులు తీసుకున్నట్టు ఒలింపిక్‌ పతక విజేత బాక్సర్‌ మేరీ కోమ్‌ (42) బుధవారం ప్రకటించింది....

అవును.. విడిపోయాం

ఏడాదిన్నర క్రితమే విడాకులు తీసుకున్నాం

హితేష్‌ చౌధరితో వ్యాపార సంబంధమే

బాక్సర్‌ మేరీ కోమ్‌

న్యూఢిల్లీ: భర్త కరుంగ్‌ ఆంఖోలెర్‌తో తాను విడాకులు తీసుకున్నట్టు ఒలింపిక్‌ పతక విజేత బాక్సర్‌ మేరీ కోమ్‌ (42) బుధవారం ప్రకటించింది. డిసెంబరు 20, 2023న ఇరు కుటుంబాలు, గిరిజన మత పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నట్టు ఆమె తెలిపింది. అంతేకాదు..వ్యాపారవేత్త, ఓ అంతర్జాతీయ బాక్సర్‌ భర్త అయిన హితేష్‌ చౌధురితో తనకు వివాహేతర సంబంధం ఉన్నట్టు వస్తున్న పుకార్లను మేరీ ఖండించింది. మేరీ కోమ్‌ బాక్సింగ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ అయిన హితేష్‌తో తనది వ్యాపార సంబంఽధమేనని స్పష్టంజేసింది. కాగా..మేరీ వ్యక్తిగత జీవితంపై కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె న్యాయ బృందం స్పందించింది. ఈమేరకు సుదీర్ఘమైన ప్రకటన విడుదలజేసింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా..కోమ్‌ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ఆ ప్రకటనలో కోరారు. కాగా తామిద్దరూ కలిసి దిగిన ఫొటోలను మేరీ, హితేష్‌ తమ సోషల్‌ మీడియా ఖాతా నుంచి తొలగించారు.


2005లో పెళ్లి

మేరీ, కరుంగ్‌ 2005లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కవలలు సహా ముగ్గురు కుమారులున్నారు. తర్వాత బాలికను దత్తత తీసుకున్నారు. కాగా 2022లో జరిగిన మణిపూర్‌ లోకసభ ఎన్నికల్లో మేరీ భర్త పోటీచేసి ఓడిపోయాడు. ఆ ఎన్నికకు 2-3 కోట్ల రూపాయలు ఖర్చయిందట. దీని తర్వాత మేరీ పిల్లల్ని తీసుకుని ఫరీదాబాద్‌ వెళ్లిపోగా, భర్త ఢిల్లీలోనే ఉంటున్నాడు.

ఇవి కూడా చదవండి..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 01 , 2025 | 05:27 AM