Share News

ఆ క్రికెటర్‌ లగేజి 250 కిలోలు

ABN , Publish Date - Feb 15 , 2025 | 05:56 AM

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత బృందంలో ఓ స్టార్‌ క్రికెటర్‌ ఏకంగా 250 కిలోల లగేజీని తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. అతని లగేజీలో మొత్తం 27 బ్యాగులున్నాయట.

ఆ క్రికెటర్‌ లగేజి  250 కిలోలు

లక్షలు చెల్లించిన బోర్డు

న్యూఢిల్లీ: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత బృందంలో ఓ స్టార్‌ క్రికెటర్‌ ఏకంగా 250 కిలోల లగేజీని తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది. అతని లగేజీలో మొత్తం 27 బ్యాగులున్నాయట. అయితే ఇవన్నీ ఆటగాడికి సంబంధించినవే అనుకుంటే పొరపాటే. అతడి కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది లగేజిని కూడా తనదిగా చూపించి ఖర్చంతా బీసీసీఐపై వేశాడని సమాచారం. ఇందుకోసం బోర్డు లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చింది. వాస్తవానికి బోర్డు నిబంధనల ప్రకారం ప్లేయర్‌ కుటుంబ సభ్యులు, అతని వ్యక్తిగత సహాయకుల లగేజీ వారి వెంటే ఉండాలి. కానీ ఆ క్రికెటర్‌ బోర్డుపై ఒత్తిడి తెచ్చి వాటన్నింటినీ తన సొంత లగేజీగా చూపించాడు. భారత్‌ నుంచి ఆసీ్‌సకు, అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలోనే కాకుండా.. ఆసీ్‌సలో వేదికలు మారినప్పుడు కూడా లగేజి ఖర్చును బోర్డు మీదే రుద్దాడు. అందుకే ఈ టూర్‌ పూర్త య్యాక బీసీసీఐ నిబంధనలు కఠినతరం చేసింది. ఇప్పుడు ఏ ఆటగాడైనా 150 కిలోలకు మించి లగేజిని వెంట తీసుకెళ్లడానికి లేదు.

250 కిలోల లగేజీ ప్రయాణ ఖర్చులు బోర్డు నెత్తిన రుద్దిన ఆ స్టార్‌ ఆటగాడు ఎవరనేది మాత్రం వెల్లడికాలేదు. కానీ ఆ లగేజీలో 17 బ్యాట్లు ఉండడాన్ని బట్టి చూస్తే...అతను ఖచ్చితంగా ఓ బ్యాటర్‌ అని మాత్రం తెలుస్తోంది. అయితే భారత స్టార్లలో ఒకడైన రోహిత్‌ శర్మ భార్య రితిక బిడ్డకు జన్మనిచ్చినందున అతని కుటుంబ సభ్యులు ఆస్ర్టేలియా వెళ్లలేదు. ఇక మిగిలిన ఒకరిద్దరు స్టార్లలో ఆ లగేజీ స్టార్‌ ఎవరో?

Updated Date - Feb 15 , 2025 | 05:56 AM