Share News

India T20 World Cup Squad: గిల్‌కు ఝలక్‌

ABN , Publish Date - Dec 21 , 2025 | 06:56 AM

ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌కప్‌ బరిలోకి దిగే భారత క్రికెట్‌ జట్టును శనివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో 15 మందితో కూడిన జట్టు ఎంపిక విషయంలో జాతీయ సెలెక్టర్లు సంచలన నిర్ణయాలు...

India T20 World Cup Squad: గిల్‌కు ఝలక్‌

టీ20 వరల్డ్‌క్‌పనకు భారత జట్టు

ఇషాన్‌కు చాన్స్‌ఫ జితే్‌షకు ఉద్వాసన

రింకూ సింగ్‌కు చోటు ఫ వైస్‌ కెప్టెన్‌గా అక్షర్‌

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్‌కప్‌ బరిలోకి దిగే భారత క్రికెట్‌ జట్టును శనివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో 15 మందితో కూడిన జట్టు ఎంపిక విషయంలో జాతీయ సెలెక్టర్లు సంచలన నిర్ణయాలు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్‌, శ్రీలంకలో ఈ టోర్నీ జరుగనుంది. కాగా, ఇటీవలి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీ్‌సకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించిన శుభ్‌మన్‌ గిల్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. కెప్టెన్‌గా సూర్యకుమార్‌ కొనసాగనుండగా, నూతన వైస్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ ఎంపికయ్యాడు. అలాగే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో దుమ్మురేపిన వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌కు రెండేళ్ల తర్వాత సెలెక్టర్ల నుంచి పిలుపు రావడం విశేషం. అతడితో పాటు హిట్టర్‌ రింకూ సింగ్‌, పేసర్‌ హర్షిత్‌ రాణా, స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌ తొలిసారి వరల్డ్‌కప్‌ ఆడబోతున్నారు. సఫారీలతో సిరీస్‌కు రింకూను పరిగణనలోకి తీసుకోని సెలెక్టర్లు అతనికి ఏకంగా వరల్డ్‌కప్‌ జట్టులో చోటివ్వడం గమనార్హం. వికెట్‌ కీపర్‌గా సంజూ శాంసన్‌ చోటును ఖాయం చేసుకోగా.. జితేశ్‌ శర్మపై వేటు పడింది. అతడి స్థానంలోనే రెండో కీపర్‌గా ఇషాన్‌ను చేర్చారు. అయితే, అవకాశం వచ్చినప్పుడల్లా సద్వినియోగం చేసుకున్న జితేశ్‌ను ఎందుకు పక్కనబెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది అమెరికా, వెస్టిండీస్‌లలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆడిన రోహిత్‌, కోహ్లీ, జడేజా ఇప్పటికే రిటైరవగా.. ఈసారి పంత్‌, చాహల్‌, జైస్వాల్‌, సిరాజ్‌లకు చోటు దక్కలేదు.


ఇ‘షాన్‌’దార్‌ ఆటతో..

రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో ఇషాన్‌ జట్టును వీడాక తిరిగి బ్లూ జెర్సీ ధరించలేకపోయాడు. బీసీసీఐ ఆదేశాలను కూడా బేఖాతరు చేయడంతో సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో కూడా లేకుండా పోయాడు. ఇక అతడికి జట్టులో చోటు కష్టమేనని అంతా భావించినా.. దేశవాళీ టోర్నీల్లో విధ్వంసక ఆటతీరుతో తానేంటో నిరూపించుకున్నాడు. ఇటీవలి ముస్తాక్‌ అలీ టోర్నీలో జార్ఖండ్‌ కెప్టెన్‌గా జట్టుకు ట్రోఫీ ని అందించడమే కాకుండా 10 ఇన్నింగ్స్‌లో 517 రన్స్‌తో అదుర్స్‌ అనిపించుకున్నాడు. దీంతో సెలెక్టర్లు ఇషాన్‌కు టీ20 జట్టులో చోటివ్వక తప్పలేదు.

వేటు ఎందుకంటే..

టెస్టు, వన్డే కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్‌ గిల్‌ను పొట్టి ఫార్మాట్‌కు కూడా ఎంపిక చేసి వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించారు. రోహిత్‌, విరాట్‌ లేని వేళ తన రాకతో జట్టులో నిలకడ సమకూరుతుందని భావించారు. కానీ గిల్‌ మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. శాంసన్‌ స్థానంలో ఓపెనర్‌గా ఆడించినా, శుభారంభాలు అందించడంలో విఫలమయ్యాడు. 15 ఇన్నింగ్స్‌లో కనీసం అర్ధసెంచరీ కూడా లేకపోవడం శోచనీయం. సగటు కూడా 25లోపే ఉండగా, స్ట్రయిక్‌ రేట్‌ 140 దాటలేకపోయింది. అటు ఓపెనర్‌గా అభిషేక్‌ ఎదురుదాడికి దిగుతుండగా, గిల్‌ మాత్రం తడబడుతూ సాగాడు. సౌతాఫ్రికాతో సిరీ్‌సలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో శుభ్‌మన్‌ చేసింది 32 పరుగులే. కానీ మెగా టోర్నీ జట్టులో తనని కొనసాగిస్తారని అంచనా వేసినా సెలెక్టర్లు కఠిన నిర్ణయమే తీసుకున్నారు. అయితే గిల్‌ను ఎంపిక చేయకపోవడానికి ఫామ్‌లేమి కారణం కాదని చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ తేల్చాడు. ‘గిల్‌ టాలెంట్‌పై ఎవరికీ సందేహాలు లేవు. మేం ఈసారి వైవిధ్యమైన కాంబినేషన్‌తో వెళ్లాలనుకున్నాం. జట్టు కూర్పునకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలాగే టాపార్డర్‌లో కీపర్‌ బ్యాటింగ్‌ చేస్తే బావుంటుందనుకున్నాం. అందుకే అతడికి చోటు దక్కలేదు’ అని అగార్కర్‌ వివరించాడు.


టీ20 వరల్డ్‌కప్‌ జట్టు

సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అక్షర్‌ పటేల్‌ (వైస్‌ కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ (కీపర్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, బుమ్రా, అర్ష్‌దీప్‌, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, వాషింగ్టన్‌ సుందర్‌, ఇషాన్‌ కిషన్‌ (కీపర్‌), రింకూ సింగ్‌, హర్షిత్‌ రాణా.

అతనికి అవకాశం ఇవ్వాల్సింది

ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ను టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో సిరీ్‌సలో విఫలమైనప్పటికీ ఫామ్‌ తాత్కాలికమని, క్లాస్‌ శాశ్వతమంటూ గిల్‌కు గవాస్కర్‌ మద్దతు పలికాడు. అతను చాలారోజుల తర్వాత టీ20 ఫార్మాట్‌ ఆడాడు కాబట్టి లయ అందుకోలేకపోయాడని చెప్పాడు. ఇక జట్టులోకి ఇషాన్‌ కిషన్‌ ఎంపికతో దేశవాళీ క్రికెట్‌ సత్తా ఏమిటో తెలిసిందని సన్నీ గుర్తుచేశాడు.

ఇవీ చదవండి:

నేను కోలుకుంటున్నా.. త్వరలోనే మైదానంలోకి వస్తా: యశస్వి జైస్వాల్

Updated Date - Dec 21 , 2025 | 06:58 AM