Share News

Sunrisers Vs RCB: ఇషాన్‌ షో

ABN , Publish Date - May 24 , 2025 | 06:06 AM

ఇషాన్ కిషన్‌ ధాటిగా 94 నాటౌట్‌ స్కోరు చేయడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 231 పరుగులు చేసి, ఆర్‌సీబీపై 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఐదు ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన బెంగళూరు పోరాటం విఫలమైంది.

Sunrisers Vs RCB: ఇషాన్‌ షో

  • చెలరేగిన సన్‌రైజర్స్‌ బౌలర్లు

  • బెంగళూరుకు ఝలక్‌

  • పోరాడిన సాల్ట్‌, విరాట్‌

  • 48 బంతుల్లో 94 నాటౌట్‌

లఖ్‌నవూ: టాప్‌-2 స్థానాల కోసం పోటీ పడుతున్న గుజరాత్‌, బెంగళూరు జట్లకు ప్లేఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన టీమ్స్‌ ఝలక్‌ ఇస్తున్నాయి. గిల్‌ సేన లఖ్‌నవూ చేతిలో ఓడినట్టుగానే.. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో అదరగొట్టింది. ఇషాన్‌ కిషన్‌ (48 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 94 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. భారీ ఛేదనను దీటుగా ఆరంభించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు చివర్లో బౌలర్లు చెక్‌ పెట్టారు. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజర్స్‌ 42 రన్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ గెలిస్తే టాప్‌లోకి వెళ్లేది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగులు చేసింది. అభిషేక్‌ (17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 34) రాణించారు. షెఫర్డ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో బెంగళూరు 19.4 ఓవర్లలో పరుగులు చేసింది. సాల్ట్‌ (32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62), విరాట్‌ (25 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 43) మాత్రమే ఆకట్టుకున్నారు. కమిన్స్‌కు మూడు, ఎషాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఇషాన్‌ నిలిచాడు.


16 పరుగులు..7 వికెట్లు: భారీ ఛేదనను ఆర్‌సీబీ ఆత్మవిశ్వాసంతో మొదలెట్టి పేలవంగా ముగించింది. ఓపెనర్లు విరాట్‌, సాల్ట్‌.. రైజర్స్‌ బౌలర్లను ఆరంభం నుంచే దీటుగా ఎదుర్కొన్నారు. ఈ జోడీ చక్కటి వేదికను ఏర్పరిచినా ఆఖరి ఐదు ఓవర్లలో 16 పరుగులకే 7 వికెట్లను కోల్పోయిన జట్టు మ్యాచ్‌ను కూడా చేజార్చుకుంది. విరాట్‌ వరుస బౌండరీలతో ముందు జోరు చూపాడు. ఆరో ఓవర్‌లో విరాట్‌ 6 సాల్ట్‌ 4,6తో 17 రన్స్‌ రాగా పవర్‌ప్లేను 72 రన్స్‌తో ముగించింది. అయితే చక్కగా కుదురుకున్న విరాట్‌ను హర్ష్‌ దూబే అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ ఆ తర్వాత సాల్ట్‌ ఎడాపెడా షాట్లతో విజృంభించాడు. దీంతో 27 బంతుల్లోనే అతడి ఫిఫ్టీ పూర్తయ్యింది. ఈ దశలో వరుస ఓవర్లలో మయాంక్‌ (11), సాల్ట్‌ వికెట్లను కోల్పోవడం దెబ్బతీసింది. జితేశ్‌-పటీదార్‌ (18) కాసేపు నిలదొక్కుకుని నాలుగో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. ఇక డెత్‌ ఓవర్లలో రైజర్స్‌ బౌలర్లు అదరగొట్టారు. 16వ ఓవర్‌లో పటీదార్‌ రనౌట్‌తో పాటు షెఫర్డ్‌ డకౌట్‌ కాగా తర్వాతి ఓవర్‌లోనే జితేశ్‌ను కోల్పోవడంతో ఆర్‌సీబీకి ఆశల్లేకుండా పోయాయి.


