IPL 2025 MI vs GT: తిరిగి వచ్చిన రబాడా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
ABN , Publish Date - May 06 , 2025 | 06:11 PM
ఐపీఎల్ (IPL 2025)లో కీలకమైన ప్లే ఆఫ్స్ కోసం పోరు జరగబోతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
ఐపీఎల్ (IPL 2025)లో కీలకమైన ప్లే ఆఫ్స్ కోసం పోరు జరగబోతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది (GT vs MI). ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ముంబై ఇండియన్స్ జట్టుకు గత ఆరు మ్యాచ్‌ల్లో పరాజయం అనేదే లేదు. గుజరాత్ టైటాన్స్ జట్టు గత ఐదు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కీలక మ్యాచ్ జరగబోతోంది.

ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబాడా దక్షిణాఫ్రికా వెళ్లిపోయాడు. తాజాగా తిరిగి జట్టుతో చేరాడు. ఈ రోజు ముంబైతో జరిగే కీలక మ్యాచ్‌లో బరిలోకి దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో గుజరాత్ బౌలింట్ ఎటాక్ మరింత బలపడనుంది. మహ్మద్ సిరాజ్, రబాడా, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్‌తో కూడిన బౌలింగ్ విభాగాన్ని ఎదుర్కోవడం ముంబైకు సవాలే. అలాగే సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జాస్ బట్లర్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు.
మరోవైపు ముంబై టీమ్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. రోహిత్ శర్మ, రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా పరుగుల వరద పారిస్తున్నారు. ఇక, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా వంటి క్లాస్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు చేయడం ఎంతటి వారికైనా సవాలుతో కూడుకున్న పనే. ముంబైలో వాంఖడే పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. అయితే ముంబైలో మంగళవారం సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అయితే భారీ వర్షం కాకుండా మ్యాచ్‌కు అంతరాయం కలిగించే స్థాయిలో చినుకులు పడవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో చూడాలి.
తుది జట్లు:
ముంబై ఇండియన్స్ (అంచనా): రోహిత్ శర్మ, రికెల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, బాష్, దీపక్ ఛాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
గుజరాత్ టైటాన్స్ (అంచనా): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, షారూక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, కోయేట్జ్, రబాడా, సిరాజ్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..