క్రీడలకు కొత్త జోష్
ABN , Publish Date - Jul 02 , 2025 | 05:27 AM
కొత్త జాతీయ స్పోర్ట్స్ పాలసీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నూతన క్రీడా పాలసీకి...
టార్గెట్ 2047గా నూతన జాతీయ స్పోర్ట్స్ పాలసీ
‘ఖేలో భారత్ నీతి’గా నామకరణం
టాప్-5 క్రీడా దేశాల్లో చేరాలని లక్ష్యం
2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం పోటీ
న్యూఢిల్లీ: కొత్త జాతీయ స్పోర్ట్స్ పాలసీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో నూతన క్రీడా పాలసీకి ‘ఖేలో భారత్ నీతి’ అని నామకరణం చేశారు. 2047 నాటికి ప్రపంచంలో టాప్-5 క్రీడా దేశాల్లో భారత్ ఒకటిగా నిలబడాలనే లక్ష్యంతో ఈ పాలసీని రూపొందించినట్టు ప్రధాని మోదీ తెలిపారు. కొత్త పాలసీలో ఐదు ప్రధాన అంశాలను పొందుపరిచారు. ప్రపంచ వేదికలపై సత్తా చాటడం, ఆర్థిక అభివృద్ధిలో క్రీడారంగం భాగస్వామ్యం, సామాజిక అభివృద్ధిలో క్రీడల పాత్ర, ప్రజా ఉద్యమంగా క్రీడలు, జాతీయ విద్యా విధానంలో క్రీడలకు చోటు అనే ఐదు అంశాలకు కొత్త పాలసీలో ప్రాధాన్యత ఇచ్చారు. ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించడం, క్రీడా సంబంధిత పర్యాటకం, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక అభివృద్ధికి దోహదం, ఆదివాసీ, వెనుకబడిన వర్గాలు, మహిళలను క్రీడారంగంలో రాణించేందుకు ప్రోత్సహించడం, జాతీయ విద్యా విధానంలో క్రీడలను తప్పనిసరి అధ్యాయంగా చేర్చడం, ఇవన్నీ అమలయ్యేందుకు ప్రత్యేక పరిపాలన వ్యవస్థను రూపొందించాలనే అంశాలకు పాలసీలో ప్రాముఖ్యత ఇచ్చారు.
1984లో తొలిసారి...: స్పోర్ట్స్ పాలసీ 1984లో తొలిసారి అమల్లోకి రాగా 2001లో చివరిసారిగా ఆధునీకరించారు. 2014 తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఖేలో ఇండియా, టాప్స్ వంటి పథకాలను ప్రవేశపెట్టారు. 2028లో జరిగే తదుపరి ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య రెండు అంకెలకు చేరాలని కేంద్ర క్రీడాశాఖ లక్ష్యంగా పె ట్టుకుంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కో సం కూడా భారత్ ప్రయత్నాలు చేస్తోంది.
అహ్మదాబాద్‌లో ఒలింపిక్స్..: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష బృందం లాసన్నేలోని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ప్రధాన కార్యాలయానికి మంగళవారం వెళ్లింది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యాయినికి ఇప్పటికే సన్నద్ధత లేఖను ఇచ్చిన ఐఓఏ, భారత్‌లో విశ్వక్రీడల నిర్వహణకు ఉన్న వనరుల గురించి ఐఓసీ ప్రతినిధులకు ఉష బృందం వివరించింది. అహ్మదాబాద్ వేదికగా ఒలింపిక్స్ నిర్వహణ ప్రతిపాదనల గురించి చర్చించారు. ఉష బృందంలో కేంద్ర, గుజరాత్ క్రీడా శాఖ అధికారులు, ఐఓఏ ప్రతినిధులు ఉన్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి