IPL 2025, GT vs RR: సాయి సుదర్శన్ సూపర్ ఫామ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - Apr 09 , 2025 | 09:24 PM
ఐపీఎల్‌లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించిన సాయి సుదర్శన్ తాజా మ్యాచ్‌లో కూడా సత్తా చాాటాడు.

ఐపీఎల్ (IPL 2025)లో గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ (Sai Sudarshan) సూపర్ ఫామ్ కొనసాగుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించిన సాయి సుదర్శన్ తాజా మ్యాచ్‌లో 82 పరుగులు చేసి గుజరాత్ భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ (GT vs RR) జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది.
గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 2 పరుగులకే అవుటైనా మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (53 బంతుల్లో 3 సిక్స్‌లు, 8 ఫోర్లతో 82) మాత్రం తన ఫామ్‌ను కొనసాగించాడు. సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించాడు. సెంచరీ చేస్తాడనుకునే సమయంలో తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో అవుటై వెనుదిరిగాడు. జోస్ బట్లర్ (36), షారూక్ ఖాన్ (36), తెవాటియా (24) కీలక ఇన్నింగ్స్ ఆడారు. రూథర్‌ఫోర్డ్ (7), రషీద్ ఖాన్ (12) వేగంగా ఆడే క్రమంలో అవుటయ్యారు. దీంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. రాజస్తాన్ ముందు 218 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, తీక్షణ రెండేసి వికెట్లు తీశారు. సందీప్ శర్మ ఒక వికెట్ తీశాడు. గిల్ సారథ్యంలోని గుజరాత్ వరుస విజయాలతో జోరుమీదుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక, ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్ రెండింట్లో గెలిచింది. మరి, ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ గెలవాలంటే 218 పరుగులు చేయాలి. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ ఈ ఛేజింగ్‌లో కీలకం కాబోతున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..