Share News

Womens Cricket World Cup Final: అమ్మాయిలూ అస్సలు వదలొద్దు

ABN , Publish Date - Nov 02 , 2025 | 03:56 AM

కోట్లాది ప్రజల ఆశలను మోస్తూ.. అమోఘమైన ప్రదర్శనతో తుది సమరంలో నిలిచిన భారత మహిళలు.. అందలాన్ని అందుకునేందుకు మిగిలింది ఒక్క అడుగే.. India Women Chase Historic Glory World Cup Final

Womens Cricket World Cup Final: అమ్మాయిలూ అస్సలు వదలొద్దు

దక్షిణాఫ్రికాతో భారత్‌ అమీతుమీ

తొలి టైటిల్‌ వేటలో ఇరు జట్లు

చిరకాల స్వప్నం.. కావాలి సాకారం

మహిళల ప్రపంచ కప్‌

ఫైనల్‌ నేడే

మధ్యాహ్నం 3 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

కోట్లాది ప్రజల ఆశలను మోస్తూ.. అమోఘమైన ప్రదర్శనతో తుది సమరంలో నిలిచిన భారత మహిళలు.. అందలాన్ని అందుకునేందుకు మిగిలింది ఒక్క అడుగే..

మెగా టోర్నమెంట్‌లో మన ఘనతను చాటి చెప్పాలన్నా.. మహిళల క్రికెట్‌ చరిత్రలో చిరకాలం మన విజయాన్ని స్మరించుకోవాలన్నా.. కావాల్సింది ఇంకొక్క మ్యాచే!

గ్రూప్‌ దశలో మూడు ఓటములు బాధించినా, న్యూజిలాండ్‌పై ఘన విజయంతో సెమీ్‌సలో అడుగుపెట్టాం.. చాంపియన్‌ ఆస్ట్రేలియాను అలవోకగా చిత్తుచేసి ఫైనల్‌కు దూసుకొచ్చాం.

ఇక.. హర్మన్‌సేన ముందున్నది సాధారణ ప్రత్యర్థి కాదు.. టోర్నీలో పర్‌ఫామ్‌తో అదరగొడుతోన్న పటిష్ట దక్షిణాఫ్రికా. అందునా, గ్రూప్‌ దశలో మనపై గెలిచి జోరుమీదున్న ఆ జట్టుపై ప్రతీకారం తీర్చుకునేందుకు.. ఎనిమిదేళ్ల క్రితం అందినట్లే అంది చేజారిన విశ్వకిరీటాన్ని ఒడిసి పట్టేందుకు.. స్వదేశంలో ప్రేక్షకుల కేరింతల మధ్య సగర్వంగా వన్డే ప్రపంచ క్‌పను ముద్దాడేందుకు.. ఆ అద్భుత క్షణాలను తనివితీరా ఆస్వాదించేందుకు.. ఇంతకుమించిన తరుణం, అద్భుతమైన అవకాశం, అరుదైన సందర్భం ఇక రాదు! అందుకే.. అమ్మాయిలూ.. మీకు ఆకాశమే హద్దు.. అవకాశం అస్సలు వదలొద్దు!! ఆల్‌ ది బెస్ట్‌ టీమిండియా!!!


నవీ ముంబై: అద్భుత పోరాటాలు.. నాటకీయ మలుపులు.. ఉత్కంఠ విజయాలు.. ఇలా సాగిన మహిళల ప్రపంచక్‌పలో కొత్త చాంపియన్‌కు రంగం సిద్ధమైంది. ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరిన భారత జట్టు.. కలల కప్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఆదివారం జరిగే మెగా టైటిల్‌ ఫైట్‌లో దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఎన్నో ఏళ్లుగా ప్రపంచ క్రికెట్‌ను ఏలుతున్న ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ లేకుండా జరుగుతున్న తొలి ఫైనల్‌ కావడంతో క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరిగింది. ఇక.. 2017 ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో 9 పరుగులతో ఓటమి భారత జట్టును వెంటాడుతూనే ఉంది. ఈసారి గెలుపు రుచి చూడాలని హర్మన్‌ బృందం బలంగా కోరుకొంటోంది. సొంతగడ్డపై ఆడుతుండడంతోపాటు రెండుసార్లు ఫైనల్‌ ఆడిన అనుభవం ఉన్న టీమిండియా మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది. భారత్‌ టోర్నీలో తొలిసారిగా 2005లో ఫైనల్‌ చేరింది. మరోవైపు చిరస్మరణీయ ప్రదర్శనతో తొలిసారి ఫైనల్‌ బెర్త్‌ పట్టేసిన అండర్‌ డాగ్‌ సౌతాఫ్రికా.. కచ్చితంగా కప్పు నెగ్గాలన్న పట్టుదలతో ఉంది.

నాకౌట్‌

పంచ్‌తో..

