Under-19 T20 World Cup : అమ్మాయిలూ.. అదరగొట్టాలి
ABN , Publish Date - Jan 18 , 2025 | 05:14 AM
భారత కొత్తతరం మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా నిరూపించుకోవాలనుకుంటున్నారు. శనివారం నుంచి మలేసియాలో అండర్-19 టీ20 వరల్డ్‌కప్ ఆరంభం

నేటి నుంచి అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్
ఉదయం 8 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్
తొలి రోజే ఆరు మ్యాచ్‌లు
రేపు విండీ్‌సతో యువ భారత్ పోరు
కౌలాలంపూర్: భారత కొత్తతరం మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా నిరూపించుకోవాలనుకుంటున్నారు. శనివారం నుంచి మలేసియాలో అండర్-19 టీ20 వరల్డ్‌కప్ ఆరంభం కాబోతోంది. 2023లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి మెగా టోర్నీలో షఫాలీ వర్మ నేతృత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. ఈసారి నికీ ప్రసాద్ కెప్టెన్సీలో టీమ్ చెలరేగి రెండో టీ20 వరల్డ్‌కప్‌ను సైతం ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా, వీటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ప్రతీ గ్రూప్ నుంచి టాప్-3 జట్లు సూపర్ సిక్స్ దశకు వెళతాయి. ఆ తర్వాత రెండు సూపర్ సిక్స్ గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ్‌సలో తలపడతాయి. ఫిబ్రవరి 2న ఫైనల్ జరుగుతుంది. ఇక భారత జట్టు గ్రూప్ ‘ఎ’లో ఉండగా శ్రీలంక, వెస్టిండీస్, మలేసియా ఇతర జట్లు. ఆదివారం విండీ్‌సతో జరిగే పోరుతో భారత్ తమ టైటిల్ వేట ఆరంభిస్తుంది. అయితే శనివారం జరిగే టోర్నీ ప్రారంభ మ్యాచ్‌ల్లో ఆసీ్‌స-స్కాట్లాండ్, ఇంగ్లండ్-ఐర్లాండ్, సమోవా-నైజీరియా, బంగ్లాదేశ్-నేపాల్, పాకిస్థాన్-యూఎ్‌సఏ, న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి.
భారత్ షెడ్యూల్
జనవరి 19 వెస్టిండీస్‌తో
జనవరి 21 మలేసియాతో
జనవరి 23 శ్రీలంకతో
మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 12 గం. నుంచి
త్రిష మరోసారి..
గత నెలలో జరిగిన అండర్-19 ఆసియాక్‌పలో హైదరాబాదీ జి.త్రిష విశేషంగా రాణించింది. దీంతో ఆమె వరుసగా రెండోసారి ఈ మెగా టోర్నీలో చోటు దక్కించుకుంది. టాపార్డర్‌లో త్రిష దూకుడు జట్టుకు ఉపయోగపడగలదు. అలాగే స్పిన్ విభాగంలో పరునిక సిసోడియా, సోనమ్ యాదవ్, ఆయుషి శుక్లా కీలకం కానున్నారు. జట్టులో మరో ఇద్దరు తెలుగమ్మాయిలు కేసరి ధ్రుతి, షబ్నమ్‌లకు కూడా చోటు దక్కడం విశేషం.
భారత మహిళల జట్టు: నికీ ప్రసాద్ (కెప్టెన్), సానికా చాల్కే, త్రిష, కమలిని, భవిక, ఈశ్వరి, మిథిల, జోషితా, సోనమ్ యాదవ్, పరునిక, కేసరి ధ్రుతి, ఆయుషి, ఆనందిత, షబ్నమ్, వైష్ణవి.