Los Angeles Olympics 2028: లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో.. భారత్ పాక్ పోరు లేనట్టేనా..
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:29 AM
చాలా దశాబ్దాల తర్వాత.. చెప్పాలంటే 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేస్తోంది. 2028 లాస్‌ఏంజిల్స్ విశ్వక్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. టీ20 ఫార్మాట్‌లో...
దుబాయ్: చాలా దశాబ్దాల తర్వాత.. చెప్పాలంటే 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేస్తోంది. 2028 లాస్‌ఏంజిల్స్ విశ్వక్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. టీ20 ఫార్మాట్‌లో నిర్వహించే పోటీల్లో పురుషులు, మహిళల క్రికెట్ జట్లు బరిలో దిగనున్నాయి. అయితే ప్రపంచంలో ఎక్కడ టోర్నీ జరిగినా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా చూసేది భారత్-పాకిస్థాన్ పోరు కోసమే. అలాగే ఒలింపిక్స్‌లోనూ ఈ రెండు జట్లు పరస్పరం తలపడతాయా? అనే ఆసక్తి అభిమానుల్లో ఏర్పడింది. కానీ విశ్వక్రీడల్లో భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖి ఢీకొనే అవకాశాలు కనిపించడం లేదు. అసలు పాక్ జుట్టుకు ‘లాస్‌ఏంజిల్స్’లో చోటు దక్కడమే గగనంగా మారింది. ఇందుకు ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు సంబంధించి ఐసీసీ రూపొందించిన నిబంధనలే. పురుషులు, మహిళల విభాగాలలో ఆరేసి జట్లకే ఐసీసీ చోటు కల్పించింది. ఈ జట్లను ర్యాంకుల ఆధారంగా ఎంపిక చేయాలని ఐసీసీ తొలుత భావించింది. కానీ ఒక్కో ఖండం/ప్రాంతం నుంచి ఒక్కో అత్యుత్తమ జట్టును ఎంపిక చేసి..ఆరో జట్టును క్వాలిఫయింగ్ రౌండ్ ద్వారా తీసుకోవాలని ఐసీసీ తాజాగా నిర్ణయించినట్టు సమాచారం. ఆ ప్రకారం చూస్తే..ఆసియా ఖండం నుంచి ఒక్క జట్టే విశ్వక్రీడల్లో అడుగుపెట్టనుంది. ప్రస్తుతం టీ20లలో టాప్ ర్యాంక్‌లో ఉన్న టీమిండియా ఆసియా నుంచి ఒలింపిక్స్‌కు క్వాలిఫై కానుంది. ఒషియానా నుంచి ఆస్ట్రేలియా, యూరప్ నుంచి ఇంగ్లండ్, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికాలకు చోటు లభించనుంది. కారణం ఆయా ప్రాంతాలనుంచి ఈ మూడు జట్లు టాప్‌లో ఉండడమే. ఇక ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్నందున అమెరికాకూ చోటు దక్కనుంది. మిగిలిన ఒక్క జట్టును గ్లోబల్ క్వాలిఫయర్స్ టోర్నీ ద్వారా ఎంపిక చేస్తారు. కానీ ఈ క్వాలిఫయర్స్‌లో మేటి జట్లు తలపడనున్న నేపథ్యంలో.. ఇందులో విజేతగా నిలిచి పాక్ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుందా? చూడాలి.
ఇవి కూడా చదవండి
2028 Olympics: భారత్, పాక్ పోరు లేనట్లేనా..?
ND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి