Cricket Criticism: దుబాయ్‌పై రచ్చ
ABN , Publish Date - Mar 08 , 2025 | 04:00 AM
చాంపియన్స్ ట్రోఫీలో ఇక మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్. ఆదివారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ జరగాల్సి ఉంది.
భారత్‌కు అనుకూలతపై విమర్శలు
దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో ఇక మిగిలింది ఒకే ఒక్క మ్యాచ్. ఆదివారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ టోర్నీకి ఆతిథ్యమిస్తున్నది పాకిస్థానే అయినా టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడుతోంది. అయితే భారత జట్టు ఎటూ కదలకుండా ఒకే చోట మ్యాచ్‌లన్నీ ఆడేస్తుండడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇతర జట్ల మాదిరిగా పలు వేదికల్లో ఆడేందుకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదని, ఒకే మైదానంలో ఆడడంవల్ల వారికి లబ్ది చేకూరుతోందని తప్పుపడుతున్నారు. టోర్నీ ముగింపు దశకు చేరినా ఈ దుబాయ్ అనుకూలత విమర్శలు మాత్రం ఆగడం లేదు. ఇంగ్లండ్ మాజీలు మైక్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డేవిడ్ మిల్లర్, డుస్సెన్ తదితరులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే ఇతర జట్ల మాదిరిగా దుబాయ్ కూడా తమకు తటస్థ వేదికని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గంభీర్ తేల్చాడు. చాలా రోజుల క్రితమే ఐసీసీ భారత్ ఆడే వేదికను ఖరారు చేసిందని, అయినా అక్కడ కూడా వివిధ పిచ్‌లపై ఆడుతున్న విషయాన్ని గమనించాలని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నాడు.
ఫైనల్‌కు హెన్రీ డౌటే!
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌కు ముందే కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆ జట్టు ప్రధాన పేసర్ మ్యాట్ హెన్రీ భుజం నొప్పితో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీస్‌లో క్యాచ్ పట్టే సమయంలో గాయపడ్డాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు (10) తీసుకున్న హెన్రీ ఫిట్‌నెస్‌పై స్పష్టత లేదని జట్టు కోచ్ తేల్చాడు. అయితే భారత్‌తో ఫైనల్‌కు మరో రోజు మాత్రమే ఉండడంతో అతడి ప్రాతినిధ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రూప్ మ్యాచ్‌లో భారత్‌పై హెన్రీ ఐదు వికెట్లతో చెలరేగిన సంగతి తెలిసిందే.

వరుణ్ వర్సెస్ శాంట్నర్
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అందరి చూపు భారత్-కివీ్‌స జట్ల స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, మిచెల్ శాంట్నర్‌లపై ఉండనుంది. దుబాయ్ పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటున్న నేపథ్యంలో ఈ ఇద్దరు కీలకంగా మారే అవకాశం ఉంది. శాంట్నర్ ఎడమచేతి స్పిన్నర్ కాగా, వరుణ్ కుడిచేతి లెగ్ స్పిన్నర్. అలాగే ఇద్దరూ ఏడు వికెట్లతో తమ జట్లకు అండగా ఉంటున్నారు. కానీ వరుణ్‌కు కేవలం రెండు వన్డేల అనుభవం ఉంది. అటు శాంట్నర్‌కు అనుభవంతో పాటు జట్టు కెప్టెన్‌గా అదనపు భారం మోస్తున్నాడు. మరోవైపు ఇద్దరూ స్పిన్నర్లే అయినప్పటికీ బంతిని వదిలే వేగంలోనూ తేడా ఉంటోంది. వరుణ్ ఏకంగా గంటకు 93.74 కి.మీ వేగంతో బంతిని విసురుతున్నాడు. అందుకే బ్యాటర్‌కు ఆ బంతిని అర్థం చేసుకునేంత సమయం ఉండదు. కివీ్‌సపై తను ఆడింది ఒక్క వన్డేనే అయినా ఐదు వికెట్లు తీశాడు. ఇక శాంట్నర్ సగటు వేగం 82.90 కి.మీ. భారత్‌పై అతడు 23 వన్డేలు ఆడి 15 వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ మాత్రం ఓవర్ 4.75 పరుగులతో మెరుగ్గానే ఉంది. అయితే వికెట్లను తీయడం కాకుండా బ్యాటర్లను కట్టడి చేయడంలో శాంట్నర్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

వరుణ్‌తోనే మాకు ప్రమాదం: కివీస్ కోచ్
ఫైనల్లో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తమకు సమస్యగా మారే అవకాశం ఉందని కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపాడు. ‘భారత్‌తో మేమాడిన గ్రూప్ మ్యాచ్‌లో వరుణ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. కాబట్టి అతడి ప్రదర్శనపై దృష్టి సారించాల్సిందే. అతనో క్లాస్ బౌలర్. వైవిధ్యంగా బౌలింగ్ చేస్తూ మా జట్టుకు ప్రధాన ముప్పుగా మారాడు. అందుకే ఫైనల్లో వరుణ్‌ను దీటుగా ఎదుర్కోవడంతో పాటు పరుగులు సాధించే విషయమై చర్చించాల్సి ఉంది’ అని స్టీడ్ తెలిపాడు.