Share News

Ben Stokes: బుమ్రా అంటే మాకేమీ భయం లేదు.. బెన్ స్టోక్స్

ABN , Publish Date - Jun 19 , 2025 | 02:13 PM

భారత్‌తో టెస్టు సిరీస్‌పై ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తాజాగా స్పందించారు. ఒంటి చేత్తో ఈ టోర్నీలో తమ జట్టును గెలిపించుకోవడం ఇరు జట్లల్లో ఏ క్రీడాకారుడికీ సాధ్యం కాదని స్పష్టం చేశాడు.

Ben Stokes: బుమ్రా అంటే మాకేమీ భయం లేదు.. బెన్ స్టోక్స్
Ben Stokes on Bumra Fear Factor

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ పేసర్ బుమ్రా అంటే ఇంగ్లండ్ జట్టుకు భయం లేదని టీం కెప్టెన్ బెన్ స్టోక్స్ స్పష్టం చేశాడు. బుమ్రా ప్రపంచస్థాయి బౌలర్ అయినప్పటికీ ఒంటి చేత్తో జట్టును గెలిపించడం అతడికి సాధ్యం కాదని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ జట్టు సభ్యులు ఇప్పటికే పలు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో తలపడ్డారని, ఏ జట్టు, లేదా ప్లేయర్‌ను చూసినా వారు భయపడరని అన్నాడు.

‘జంకు లేనే లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో నిత్యం అద్భుతమైన ప్రత్యర్థులతో తలపడుతుంటాం. బుమ్రా టాలెంట్ గురించి మాకు అవగాహన ఉంది. అయితే, అతడంటే భయం మాత్రం లేదు’ అని స్టోక్స్ స్పష్టం చేశాడు. ‘ఒకే ఒక బౌలర్‌ ఈ టోర్నీలో తన జట్టును గట్టెక్కించగలడని నేను అనుకోను. మొత్తం 11 మంది ప్రతిభ కనబర్చాలి. ఒక్క వ్యక్తితో విజయం ముడిపడి ఉన్న పరిస్థితి ఇరు జట్లలోనూ లేదు’ అని అన్నాడు.


ఇక బెన్ స్టోక్స్‌కు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని మరో ప్లేయర్ జో రూట్ వ్యాఖ్యానించారు. తన కెప్టెన్సీ సమయంలో స్టోక్స్ ఎంతో అండగా నిలిచాడని చెప్పాడు. 2017 నుంచి 2022 మధ్య సారథిగా ఉన్న రూట్‌కు స్టోక్స్ అండగా ఉన్నాడు.

ఇక కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాక రూట్ బ్యాటింగ్‌లో మంచి ప్రతిభ కనబరిచాడు. 36 టెస్టుల్లో 3117 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో బాగా ఎంజాయ్ చేసిన దశ ఇదేనని కూడా వ్యాఖ్యానించాడు. నిలకడగా పరుగులు చేస్తూ స్టోక్స్‌కు అండగా నిలవనున్నట్టు చెప్పారు. మంచి ఫామ్‌లో రూట్‌ జట్టుకు కీలక విజయాలు అందించగలడన్న సెంటిమెంట్ ఇంగ్లండ్ జట్టులో వ్యక్తమవుతోంది.


కప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాక మళ్లీ సాధారణ సభ్యుడిగా జట్టులోకి రావడం కాస్త వింతగా అనిపించిందని కూడా రూట్ ఇటీవల పేర్కొన్నారు. కానీ, బ్యాటర్‌గా అతడు అద్భుత ప్రతిభ కనబరుస్తూ 56.67 సగటును సాధించాడు. ‘అప్పట్లో బెన్ వైస్ కెప్టెన్‌గా నా కోసం ఎంతో చేశాడు. అతడికి ప్రత్యుపకారం చేయాల్సి టైం వచ్చింది. బెన్‌ కెప్టెన్సీకి నేను అడ్డంకిగా మారదలుచుకోలేదు. ఎప్పటికీ అండగా ఉంటానని అతడికి చెప్పదలుచుకున్నా’ అని స్టోక్స్ అన్నాడు.

ఇవి కూడా చదవండి:

బుమ్రాతో అలాంటి పని మాత్రం చేయించొద్దు.. టీమిండియాకు గంగూలీ సూచన

టీమిండియాకు కెప్టెన్సీ ఎంత పెద్ద బాధ్యతో గిల్‌‌కు ఇంకా తెలియదు: దినేశ్ కార్తిక్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 19 , 2025 | 02:25 PM