Share News

అదరాలి ఫైనల్‌ పంచ్‌

ABN , Publish Date - Mar 09 , 2025 | 03:09 AM

India to face New Zealand in final punch

అదరాలి ఫైనల్‌ పంచ్‌

మధ్యాహ్నం 2.30 నుంచి

స్టార్‌స్పోర్ట్స్‌లో

జోరు మీదున్న భారత్‌

న్యూజిలాండ్‌తో టైటిల్‌ పోరు నేడే

స్పిన్నర్లు కీలకం జూ చాంపియన్స్‌ ట్రోఫీ

దాదాపు పాతికేళ్ల క్రితం నాటి సంగతి.. 2000, అక్టోబరు 15న కెన్యాలో చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌. అప్పటిదాకా ఓటమన్నదే లేని భారత్‌ను నేలకు దించుతూ న్యూజిలాండ్‌ టైటిల్‌ ఎగరేసుకుపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు అవే జట్లు అదే ట్రోఫీ కోసం సమర భేరి మోగిస్తున్నాయి. తాజా టోర్నీలోనూ టీమిండియాకు పరాజయమే లేదు. మరి.. అదే జోరును తుది పోరులోనూ చూపి ప్రత్యర్థిపై రోహిత్‌సేన ప్రతీకారం తీర్చుకుంటుందా? లేదంటే సరైన సమయంలో దెబ్బతీసే అలవాటున్న కివీస్‌ ఆధిపత్యం చాటుతుందా? విజేత ఎవరో నేడు తేలనుంది.

దుబాయ్‌: ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ (సీటీ) ఆఖరి అంకానికి చేరింది. ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌ను భారత్‌ ఎదుర్కొనబోతోంది. టీమిండియాకిది వరుసగా మూడో సీటీ ఫైనల్‌. కాగా, టోర్నీలో ఇప్పటిదాకా భారత్‌ రెండుసార్లు విజేతగా నిలిచింది. 2013లో భారత్‌ చివరిసారి గెలిచింది. ఇక తాజా టోర్నీలో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాపై గెలిచి రోహిత్‌ సేన పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. అటు కివీస్‌ కూడా గ్రూప్‌ దశలో భారత్‌ చేతిలో మాత్రమే ఓడింది. దీనికితోడు 2000లో భారత్‌పైనే గెలిచి తమ ఏకైక టైటిల్‌ దక్కించుకోవడం కివీ్‌సకు సానుకూలాంశం. అలాగే ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌ల్లోనూ భారత్‌పై 3-1తో కివీస్‌ జట్టే ఆధిక్యంలో ఉంది. అందుకే భారత్‌ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా కప్‌ చేజారుతుంది.


కొండంత అండగా స్పిన్నర్లు: స్టార్‌ పేసర్‌ బుమ్రా లేని లోటును ఏమాత్రం తెలియనీయకుండా భారత జట్టు చాంపియన్స్‌ ట్రోఫీలో అదరగొడుతోంది. దీనికి కారణం జట్టులోని నలుగురు స్పిన్నర్లే. కుడి-ఎడమ కాంబినేషన్‌లో వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ ప్రత్యర్థి బ్యాటర్లను తమ ఉచ్చులో బిగిస్తున్నారు. కివీ్‌సతో గ్రూప్‌ మ్యాచ్‌లో వరుణ్‌ చేసిన మాయాజాలం చూశాం. అయితే గత రెండు మ్యాచ్‌ల్లో కుల్దీప్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అతడి స్థానంలో పేసర్లు హర్షిత్‌ లేక అర్ష్‌దీ్‌పలలో ఒకరికి చోటిస్తారా? అన్నది చూడాలి. అటు కుడిచేతి వాటం బ్యాటర్లపై జడేజా, అక్షర్‌ ప్రభావం చూపుతున్నారు. అలాగే మధ్య ఓవర్లలో కచ్చితమైన లెంగ్త్‌తో కట్టడి చేస్తున్నారు. కివీస్‌, ఆసీ్‌సపైనా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగి ఫలితం రాబట్టారు. అందుకే ఈ ఫైనల్లోనూ ఈ వ్యూహంలో మార్పుండకపోవచ్చు. పేసర్లు షమి, హార్దిక్‌ పవర్‌ప్లేలో పరుగులను నియంత్రించాలనుకుంటున్నారు. అయితే షమి నుంచి పూర్తి స్థాయి బౌలింగ్‌ ప్రదర్శన రావాల్సి ఉంది.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, విరాట్‌, శ్రేయాస్‌, అక్షర్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజా, కుల్దీప్‌, షమి, వరుణ్‌ చక్రవర్తి.

