రిస్క్ తీసుకోకూడదనే..
ABN , Publish Date - Feb 13 , 2025 | 05:14 AM
ఊహించినదే జరిగింది. భారత జట్టు పేస్ దళపతి జస్‌ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ చివరి టెస్ట్ సందర్భంగా బుమ్రా వెన్ను గాయానికి లోనైన సంగతి తెలిసిందే. దాంతో...

‘చాంపియన్స్’ జట్టు నుంచి బుమ్రా అవుట్
కోలుకున్నా.. బౌలింగ్ చేయలేని పరిస్థితి
న్యూఢిల్లీ: ఊహించినదే జరిగింది. భారత జట్టు పేస్ దళపతి జస్‌ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్ చివరి టెస్ట్ సందర్భంగా బుమ్రా వెన్ను గాయానికి లోనైన సంగతి తెలిసిందే. దాంతో ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత నుంచి అతడు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు. ఐదు వారాల పునరావాసం తర్వాత బుమ్రాకు స్కానింగ్ చేశారు. అందులో బాగానే ఉన్నట్టు తేలింది. కానీ చాంపియన్స్ ట్రోఫీ నాటికి బౌలింగ్ చేసే స్థాయికి అతడు ఫిట్‌నెస్ సంతరించుకున్నాడా..లేడా..అన్నది కచ్చితంగా తేల్చలేకపోయారు. దాంతో రిస్క్ తీసుకోకూడదని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ నిర్ణయించాడు. ఫలితంగా చాంపియన్స్ ట్రోఫీ ప్రాథమిక జట్టు నుంచి బుమ్రాను తొలగించారు. అతడి స్థానంలో మరో పేసర్ హర్షిత్ రాణాకు చోటు కల్పించారు. అలాగే తొలుత ప్రకటించిన జట్టులో ఉన్న జైస్వాల్‌ను తప్పించారు.
అతడికి బదులు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్‌ను ఈనెల 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడనుంది. ఇక జట్టులో కెప్టెన్ రోహిత్‌తోపాటు వైస్ కెప్టెన్ గిల్, కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, పంత్, హార్దిక్, అక్షర్, వాషింగ్టన్, కుల్దీప్, హర్షిత్, షమి, అర్ష్‌దీప్, జడేజా, వరుణ్ చక్రవర్తి ఉన్నారు.
పునరాగమనం ఎప్పుడు?
బుమ్రా పోటీ క్రికెట్‌లోకి మళ్లీ ఎప్పుడు అడుగుపెడతాడనేది ప్రశ్న. చాంపియన్స్ ట్రోఫీకి దూరమవడంతో మరికొన్ని వారాలు అతడు ఎన్‌సీఏలోనే పునరావాసంలో ఉంటాడని సమాచారం. ఇక..ఐపీఎల్ వచ్చేనెల 21న ప్రారంభం కానుంది. ఆ టోర్నీలో బౌలింగ్ చేసే స్థాయికి సిద్ధమయ్యేలా అతడు ఎన్‌సీఏలో కొనసాగనున్నట్టు తెలిసింది. ఐపీఎల్‌లో బౌలింగ్ చేయడం ద్వారా..జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీ్‌సకు బుమ్రాను సిద్ధం చేయాలనేది ప్రణాళిక.