ఇషాన్‌ దూకుడు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ ఓ పక్క వికెట్లు కోల్పోయినా.. పరుగుల వేట మాత్రం ఆపలేదు. ఇషాన్‌ కిషన్‌ కీలక ఇన్నింగ్స్‌తో మెరవగా.. నితీశ్‌ (6) మినహా కీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్‌ అతడికి తమ వంతుగా సహకరించారు. దీంతో ఆరంభం నుంచే స్కోరు బోర్డు 11 పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. మధ్యలో కాస్త నెమ్మదించినా, చివరి మూడు ఓవర్లలో 43 రన్స్‌తో భారీ స్కోరందుకుంది. ఓపెనర్లు అభిషేక్‌, హెడ్‌ (17)ల ధాటికి 3.3 ఓవర్లలోనే 50 పరుగులు సాధించింది. పవర్‌ప్లేలోనే ఈ జోడీ వెనుదిరిగినా అప్పటికే 71/2 స్కోరుతో పటిష్టంగా నిలిచింది. ఆ తర్వాత ఇషాన్‌ బాధ్యత తీసుకుని క్లాసెన్‌ (24)తో మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. తొమ్మిదో ఓవర్‌లో ఇషాన్‌ రెండు ఫోర్లు, క్లాసెన్‌ ఓ ఫోర్‌తో స్కోరు వందకి చేరింది. అయితే అదే ఓవర్‌లో క్లాసెన్‌ను స్పిన్నర్‌ సుయాష్‌ అవుట్‌ చేశాడు. అనికేత్‌ (26) 11వ ఓవర్‌లో 6,4,6తో 19 రన్స్‌ రాబట్టాడు. తర్వాతి ఓవర్‌లోనూ అతడు సిక్సర్‌ బాదినా క్రునాల్‌కు చిక్కాడు. అటు పది ఇన్నింగ్స్‌ తర్వాత ఇషాన్‌ 28 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. నితీశ్‌ నిరాశపర్చినా అభినవ్‌ (12), కమిన్స్‌ (13)తో కలిసి ఇషాన్‌ చివర్లో జోరు చూపాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 6,4 బాదిన ఇషాన్‌ తన సెంచరీకి ఆరు పరుగుల దూరంలో నిలవాల్సి వచ్చింది. ఏడో వికెట్‌కు ఇషాన్‌-కమిన్స్‌ అజేయంగా 43 పరుగులు జోడించారు.


స్కోరుబోర్డు

సన్‌రైజర్స్‌: అభిషేక్‌ శర్మ (సి) సాల్ట్‌ (బి) ఎంగిడి 34, హెడ్‌ (సి) షెఫర్డ్‌ (బి) భువనేశ్వర్‌ 17, ఇషాన్‌ (నాటౌట్‌) 94, క్లాసెన్‌ (సి) షెఫర్డ్‌ (బి) సుయాశ్‌ 24, అనికేత్‌ (సి) భువనేశ్వర్‌ (బి) క్రునాల్‌ 26, నితీశ్‌ (సి) క్రునాల్‌ (బి) షెఫర్డ్‌ 4, అభినవ్‌ (సి) సాల్ట్‌ (బి) షెఫర్డ్‌ 12, కమిన్స్‌ (నాటౌట్‌) 13, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 231/6; వికెట్ల పతనం: 1-54, 2-54, 3-102, 4-145, 5-164, 6-188; బౌలింగ్‌: యశ్‌ దయాల్‌ 3-0-36-0, భువనేశ్వర్‌ 4-0-43-1, ఎంగిడి 4-0-51-1, సుయాశ్‌ 3-0-45-1, క్రునాల్‌ 4-0-38-1, షెఫర్డ్‌ 2-0-14-2.

బెంగళూరు: సాల్ట్‌ (సి) హర్షల్‌ (బి) కమిన్స్‌ 62, కోహ్లీ (సి) అభిషేక్‌ (బి) దూబే 43, మయాంక్‌ (సి) ఇషాన్‌ (బి) నితీశ్‌ 11, పటీదార్‌ (రనౌట్‌) 18, జితేశ్‌ (సి) అభినవ్‌ (బి) ఉనాద్కట్‌ 24, షెఫర్డ్‌ (సి అండ్‌ బి) మలింగ 0, క్రునాల్‌ (హిట్‌వికెట్‌) (బి) కమిన్స్‌ 8, డేవిడ్‌ (సి) క్లాసెన్‌ (బి) మలింగ 1, భువనేశ్వర్‌ (బి) కమిన్స్‌ 3, యశ్‌ దయాల్‌ (సి) అనికేత్‌ (బి) హర్షల్‌ 3, ఎంగిడి (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 19.5 ఓవర్లలో 189 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-80, 2-120, 3-129, 4-173, 5-174, 6-174, 7-179, 8-186, 9-187, 10-189; బౌలింగ్‌: కమిన్స్‌ 4-0-28-3, ఉనాద్కట్‌ 4-0-41-1, హర్షల్‌ 3.5-0-39-1, మలింగ 4-0-37-2, హర్ష్‌ దూబే 2-0-20-1, నితీశ్‌ 2-0-13-1.

Updated Date - May 24 , 2025 | 06:09 AM