Share News

IPL 2025, RR vs LSG: రాజస్తాన్ రాత మారేనా.. లఖ్‌నవూపై గెలిచి నిలిచేనా

ABN , Publish Date - Apr 19 , 2025 | 05:01 PM

జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ రోజు (ఏప్రిల్ 19) రాజస్తాన్ రాయల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్ రాయల్స్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.

IPL 2025, RR vs LSG: రాజస్తాన్ రాత మారేనా.. లఖ్‌నవూపై గెలిచి నిలిచేనా
RR vs LSG

వరుస పరాజయాలతో సతమతమవుతున్న రాజస్తాన్ రాయల్స్ (RR) జట్టు ఐపీఎల్ (IPL 2025) ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో తలపడబోతోంది (RR vs LSG). జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ రోజు (ఏప్రిల్ 19) రాజస్తాన్ రాయల్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్ రాయల్స్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది.


లఖ్‌నవూ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగింట్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో ఓటమి నుంచి కోలుకుని విజయాల బాట పట్టాలని లఖ్‌నవూ కృత నిశ్చయంతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని రాజస్తాన్ పట్టుదలగా ఉంది.


ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఐదు సార్లు తలపడ్డాయి. వాటిల్లో నాలుగు మ్యాచ్‌ల్లో రాజస్తాన్ విజయం సాధించింది. లఖ్‌నవూ కేవలం ఒక్కసారి మాత్రమే రాజస్తాన్‌పై గెలుపొందింది. గత సీజన్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ లఖ్‌నవూపై రాజస్తాన్‌దే పై చేయి. రాజస్తాన్‌పై లఖ్‌నవూకు గతంలో మంచి రికార్డు లేనప్పటికీ ఈ సీజన్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. హార్డ్ హిట్టర్లతో కూడిన లఖ్‌నవూ రాజస్తాన్‌ కంటే బలంగా ఉంది.


ఈ మ్యాచ్‌లో కూడా ఆర్ఆర్‌పై లఖ్‌నవూదే పైచేయి అని చెప్పవచ్చు. అయితే స్వంత స్టేడియంలో ఆడుతుండడం ఆర్‌ఆర్‌కు కలిసొస్తుందేమో చూడాలి. జైపూర్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంగా చెప్పవచ్చు. మంచు ప్రభావం పెద్దగా ఉండదు కాబట్టి టాస్ అంత కీలకం కాబోదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి, ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే రాజస్తాన్‌కు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి. గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్ షాక్ నుంచి కోలుకుని ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2025 | 09:14 PM