Share News

India Final Test Team: కుల్దీప్‌ అర్ష్‌దీప్‌ ఖరారేనా

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:49 AM

వీరోచిత పోరాటంతో నాలుగో టెస్ట్‌ను డ్రా చేసుకొన్న భారత్‌.. సిరీస్‌ ఆశలను సజీవంగా నిలబెట్టుకొంది. గురువారం నుంచి ఓవల్‌లో జరిగే ఐదో, ఆఖరి టెస్ట్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలన్న...

India Final Test Team: కుల్దీప్‌ అర్ష్‌దీప్‌  ఖరారేనా

  • ఆసక్తికరంగా భారత జట్టు కూర్పు

  • రేపటినుంచే ఆఖరి టెస్టు

లండన్‌: వీరోచిత పోరాటంతో నాలుగో టెస్ట్‌ను డ్రా చేసుకొన్న భారత్‌.. సిరీస్‌ ఆశలను సజీవంగా నిలబెట్టుకొంది. గురువారం నుంచి ఓవల్‌లో జరిగే ఐదో, ఆఖరి టెస్ట్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా తుది జట్టు కూర్పు ఆసక్తిగా మారింది. అయితే, పరిస్థితులను బట్టి ఊహించిన దానికంటే ఎక్కువ మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా వికెట్లు పడగొట్టగల బౌలర్‌ కోసం భారత్‌ వెదుకుతోంది. స్టార్‌ పేసర్‌ బుమ్రా విషయం సస్పెన్స్‌గా మారింది. మాంచెస్టర్‌ టెస్ట్‌లో పేస్‌ తగ్గించి బౌలింగ్‌ చేయడంతో అతడి ఫిట్‌నెస్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, బుమ్రా బౌలింగ్‌ చేసేంత ఫిట్‌గా ఉన్నాడని బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ చెప్పాడు. కానీ, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మాత్రం మ్యాచ్‌ ముందు మాత్రమే బుమ్రాపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. నాలుగు టెస్ట్‌ల్లో కలిపి బుమ్రా దాదాపు 120 ఓవర్లు బౌల్‌ చేశాడు. ఒక్క ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లోనే 33 ఓవర్లు వేశాడు. ఒకవేళ బుమ్రాకు విశ్రాంతినిస్తే.. అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనేది పిచ్‌ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. కాగా, స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ను గత నాలుగు మ్యాచ్‌లుగా బెంచ్‌కే పరిమితం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అతడికి ఆఖరి టెస్ట్‌లో ఆడించడం ఖాయంగా భావిస్తున్నారు. గాయపడిన పేసర్లు అర్ష్‌దీప్‌, ఆకాశ్‌దీప్‌ కూడా ఫిట్‌నెస్‌ సాధించారని కోచ్‌ గంభీర్‌ తెలిపాడు. అయితే, అన్షుల్‌ కాంబోజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌పై వేటు పడుతుందన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.


కాంబోజ్‌ స్థానంలో ఆకాశ్‌దీప్‌ రీఎంట్రీ ఇవ్వనుండగా.. బుమ్రా దూరమైతే ఆ స్థానం కోసం అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ పోటీలో ఉన్నారు. అయితే అర్ష్‌దీప్‌ ఎంపిక దాదాపు ఖరారైనట్టే చెబుతున్నారు. ఇక శార్దూల్‌ బంతితో తీవ్రంగా నిరాశపర్చడం.. కుల్దీప్‌కు మార్గం సుగమం చేసిందని భావిస్తున్నారు. బ్యాటింగ్‌ విభాగంలో పెద్దగా మార్పులు లేవని తెలుస్తోంది. గాయపడిన రిషభ్‌ పంత్‌ సిరీస్‌ నుంచి అవుట్‌ కాగా.. అతడి స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ ఆడడం దాదాపుగా ఖరారైంది.

ఇవి కూడా చదవండి..

ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 30 , 2025 | 05:50 AM