IPL 2025 PBKS vs LSG: అదరగొట్టిన అర్ష్‌దీప్.. లఖ్‌నవూపై పంజాబ్ ఘన విజయం
ABN , Publish Date - May 04 , 2025 | 11:18 PM
అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవని ధర్మశాల మైదానంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మరోవైపు కీలకమైన మ్యాచ్‌లో లఖ్‌నవూ ఆటగాళ్లు చేతులెత్తేశారు.
అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు సమష్టిగా రాణించడంతో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవని ధర్మశాల మైదానంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. మరోవైపు కీలకమైన మ్యాచ్‌లో లఖ్‌నవూ ఆటగాళ్లు చేతులెత్తేశారు. ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకున్నారు. మొదట ప్రభ్‌సిమ్రన్ సింగ్ (91), బౌలింగ్‌లో అర్ష్‌దీప్ (3/16) రాణించడంతో పంజాబ్ అద్భుత విజయం సాధించింది.

ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్లు తలపడ్డాయి (PBKS vs LSG). టాస్ గెలిచిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఓవర్లనే ప్రియాంశ్ ఆర్యను అవుట్ చేసి ఆకాశ్ సింగ్ షాకిచ్చాడు. అయితే ఆ తర్వాత లఖ్‌నవూ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (48 బంతుల్లో 91) తన ఫామ్‌ను కొనసాగిస్తూ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (45), జాస్ ఇంగ్లిస్ (30) సహకరించారు. చివర్లో శశాంక్ సింగ్ (33 నాటౌట్) కీలక పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. లఖ్‌నవూ బౌలర్లలో ఆకాశ్ సింగ్, దిగ్వేష్ రాఠీ రెండేసి వికెట్లు తీశారు.
237 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ టీమ్ ఏ దశలోనూ విజయం సాధించేలా కనిపించలేదు. కనీస పోటీ కూడా ఇవ్వలేదు. పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ ధాటికి మార్‌క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ స్వల్ప స్కోర్లకే పెవలియన్ చేరారు. రిషభ్ పంత్ (18), డేవిడ్ మిల్లర్ (11)లను ఒమర్జాయ్ పెవిలియన్ చేర్చాడు. ఆయుష్ బదోనీ (40 బంతుల్లో 74) కీలక ఇన్నింగ్స్‌తో పోరాటం చేశాడు. అబ్దుల్ సమద్ (45) కూడా రాణించాడు. చివరకు లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేసింది. 37 పరుగులతో ఓటమి చవిచూసింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..