Share News

IPL 2025 CSK vs PBKS: చెన్నైకు లాస్ట్ ఛాన్స్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:08 PM

స్వంత మైదానం అయిన చెపాక్ స్టేడియంలో చెన్నై వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. తమ తొలి మ్యాచ్‌లో ముంబైని ఓడించిన తర్వాత చెపాక్‌లో చెన్నైకు వరుసగా పరాజయాలే ఎదురవుతున్నాయి. ఆ అపప్రదను తొలగించుకోవాలని చెన్నై కృతనిశ్చయంతో ఉంది.

IPL 2025 CSK vs PBKS: చెన్నైకు లాస్ట్ ఛాన్స్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
PBKS vs CSK

వరుస పరాజయాలతో కునారిల్లుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తన చివరి అవకాశాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు చెన్నైలోని స్వంత మైదానం అయిన చెపాక్ స్టేడియంలో (Chepauk Stadium) పంజాబ్ కింగ్స్ జట్టుతో తలపడుతోంది (CSK vs PBKS). ఆ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే అధికారికంగా చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతైనట్టే.


స్వంత మైదానం అయిన చెపాక్ స్టేడియంలో చెన్నై వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. తమ తొలి మ్యాచ్‌లో ముంబైని ఓడించిన తర్వాత చెపాక్‌లో చెన్నైకు వరుసగా పరాజయాలే ఎదురవుతున్నాయి. ఆ అపప్రదను తొలగించుకోవాలని చెన్నై కృతనిశ్చయంతో ఉంది. (IPL 2025)

dhoni.jpg


మరోవైపు గత ఐదు మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించిన పంజాబ్ కింగ్స్ కూడా గాడిలో పడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మ్యాచ్‌లో మంచి రన్‌రేట్‌తో విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో ఐదో ప్లేస్ నుంచి ఏకంగా రెండో స్థానానికి వెళ్లిపోతుంది. పంజాబ్ టీమ్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆరంభంలో మెరుపులు మెరిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆ తర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. అలాగే మిడిలార్డర్‌లో నేహల్ వధేరా తప్పించి మిగతా బ్యాటర్లు విఫలమవుతున్నారు. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాణించలేదు. అర్ష్‌దీప్, ఛాహల్, యన్‌సెన్‌తో కూడిన బౌలింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది.


మరోవైపు చెన్నై టీమ్ ఐపీఎల్‌లోనే అత్యంత బలహీనమైన జట్టుగా కనబడుతోంది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ తడబడుతోంది. పరుగుల కోసం 43 ఏళ్ల ధోనీ మీదనే ఇంకా ఆధారపడుతోందంటే ఆ జట్టు బ్యాటింగ్ విభాగం ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రచిన్ రవీంద్ర, శ్యామ్ కర్రన్ పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. శివమ్ దూబే, రవీంద్ర జడేజా పరుగులు చేయగలుగుతున్నా వేగంగా ఆడలేకపోతున్నారు. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మహేశ్ పతిరణతో కూడా బౌలింగ్ విభాగం కాస్త ఫర్వాలేదనిపిస్తోంది.


తుది జట్లు:

పంజాబ్ కింగ్స్ (అంచనా): ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, జాస్ ఇంగ్లీస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మ్యాక్స్‌వెల్, ఒమర్జాయ్/బ్రాట్‌లెట్, యన్‌సెన్, అర్ష్‌దీప్ సింగ్, ఛాహల్

చెన్నై సూపర్ కింగ్స్ (అంచనా): షేక్ రషీద్, ఆయుష్ మాత్రే, దీపక్ హుడా, శామ్ కర్రన్, రవీంద్ర జడేజా, బ్రేవిస్, శివమ్ దూబే, ధోనీ, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మహేశ్ పతిరణ

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 30 , 2025 | 05:08 PM