న్యూజిలాండ్‌: యంగ్‌, రచిన్‌, విలియమ్సన్‌, లాథమ్‌, మిచెల్‌, ఫిలిప్స్‌, బ్రేస్‌వెల్‌, శాంట్నర్‌ (కెప్టెన్‌), జేమిసన్‌, ఓరౌర్కీ, హెన్రీ/స్మిత్‌.


పిచ్‌:

భారత్‌ ఇప్పటిదాకా నాలుగు పిచ్‌లపై ఆడింది. అయితే ఫైనల్‌కు మాత్రం పాక్‌తో ఆడిన పిచ్‌ను సిద్ధం చేయనున్నారు. ఆ మ్యాచ్‌ జరిగి రెండు వారాలైంది కాబట్టి తాజాగా ఉంటుందని క్యూరేటర్‌ చెబుతున్నాడు. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ సులువైనా ఆ తర్వాత ఛేదన కష్టంగా మారింది. స్పిన్నర్లకే కాకుండా ఈ వికెట్‌ పేసర్లకు కూడా అనుకూలించనుంది.

‘ఆఖరాట’లో

మురిపిస్తారా?

వెటరన్‌ స్టార్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలకు ఇదే చివరి ఐసీసీ టోర్నీగా క్రికెట్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఫైనల్లో ఆ ఇద్దరిపై అందరి దృష్టి నెలకొంది. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌ అందించినట్టుగానే ఈసారి మరో ఐసీసీ ట్రోఫీతో మురిపించాలని రోహిత్‌, కోహ్లీ పట్టుదలగా ఉన్నారు. విరాట్‌ టోర్నీలో తన ఫామ్‌ను చాటుకుంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. అయితే, పిచ్‌లు విభిన్నంగా ఉండడంతో ఈ టోర్నీలో అతడి ఆటలో మునుపటి వేగం కనిపించడం లేదు. దీంతో ఫైనల్లో ఆ లోటును తీరుస్తూ కివీస్‌పై కోహ్లీ విరుచుకుపడాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఇక రోహిత్‌ ఉన్న కాసేపు ఎడాపెడా షాట్లు బాదేస్తున్నా, నిలకడ లోపిస్తోంది. టోర్నీలో అతడి అత్యధిక స్కోరు 41 మాత్రమే. రోహిత్‌ 20 ఓవర్ల వరకు కుదురుకోగలిగినా భారత్‌కు భారీస్కోరు ఖాయం. మరోవైపు ఓపెనర్‌ గిల్‌, శ్రేయాస్‌, అక్షర్‌, రాహుల్‌, హార్దిక్‌ ఊపు మీదున్నారు. మరోసారి కలిసికట్టుగా ఆడితే ట్రోఫీ భారత్‌దే.


సమ ఉజ్జీగా ..

కివీస్‌ జట్టులోనూ సమర్థులైన స్పిన్నర్లు కలిగిఉన్నారు. సెమీ్‌సలో దక్షిణాఫ్రికాను ఏడు వికెట్లతో వణికించారు. కెప్టెన్‌ శాంట్నర్‌ బంతుల్లో పరుగులు సాధించడం అంత సులువు కాదు. ఈ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఖాతాలో 4.85 ఎకానమీ రేటుతో 7 వికెట్లున్నాయి. అతడికి తోడు బ్రేస్‌వెల్‌, రచిన్‌, ఫిలిప్స్‌ దుబాయ్‌ పిచ్‌పై రాణించేందుకు సిద్ధంగా ఉన్నారు. గతేడాది స్పిన్‌ బలంతోనే ఈ జట్టు భారత్‌పై టెస్టు సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసిన విషయం మర్చిపోరాదు. అయితే భారత్‌పై ఐదు వికెట్లతో రాణించిన పేసర్‌ హెన్రీ గాయం కారణంగా ఆడడం కష్టమే. సెమీ్‌సలో దక్షిణాఫ్రికాపై 362 పరుగులు సాధించి బ్యాటర్లు సైతం ఊపు మీదున్నారు. రచిన్‌, విలియమ్సన్‌ శతకాలు.. మిచెల్‌, ఫిలి్‌ప్సల మెరుపు ఇన్నింగ్స్‌లతో సఫారీలు చిత్తుగా ఓడారు. ఇక వీరి ఫీల్డింగ్‌ ప్రత్యర్థి జట్లను వణికిస్తుంటుంది. అందుకే అన్ని విభాగాల్లో జోరు మీదున్న కివీస్‌ను భారత్‌ తమ స్థాయికి తగ్గ ఆటతీరుతో అడ్డుకోవాల్సి ఉంటుంది.

చాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన క్రిస్‌ గేల్‌ (791) రికార్డును అధిగమించేందుకు విరాట్‌ కోహ్లీ 46 పరుగుల దూరంలో ఉన్నాడు.


Updated Date - Mar 09 , 2025 | 03:09 AM