Share News

ఆసీస్‌ గండం దాటేనా?

ABN , Publish Date - Mar 04 , 2025 | 04:22 AM

స్వదేశంలో 2023 వన్డే వరల్డ్‌కప్‌.. వరుసగా పది విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌.. ఇక కప్‌ లాంఛనమే అని సంబరాలకు సిద్ధంగా ఉన్న అభిమానులు. కానీ కోట్లాది...

ఆసీస్‌ గండం  దాటేనా?

చాంపియన్స్‌ ట్రోఫీ

మధ్యాహ్నం 2.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

భారత్‌కు కంగారూల సవాల్‌

నేడు ఇరు జట్ల మధ్య సెమీస్‌

ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఆసీ్‌సపై భారత జట్టు చివరిసారిగా 2011 వన్డే వరల్డ్‌కప్‌ క్వార్టర్స్‌లో గెలిచింది.

దుబాయ్‌: స్వదేశంలో 2023 వన్డే వరల్డ్‌కప్‌.. వరుసగా పది విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌.. ఇక కప్‌ లాంఛనమే అని సంబరాలకు సిద్ధంగా ఉన్న అభిమానులు. కానీ కోట్లాది భారతీయులను అవాక్కయ్యేలా ఆస్ట్రేలియా గట్టి ఝలక్‌ ఇచ్చి విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత ఈ ఫార్మాట్‌లో మళ్లీ ఇప్పుడు ఐసీసీ టోర్నీ సెమీస్‌ ముందు సై అంటోంది. అంతకుముందు 2015 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌, 2023 వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్లోనూ భారత్‌ను ఇంటిముఖం పట్టించింది. అందుకే ఐసీసీ నాకౌట్‌ పోరులో ఆసీస్‌ ఎదురుపడితే అమ్మో.. అనిపిస్తుంటుంది. తాజాగా చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను దక్కించుకోవాలంటే ముందు ఆసీస్‌ గండాన్ని అధిగమించాల్సి ఉంది. మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి సెమీస్‌ జరుగనుంది. ఇప్పటికే దుబాయ్‌లో హ్యాట్రిక్‌ విజయాలతో ఉన్న టీమిండియాను ఫేవరెట్‌గా భావిస్తున్నా.. ఐసీసీ టోర్నీల్లో ఎనలేని ఉత్సాహంతో ఆడే ఆసీ్‌సను తక్కువ అంచనా వేయలేం. జట్టులో స్టార్‌ ఆటగాళ్లు లేకపోవడంతో స్మిత్‌ సేన గ్రూప్‌ దశ దాటడం కూడా కష్టమేనని విశ్లేషకులు భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆసీస్‌ చాంపియన్‌ ఆటతీరును ప్రదర్శిస్తోంది. దీంతో నేటి మ్యాచ్‌లో భారత బౌలింగ్‌కు ఆసీస్‌ బ్యాటింగ్‌కు మధ్య రసవత్తర పోరు జరుగనుంది.


స్పిన్నర్లే కీలకం

చాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత జట్టులో ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేస్తే అంతా విమర్శించారు. కానీ ఇప్పుడు వారే ప్రధాన ఆయుధంగా మారడం విశేషం. భారత జట్టు తొలి రెండింట్లో ఛేదనలో నెగ్గింది. అయితే కివీ్‌సతో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగినా భారీ స్కోరు సాధించలేకపోయింది. అయితేనేం.. ఏకంగా నలుగురు స్పిన్నర్లు తడాఖా చూపారు. వీరు వేసిన 39 ఓవర్లలో 128 డాట్‌ బాల్స్‌ కావడంతో కివీస్‌ ఉక్కిరిబిక్కిరైంది. ప్రత్యర్థి తొమ్మిది వికెట్లను వీరే తీసి 250 పరుగుల లక్ష్యాన్ని కాపాడారు. అందుకే ఈసారి ఆసీ్‌సను దెబ్బతీసేందుకు కూడా స్పిన్‌ మంత్రాన్నే ప్రయోగించాలని భారత్‌ భావిస్తోంది. ముఖ్యంగా వరుణ్‌ చక్రవర్తి వైవిధ్యమైన బౌలింగ్‌తో కీలకంగా నిలిచాడు. అయితే సెమీ్‌సలోనూ అతడిని కొనసాగిస్తారా? లేకుంటే షమికి తోడు మరో స్పెషలిస్ట్‌ పేసర్‌గా హర్షిత్‌, అర్ష్‌దీ్‌పలలో ఒకరిని ఆడిస్తారా? అనేది వేచిచూడాల్సిందే. ఇక బ్యాటింగ్‌లో గిల్‌, రోహిత్‌, విరాట్‌, శ్రేయాస్‌, అక్షర్‌, రాహుల్‌ రూపంలో టాపార్డర్‌, మిడిలార్డర్‌ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. డెత్‌ ఓవర్లలో హార్దిక్‌ బ్యాట్‌ ఝుళిపిస్తున్నాడు.


