అర్ధంతరంగా నిలిచె
ABN , Publish Date - May 09 , 2025 | 01:37 AM
ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ చూడని అరుదైన ఘటన ఇది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మ్యాచ్ భద్రతా కారణాల రీత్యా మధ్యలోనే ఆగింది....
నేటి మ్యాచ్
లఖ్‌నవూ X బెంగళూరు
వేదిక : లఖ్‌నవూ, రా.7.30 నుంచి
ఐపీఎల్‌పై నీలినీడలు
ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ రద్దు
10.1 ఓవర్లపాటు సాగిన ఆట
ధర్మశాల: ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ చూడని అరుదైన ఘటన ఇది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మ్యాచ్ భద్రతా కారణాల రీత్యా మధ్యలోనే ఆగింది. గురువారం రాత్రి జమ్మూ, పఠాన్‌కోట్‌లపై పాక్ దాడులకు తెగబడింది. దీంతో ముందు జాగ్రత్తగా ధర్మశాలలో బ్లాక్‌అవుట్ ప్రకటించగా, ఇక్కడే జరుగుతున్న మ్యాచ్‌ను కూడా అర్ధంతరంగా రద్దు చేశారు. వాస్తవానికి పంజాబ్ ఇన్నింగ్స్ 10.1 ఓవర్లపాటు సజావుగానే సాగింది. ఆ తర్వాత ఒక్కసారిగా స్టేడియంలోని ఓ ఫ్లడ్‌లైట్ ఆఫ్ అయ్యింది. మొదట ఏదైనా సమస్య వచ్చిందేమోనని అంతా భావించారు. కానీ కాసేపటికే మరో రెండు ఫ్లడ్‌లైట్లను ఆపేయడంతో స్టేడియంలో చీకటి నెలకొంది. అప్పటికే ఆటగాళ్లతో పాటు అంపైర్లు కూడా మైదానం వీడారు. అలాగే స్టేడియంలోని ప్రేక్షకులను కూడా బయటికి వెళ్లాల్సిందిగా అధికారులు కోరారు. ఈ క్రమంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా స్థానిక పోలీసులు, ఆర్మీ సిబ్బంది పర్యవేక్షించారు. మరోవైపు పటిష్ట భద్రత మధ్య ఇరు జట్ల ఆటగాళ్లను స్టేడియం నుంచి హోటళ్లకు తరలించారు.
ఈ మ్యాచ్ ఆగే సమయానికి పంజాబ్ 10.1 ఓవర్లలో 122/1 స్కోరుతో ఉంది. ప్రియాన్ష్ ఆర్య (34 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 70), ప్రభ్‌సిమ్రన్ (28 బంతుల్లో 7 ఫోర్లతో 50 నాటౌట్) అర్ధసెంచరీలు సాధించారు.
ఓపెనర్ల జోరు: వర్షం కారణంగా ఈ మ్యాచ్ గంట ఆలస్యంగా ఆరంభమైంది. అయితే టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్‌కే మొగ్గు చూపింది. కెప్టెన్ శ్రేయాస్ నిర్ణయాన్ని ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్ ఆర్య వమ్ము చేయలేదు. డీసీ బౌలర్లను చెడుగుడు ఆడేస్తూ పరుగుల వరద పారించారు. ఆర్య ఇన్నింగ్స్ తొలి రెండు బంతులను ఫోర్లుగా మలచగా.. అటు ప్రభ్ మూడో ఓవర్‌లో మూడు ఫోర్లు రాబట్టాడు. ఇక చమీర ఓవర్‌లో ఆర్య మరింతగా చెలరేగడంతో 6,4,4తో 18 రన్స్ సమకూరాయి. అయితే ఆరో ఓవర్‌లో పేసర్ నటరాజన్ కేవలం నాలుగు పరుగులే ఇచ్చినా అప్పటికే పవర్‌ప్లేలో 69 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. ఆ తర్వాత ఆర్య ఓ సిక్సర్‌తో 25 బంతుల్లోనే తన అర్ధసెంచరీని పూర్తి చేశాడు. కుల్దీ్‌పను కూడా వదలకుండా తను పదో ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదగా.. ప్రభ్ ఓ ఫోర్‌తో వరుసగా నాలుగో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. పదో ఓవర్‌లోనే స్కోరు 122కి చేరిన వేళ.. పేసర్ నటరాజన్ ఈ ప్రమాదకర జోడీని విడదీశాడు. 11వ ఓవర్‌తో తొలి బంతికే ఆర్యను అవుట్ చేశాడు. ఆ వెంటనే శ్రేయాస్ క్రీజులోకి రావడం.. ఫ్లడ్‌లైట్లను ఆపివేయడం జరిగింది. కాసేపటికే అంపైర్లు, ఆటగాళ్లు మైదానం వీడారు.
సాంకేతిక కారణమన్న బీసీసీఐ
బీసీసీఐ మాత్రం స్టేడియం ఉన్న ప్రాంతంలో విద్యుత్ సమస్య కారణంగా ఓ ఫ్లడ్‌లైట్‌లో లోపం తలెత్తిందని, అందుకే మ్యాచ్‌ను రద్దు చేశామని ప్రకటించింది.
లీగ్ కొనసాగేనా?
పాకిస్థాన్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్ కొనసాగింపుపై సందిగ్ధత నెలకొంది. గురువారం ధర్మశాలలో మ్యాచ్ ఇన్నింగ్స్ మధ్యలోనే ఆగిపోవడం పరిస్థితి తీవ్రతను చాటిచెబుతోంది. అలాగే లీగ్‌లో విదేశీ ఆటగాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. వారి భద్రతను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే వారు తమ ఆందోళనను బీసీసీఐకి తెలియజేశారు. ఇదే విషయమై బోర్డు అత్యవసరంగా సమావేశమైంది. సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొన్న వేళ.. మ్యాచ్‌ల కోసం ఆటగాళ్లంతా వివిధ ప్రాంతాలకు ప్రయాణించడం ఏమేరకు క్షేమకరమనేది బోర్డు ఆలోచిస్తోంది. కొన్ని నగరాల్లో విమానాశ్రయాలు మూసివేయడంతో సదరు జట్ల ఆటగాళ్లను మ్యాచ్‌ల వేదికలకు తరలించడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడం సబబేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. మరి.. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
స్కోరుబోర్డు
పంజాబ్: ప్రియాన్ష్ (సి) తివారి (బి) నటరాజన్ 70, ప్రభ్‌సిమ్రన్ (నాటౌట్) 50, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 10.1 ఓవర్లలో 122/1; వికెట్ పతనం: 1-122; బౌలింగ్: స్టార్క్ 2-0-23-0, చమీర 2-0-27-0, అక్షర్ 2-0-25-0, నటరాజన్ 1.1-0-4-1, కుల్దీప్ 2-0-29-0, మాధవ్ తివారి 1-0-14-0.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్ డ్రోన్ దాడులు
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..