Share News

IPL 2025, RCB vs PBKS: సమఉజ్జీల సమరం.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

ABN , Publish Date - Apr 18 , 2025 | 04:52 PM

ఈ సీజన్‌లో దాదాపు ఒకేలా ప్రయాణం సాగిస్తున్న పంజాబ్ కింగ్స్ లెవెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఈ రోజు (ఏప్రిల్ 18) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. ఇప్పటివరకు ఆడిన ఆరేసి మ్యాచ్‌లు ఆడి నాలుగేసి విజయాలు సాధించాయి.

IPL 2025, RCB vs PBKS: సమఉజ్జీల సమరం.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
RCB vs PBKS

ఐపీఎల్‌ (IPL 2025)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఈ సీజన్‌లో దాదాపు ఒకేలా ప్రయాణం సాగిస్తున్న పంజాబ్ కింగ్స్ లెవెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (PBKS vs RCB) జట్లు ఈ రోజు (ఏప్రిల్ 18) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. ఇప్పటివరకు ఆరేసి మ్యాచ్‌లు ఆడి నాలుగేసి విజయాలు సాధించిన రెండు జట్లు ఈ రోజు అమీ తుమీ తేల్చుకోబోతున్నాయి. ఒక మ్యాచ్‌లో గెలవడం, తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోవడం ఈ రెండు జట్లకు పరిపాటిగా మారింది.


ఇరు జట్లు ఇప్పటి వరకు నాలుగేసి మ్యాచ్‌లు గెలిచినప్పటికీ రన్‌రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో ఆర్సీబీ మూడో స్థానంలోనూ, పంజాబ్ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. కాగా, స్వంత మైదానం అయిన బెంగళూరులో ఆర్సీబీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. మరి, ఈ రోజు స్వంత మైదానంలో ఆ సెంటిమెంట్‌కు చెక్ పెడుతుందేమో చూడాలి. మరోవైపు కోల్‌కతాతో గత మ్యాచ్‌లో కేవలం 111 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని అద్భుత విజయం సాధించిన పంజాబ్ ఉత్సాహంగా ఉంది. చిన్నస్వామి స్టేడియం ఎప్పుడూ బ్యాటర్ల కంటే బౌలర్లకే మద్దతుగా ఉంటుంది.


ఎప్పటిలాగానే బెంగళూరుకు విరాట్ కోహ్లీనే కచ్చితంగా బలం. కోహ్లీ తర్వాత ఫిల్ సాల్ట్, పడిక్కళ్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్, లివింగ్‌స్టన్‌తో కూడిన బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. బ్యాటింగ్‌తో పోల్చుకుంటే బౌలింగ్ కాస్త బలహీనంగా కనబడుతోంది. మరోవైపు పంజాబ్ కూడా బౌలింగ్‌లోనే కాస్త బలహీనంగా ఉంది. శ్రేయస్ అయ్యర్, ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, నేహల్ వధేరా వంటి బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో కనబడుతున్నారు.


తుది జట్లు:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (అంచనా): ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కళ్, రజత్ పటిదార్, లివింగ్‌స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, హాజెల్‌వుడ్, యశ్ దయాళ్

పంజాబ్ కింగ్స్ (అంచనా): ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, ఛాహల్, అర్ష్‌దీప్ సింగ్, యశ్ ఠాకూర్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 18 , 2025 | 04:52 PM