Mohammed Siraj: ఫిట్‌నెస్ కింగ్
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:54 AM
ఏ క్రికెటర్ నైపుణ్యమైనా సుదీర్ఘ ఫార్మాట్‌లోనే బయటపడుతుందని అంటుంటారు. ఐదు రోజులపాటు
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం): ఏ క్రికెటర్ నైపుణ్యమైనా సుదీర్ఘ ఫార్మాట్‌లోనే బయటపడుతుందని అంటుంటారు. ఐదు రోజులపాటు సాగే టెస్టు మ్యాచ్‌లో ఆడాలంటే ఫిట్‌నెస్ అత్యంత కీలకం. అందుకే ఈ విషయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అందరూ ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ అలుపెరుగని రీతిలో వరుసగా ఐదు టెస్టులు ఆడి ఏకధాటిగా బంతులు వేసే ఫాస్ట్ బౌలర్లను మాత్రం అరుదుగానే చూస్తుంటాం. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీ్‌సలో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ విషయంలో జరిగిందదే. ఇరుజట్ల నుంచి గాయపడ్డ వోక్స్ మినహా అన్ని మ్యాచ్‌లను ఆడిన ఏకైక పేసర్ సిరాజే కావడం విశేషం. అంతేకాకుండా ఈ సిరీ్‌సలో అందరికంటే ఎక్కువగా 185.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అంటే 1,113 బంతులు విసిరి పని ఒత్తిడి అని చెప్పే ఇతర ఆటగాళ్లకు సవాల్ విసిరినట్టయ్యింది. 9 ఓవర్ల స్పెల్‌ను ఎలాంటి అలసటా లేకుండా పలుమార్లు వేయగలగడం సిరాజ్‌కే చెల్లింది. అటు బుమ్రా మూడు మ్యాచ్‌లే ఆడగా.. ఆకాశ్, అర్ష్‌దీప్ ఓసారైనా గాయాలకు గురయ్యారు. కానీ సిరాజ్ మాత్రమే ఓ యోధుడిలా ప్రతీ టెస్టు బరిలోకి దిగి సుదీర్ఘ స్పెల్‌లతో ఆకట్టుకోగలిగాడు. అతడి ఫిట్‌నెస్ స్థాయి ఏమిటో దీన్ని బట్టి చెప్పవచ్చు అయితే ఇందుకు తను కఠినంగానే సన్నద్ధమయ్యాడట. ముఖ్యంగా తన డైట్ విషయంలో ఎలాంటి అలక్ష్యానికి తావీయడని సిరాజ్ సోదరుడు ఇస్మాయిల్ చెబుతున్నాడు. ‘జంక్ ఫుడ్‌ను ఏమాత్రం దరిచేరనీయడు. డైట్‌ను క్రమం తప్పకుండా అనుసరిస్తాడు. బిర్యానీలు తినడం కూడా దాదాపుగా మానేశాడు. ఎప్పుడో ఓసారి.. అదీ ఇంట్లో చేసిందే తీసుకుంటాడు. పిజ్జాలాంటి వాటికి చాలా దూరం. ఉదయం, సాయంత్రం జిమ్‌కు వెళ్లడం తప్పనిసరి. చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక కాని సమయంలోనూ నిరుత్సాహపడకుండా ఫిట్‌నె్‌సపై మరింత దృష్టి సారించాడు’ అని వివరించాడు.
‘మిస్టర్ యాంగ్రీ’
మైదానంలో దూకుడుగా కనిపించే పేసర్ సిరాజ్‌కు ఇంగ్లండ్ క్రికెటర్లు నిక్‌నేమ్ కూడా పెట్టినట్టు మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తెలిపాడు. ‘‘ఐదో టెస్టు రెండో రోజున ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను పిచ్ దగ్గరే ఉన్నా. అక్కడే ఉన్న డకెట్ ‘మార్నింగ్ మిస్టర్ యాంగ్రీ. ఏం చేస్తున్నావు’ అని సిరాజ్‌ను అడిగాడు. దీన్ని తేలిగ్గా తీసుకున్న సిరాజ్ బిగ్గరగా నవ్వాడు. తను గ్రౌండ్‌లో ఓ యోధునిలా పోరాడతాడు కాబట్టే ఇంగ్లండ్ టీమ్ ఆ పేరు పెట్టింది’’ అని బ్రాడ్ తెలిపాడు.
అమ్మా.. నా కోసం ప్రార్థించు
ఆటో డ్రైవర్‌గా పనిచేసిన సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ నాలుగేళ్ల క్రితం మరణించాడు. దేశం తరఫున ఆడే సమయంలో ప్రతీ సిరీ్‌సకు ముందు, ఆ తర్వాత తండ్రి సమాధిని దర్శించుకోవడం సిరాజ్‌కు అలవాటు. సిరాజ్ క్రికెటర్‌గా మారే క్రమంలో అతడి తండ్రి తోడ్పాటు ఎక్కువే. జూన్‌లో ఇంగ్లండ్ సిరీ్‌సకు వెళ్లే ముందు సిరాజ్ తన తల్లితో.. ‘అమ్మా నాకోసం ప్రార్థించు. సిరీస్‌లో బాగా రాణించి భారత జట్టును గెలిపించాలని కోరుకో’ అని చెప్పాడట. అటు ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన అన్ని మ్యాచ్‌లను కూడా క్రమం తప్పకుండా తల్లి షబానా టీవీలో తిలకించింది.