బ్యాటింగ్‌పైనే భారం

ప్యాట్‌ కమిన్స్‌, హాజెల్‌వుడ్‌, స్టార్క్‌లాంటి అగ్రశ్రేణి బౌలర్లు లేకుండానే మెగా టోర్నీకి వచ్చిన ఆసీస్‌ బలహీనంగానే కనిపిస్తోంది. స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా మాత్రమే స్టార్‌ బౌలర్‌గా ఉన్నాడు. అందుకే ఇంగ్లండ్‌ 351, అఫ్ఘాన్‌ 273 పరుగులు చేయగలిగాయి. అయితే ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ మాత్రం ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో 352 పరుగుల ఛేదనను 47.3 ఓవర్లలోనే ముగించి అబ్బురపరిచింది. తాజా టోర్నీలో ఆసీస్‌ పూర్తి మ్యాచ్‌ ఆడింది ఈ ఒక్కసారే. మిగతా రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో వీరికి పెద్దగా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా పోయింది. ఇక భారత్‌కు హెడ్‌ నుంచి ఎప్పుడూ ప్రమాదమే. స్మిత్‌, ఇన్‌గ్లి్‌స, క్యారీ, మ్యాక్స్‌వెల్‌ రాణిస్తే భారీ స్కోరు ఖాయమే. అయితే మాథ్యూ షార్ట్‌ దూరం కావడంతో జంపాకు జతగా మరో స్పిన్నర్‌ లేకుండాపోయాడు. అతడి స్థానంలో కూపర్‌ కన్నోలిని తీసుకున్నారు. మ్యాక్స్‌వెల్‌, హెడ్‌ రూపంలో పార్ట్‌టైమ్‌ స్పిన్‌ అందుబాటులో ఉండనుంది. ప్రధాన పేసర్లయిన డ్వార్షిస్‌, ఎల్లిస్‌, జాన్సన్‌ భారత్‌పై రెండు వన్డేలను మాత్రమే ఆడారు.


తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, కోహ్లీ, శ్రేయాస్‌, అక్షర్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజా, కుల్దీప్‌, షమి, వరుణ్‌.

ఆస్ర్టేలియా: హెడ్‌, ఇన్‌గ్లి్‌స, స్మిత్‌, లబుషేన్‌, కూపర్‌, క్యారీ, మ్యాక్స్‌వెల్‌, డ్వార్షిస్‌, ఎల్లిస్‌, జాన్సన్‌, జంపా.

పిచ్‌

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం వాడిన పిచ్‌పైనే సెమీస్‌ జరుగబోతోంది. వికెట్‌ స్పిన్‌కు అనుకూలించనుంది. మంచు ప్రభావం కనిపించడం లేదు. దీంతో టాస్‌ నెగ్గిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం ఉంది.


దుబాయ్‌ మాకూ కొత్తే..

‘దుబాయ్‌ మా సొంత మైదానమేమీకాదు. ఇక్కడ గతంలో ఎక్కువ మ్యాచ్‌లను ఆడలేదు. దీంతో పాటు ఈ టోర్నీలో మేమాడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పిచ్‌ విభిన్నంగా స్పందించింది. ఇక్కడ నాలుగైదు పిచ్‌లను వినియోగిస్తున్నారు. ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. ఐసీసీ టోర్నీలో ఆసీ్‌సకు ఘనచరిత్ర ఉంది. ఈసారి మాత్రం మాదే పైచేయి ఉండేలా ఆడతాం. ఒత్తిడి ఇరు జట్లపైనా ఉంటుంది కాబట్టి పోరు ఆసక్తికరంగా మారనుంది’

రోహిత్‌ శర్మ

సెమీస్‌ అంపైర్లు వీరే..

భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే తొలి సెమీ్‌సకు ఐసీసీ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లను ప్రకటించింది. ఈ మ్యాచ్‌ కోసం కివీ్‌సకు చెందిన గఫానే, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ మైదానంలో అంపైర్లుగా ఉండనున్నారు. అలాగే థర్డ్‌ అంపైర్‌గా మైకేల్‌ గాఫ్‌, రెఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ వ్యవహరిస్తారు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 04 , 2025 | 04:22 AM