Share News

Historic Test Win: మధురాతి మధురం

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:15 AM

ఇంగ్లండ్‌ గడ్డపై భారత జట్టు టెస్టు మ్యాచ్‌ గెలిచి దాదాపు నాలుగు సంవత్సరాలైంది. కరోనా మహమ్మారి సమయంలో ఆ దేశంలో పర్యటించిన టీమిండియా..ఆ సిరీస్‌ నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో నెగ్గింది...

Historic Test Win: మధురాతి మధురం

ఇంగ్లండ్‌ గడ్డపై భారత జట్టు టెస్టు మ్యాచ్‌ గెలిచి దాదాపు నాలుగు సంవత్సరాలైంది. కరోనా మహమ్మారి సమయంలో ఆ దేశంలో పర్యటించిన టీమిండియా..ఆ సిరీస్‌ నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో నెగ్గింది. ఇక ఈసారి గెలుపు జట్టుకు ఎంతో..ఎంతో ప్రత్యేకం. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, అశ్విన్‌ వంటి దిగ్గజ ఆటగాళ్లు లేకుండా ఇంగ్లండ్‌లో టీమిండియా పర్యటిస్తోంది. పైగా..కొత్త కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, జట్టులోనూ అంతా కుర్రాళ్లు. జట్టు పరివర్తన దిశగా సాగుతోంది. మరోవైపు స్టోక్స్‌, రూట్స్‌, వోక్స్‌లాంటి క్రికెటర్లతో ఇంగ్లిషు జట్టు పటిష్టంగా ఉంది. అలాంటి జట్టును వారి గడ్డపై ఓడించడం అంటే మామాలు విషయం కాదు. పైగా తొలి టెస్టు ఓటమి నుంచి త్వరగా కోలుకొని రెండో మ్యాచ్‌లో ప్రత్యర్థిని మట్టి కరిపించడం యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టుకు మరెంతో విశేషం. ముఖ్యంగా సారథి గిల్‌ జట్టును నడిపించిన తీరు అద్భుతం. మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో శతకంతో విజయంలో కీలక భూమిక పోషించాడు. అంతేకాదు..కెప్టెన్సీ భారం కాదని రెండు ఇన్నింగ్స్‌ల్లో తన ఆటతీరుతో నిరూపించాడు. యశస్వీ జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, పంత్‌ తమవంతు పాత్ర సమర్థంగా నిర్వర్తిస్తే, బుమ్రా లేని లోటును మరిపిస్తూ సిరాజ్‌, ఆకాశ్‌దీ్‌ప ప్రత్యర్థిని గడగడలాడించారు. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాదీ సిరాజ్‌ ఆరు వికెట్లతో చెలరేగితే..నేనేమన్నా తక్కువ తిన్నానా..అంటూ ఆకాశ్‌దీ్‌ప రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించాడు. మొత్తంగా సమష్టితత్వంతో దక్కిన ఈ విజయం భారత్‌కు మధురాతి మధురం. ఈ గెలుపు దరిమిలా లభించిన ఆత్మవిశ్వాసంతో విశ్వవిఖ్యాత లార్డ్స్‌ మైదానంలో జరిగే మూడో టెస్టుకు భారత్‌ ఇనుమడించిన ఉత్సాహంతో బరిలో దిగుతుందనడంలో సందేహం లేదు. ఇదే ఊపులో మనోళ్లు టెస్టు సిరీస్‌ సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఇవీ చదవండి:

మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ కోచ్

పంత్‌-గంభీర్ వీడియో వైరల్!

టీమిండియా కోచ్ సెటైర్లు మామూలుగా లేవుగా!

మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 07 , 2025 | 02:15 AM