టోర్నీలో హ్యాట్రిక్‌ ఓటములతో నాకౌట్‌ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదం నుంచి భారత జట్టు పుంజుకొన్న తీరు వావ్‌ అనిపించింది. ముఖ్యంగా సెమీ్‌సలో డిఫెండింగ్‌ చాంప్‌ ఆస్ట్రేలియాపై రికార్డు ఛేదన గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. తీవ్ర ఒత్తిడి.. బలమైన బౌలింగ్‌ వనరులున్న కంగారూలను కసిగా కొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. జెమీమా రోడ్రిగ్స్‌ (127) జీవిత కాలం గుర్తుండి పోయే ఇన్నింగ్స్‌తోపాటు కెప్టెన్‌ హర్మన్‌ (89) జోరందుకోవడంతో భారత్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. గాయపడిన ఓపెనర్‌ ప్రతీక స్థానంలో జట్టులోకి వచ్చిన షఫాలీ, డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన జట్టుకు అదిరే ఆరంభాన్ని అందించాల్సిన అవసరం ఉంది. జెమీమా, హర్మన్‌, రిచా, దీప్తి రాణిస్తే భారత్‌కు తిరుగులేదు. బౌలింగ్‌లో పేసర్లు క్రాంతి గౌడ్‌, రేణుక ఆరంభంలోనే బ్రేక్‌ ఇస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే చాన్సుంది. టోర్నీలో మెరుగ్గా రాణిస్తున్న స్పిన్నర్లు శ్రీచరణి, దీప్తి అదే తరహా ప్రదర్శనను కొనసాగించాలి. అయితే, ధారాళంగా పరుగులిస్తున్న రాధా యాదవ్‌ స్థానంలో స్నేహ్‌ రాణాను ఆడించే అవకాశాలున్నాయి. భారత ఫీల్డింగ్‌ ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం కూడా ఉంది.


తెగువే

ఆయుధం..

టోర్నీలో తడబడుతూ సాగినా కీలక సమయంలో గేర్‌ మార్చి అంతిమ సమరానికి చేరిన దక్షిణాఫ్రికా బలంగా కనిపిస్తోంది. కెప్టెన్‌ లారా వొల్వార్ట్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండగా.. మరిజానె కాప్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకంగా మారింది. ఓపెనర్‌ తన్జిమ్‌ బ్రిట్స్‌ ఫామ్‌లోకి వస్తే ఆపడం కష్టం. చ్లో ట్రయన్‌, నడిన్‌ డి క్లెర్క్‌ ఫినిషర్లుగా రాణిస్తున్నారు. అయాబొంగా ఖకా, ఎమ్‌లబా, డి క్లెర్క్‌తో సఫారీల బలం కూడా ప్రత్యర్థికి దీటుగానే ఉంది. అయితే, స్పిన్‌ ఎదుర్కోవడంలో బలహీనత ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. కానీ, సెమీస్‌లో ఇంగ్లండ్‌పై చూపిన తెగువతో జట్టు మరోసారి అదరగొట్టాలనుకొంటోంది.

గెలిస్తే

రూ. 125 కోట్లు?

వరల్డ్‌ చాంపియన్‌గా నిలిస్తే భారత జట్టుకు భారీగా నజరానా ఇవ్వాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌ నెగ్గిన రోహిత్‌ సేనకు ఇచ్చిన రీతిలోనే భారీ బహుమతి అందజేసే అవకాశముంది. గతేడాది పొట్టికప్‌ నెగ్గిన టీమిండియా, సహాయ సిబ్బందికి కలిపి బోర్డు రూ. 125 కోట్ల బహుమతిని ప్రకటించింది. లింగ సమానత్వం పాటిస్తున్న నేపథ్యంలో కప్పు నెగ్గితే హర్మన్‌ సేనకు కూడా ఆ స్థాయి మొత్తం అందించాలని బోర్డు భావిస్తోంది.

మ్యాచ్‌ రద్దయితే..!

వర్ష ఛాయలు ఉండడంతో మ్యాచ్‌ ఎలా జరుగుతుందనేది ఆందోళన కలిగిస్తోంది. అయితే, సాధ్యమైనంత వరకు ఆదివారం మ్యాచ్‌ను ముగించడానికే ప్రయత్నిస్తారు. డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతి ప్రకారం కనీసం 20 ఓవర్లకైనా కుదించి ఫలితం రాబట్టేందుకు చూస్తారు. అలా కాని పక్షంలో సోమవారమైన రిజర్వు డేన ఎక్కడైతే ఆట నిలిచిందో అక్కడి నుంచి మిగతా మ్యాచ్‌ను కొనసాగిస్తారు. ఒకవేళ రిజర్వు డేన కూడా ఆట సాధ్యం కాకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి.. ఇరుజట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

పిచ్‌/వాతావరణం

మ్యాచ్‌ జరిగే డీవై పాటిల్‌ స్టేడియం వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. అయితే, మంచు కురిసే అవకాశం ఉండడంతో టాస్‌ గెలిచిన జట్టు బౌలింగ్‌ ఎంచుకోవచ్చు. వర్షం మ్యాచ్‌కు ఆటంకం కలిగించే పరిస్థితులున్నాయి. కానీ, రిజర్వు డే ఉంది. ఆసీస్‌ భారీ స్కోరును భారత్‌ ఛేదించిన పిచ్‌పైనే ఫైనల్‌ కూడా జరగనుండడం హర్మన్‌సేనకు సానుకూలాంశం.

జట్లు (అంచనా)

భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ, జెమీమా, హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), దీప్తి శర్మ, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), అమన్‌జోత్‌ కౌర్‌, రాధా యాదవ్‌/స్నేహ్‌ రాణా, క్రాంతి, శ్రీచరణి, రేణుక సింగ్‌.

దక్షిణాఫ్రికా: లారా వొల్వార్ట్‌ (కెప్టెన్‌), తన్జిమ్‌ బ్రిట్స్‌, అన్నెక్‌ బోష్‌/మసబటా క్లాస్‌, సునె లుస్‌, మరిజానె కాప్‌, సినాలో జఫ్టా (వికెట్‌ కీపర్‌), అన్నెరి డెరెక్‌సన్‌, చ్లో ట్రయన్‌, డి క్లెర్క్‌, ఖకా, ఎమ్‌లాబా.

ఈ వార్తలు కూడా చదవండి...

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 02 , 2025 | 03:56 AM