IPL 2025 KKR vs CSK: ఈడెన్‌లో కీలక పోరు.. కోల్‌కతా నైట్ రైడర్స్ గెలిచి తీరాల్సిందే
ABN , Publish Date - May 07 , 2025 | 04:41 PM
ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఐదు విజయాలతో 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇక, మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది.
టోర్నీని (IPL 2025) సానుకూలంగా ప్రారంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు ఆ తర్వాత తడబడింది. వరుస పరాజయాలతో కుదేలైంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ ఐదు విజయాలతో 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఇక, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు చేరుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది (KKR vs CSK). ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గెలిచి తీరాల్సిందే. ఓడిపోతే ప్లే ఆఫ్స్‌పై ఆశలు వదిలేసుకోవాల్సిందే.

మరోవైపు ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్-2025 నుంచి నిష్క్రమించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న చెన్నై ఇక ఈ టోర్నీలో నామమాత్రంగానే ఆడుతోంది. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో కోల్‌కతాను ఓడిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీస్తుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన చెన్నై టీమ్ కేవలం రెండింట్లో మాత్రమే గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే ఇంత ఘోర ప్రదర్శన ఇంతకు ముందు ఎన్నడూ చేయలేదనే చెప్పాలి.
ఐపీఎల్ చరిత్రలో చెన్నై, కోల్‌కతా టీమ్‌లు ఇప్పటివరకు 30 సార్లు తలపడ్డాయి. అందులో 19 సార్లు చెన్నై విజయం సాధించగా, 11 సార్లు కోల్‌కతా గెలుపొందింది. ఈ రోజు మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం మంచిది. ఈ వారంలో కొన్ని మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా నిలుస్తోంది. అయితే ఈ రోజు కోల్‌కతాలో మాత్రం వర్షం భయం దాదాపు లేదనే చెప్పాలి. వర్షం పడే సూచనలు కనిపించడం లేదు. మరి, ఈ కీలకమైన మ్యాచ్‌లో చెన్నై ఎలా ఆడుతుందో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి.