Share News

లెక్క తేల్చాల్సిందే!

ABN , Publish Date - Feb 23 , 2025 | 04:19 AM

High-voltage battle in Champions Trophy between India-Pakistan teams

లెక్క తేల్చాల్సిందే!

హైఓల్టేజ్‌ సమరం నేడు

మధ్యాహ్నం 2.30 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

సెమీ్‌సపై భారత్‌ గురి

పాక్‌కు చావోరేవో

చాంపియన్స్‌ ట్రోఫీ

చాంపియన్స్‌ ట్రోఫీలో ఎన్ని జట్లు పాల్గొన్నా.. ఇప్పటికి ఎన్ని మ్యాచ్‌లు జరిగినా.. అందరి దృష్టీ ఆ ఒక్క పోరుపైనే. క్రికెట్‌ ప్రేమికులంతా ఎప్పుడెప్పుడా అంటూ ఆతృతగా ఎదురు చూసిన తరుణమిది. గతంలో ఎన్నిసార్లు తలపడినా బరిలోకి దిగిన ప్రతీసారి అదే ఉద్వేగం.. అదే ఉత్సాహం. భావోద్వేగాలు పతాక స్థాయిలో ఉండే అసలు సిసలైన పోరు. అందుకే కచ్చితంగా గెలిచి తీరాలనే కసి అటు ఆటగాళ్లలోనే కాదు, అభిమానుల నరనరాల్లోనూ ప్రవహిస్తుంటుంది. ఇదంతా భారత్‌-పాకిస్థాన్‌ పోరు గురించే! ఐసీసీ, ఆసియాకప్‌ టోర్నీల్లో మాత్రమే కనిపించే ఈ దాయాది జట్లు ఆదివారం తమ సత్తా ఎంతో తేల్చుకోనున్నాయి. అలాగే 2017 టోర్నీ ఫైనల్లో ఎదురైన పరాభవానికి లెక్క సరిచేయాలనుకుంటున్న టీమిండియా ఈ గెలుపుతో సెమీ్‌సపైనా కన్నేసింది. అటు పాక్‌కు మాత్రం ఈ మ్యాచ్‌ చావో రేవో లాంటిది. ఓడితే ఆ జట్టు ఇంటికే కాబట్టి ఒత్తిడంతా వారిపైనే.


దుబాయ్‌: ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీలో హైఓల్టేజి సమరానికి సర్వం సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో చిరకాల శత్రువులుగా పేరు తెచ్చుకున్న భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య ఆదివారం కీలక మ్యాచ్‌ జరుగనుంది. గ్రూప్‌ ‘ఎ’లో ఇరు జట్లకిది రెండో మ్యాచ్‌. ఇప్పటికే టిక్కెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోవడంతో స్టేడియం కిక్కిరిసిపోనుంది. అయితే టోర్నీకి ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్‌ ఈ మ్యాచ్‌ ఆడేందుకు స్వదేశం నుంచి దుబాయ్‌కి రావాల్సి వచ్చింది. భద్రతా కారణాలరీత్యా టీమిండియా తమ పొరుగు దేశంలో పర్యటించేందుకు ఇష్టపడకపోగా, హైబ్రిడ్‌ పద్దతిన టోర్నీని నిర్వహిస్తున్నారు. మరోవైపు బంగ్లాపై విజయంతో రోహిత్‌ సేన ఆత్మవిశ్వాసంతో ఉంది. భారత్‌కు మరో విజయం లభిస్తే దాదాపు సెమీస్‌ చేరినట్టే. అటు పాక్‌కు ఆరంభ మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో భంగపాటు ఎదురైంది. అందుకే భారత్‌తో జరిగే ఈ మ్యాచ్‌ వారికి అత్యంత కీలకం కాబోతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నేటి పోరులో రిజ్వాన్‌ సేన గెలవాల్సిందే. లేకుంటే దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న ఐసీసీ టోర్నీ నుంచి గ్రూప్‌ దశలోనే నిష్క్రమించాల్సి ఉంటుంది. కానీ చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో పాక్‌ మూడింట్లో గెలవడం విశేషం. 2017లో జరిగిన ఫైనల్లోనూ భారత్‌ను పాక్‌ 180 రన్స్‌ తేడాతో చిత్తుగా ఓడించి తొలి టైటిల్‌ను దక్కించుకుంది. ఈసారి భారత్‌ గెలిచి 3-3తో లెక్కను సమం చేయాలనుకుంటోంది.


పాక్‌పైనే ఒత్తిడి

కివీస్‌ చేతిలో ఓటమితో పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరిగింది. పైగా చిరకాల శత్రువు భారత్‌తో మ్యాచ్‌ కావడం, గెలిస్తేనే సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండే పరిస్థితి నెలకొనడంతో వీరి ప్రదర్శనపై ఆసక్తి ఏర్పడింది. అలాగే తొలి మ్యాచ్‌లో స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ ఆటతీరు విమర్శలపాలైంది. 320 పరుగుల ఛేదనలో అతడు 90 బంతుల్లో 64 పరుగులే చేయడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు భారత్‌పై ఆడిన 8 మ్యాచ్‌ల్లో బాబర్‌ 218 పరుగులే చేయగలిగాడు. ఇక టీమిండియాపై చెలరేగే ఓపెనర్‌ ఫఖర్‌ జమాన్‌ టోర్నీకి దూరం కావడం పెద్ద లోటే. తన స్థానంలో ఇమామ్‌ ఉల్‌ హక్‌ను తీసుకున్నారు. బ్యాటింగ్‌లో రిజ్వాన్‌, సల్మాన్‌ ఆఘా, సాద్‌ షకీల్‌ కీలకం. బౌలింగ్‌లో పేసర్లు షహీన్‌ షా, నసీమ్‌ షా, రౌఫ్‌ ఆరంభంలో భారత్‌ను కట్టడి చేయాలనుకుంటున్నారు. స్పిన్‌లో అబ్రార్‌ అహ్మద్‌ ఆకట్టుకుంటున్నాడు.


విరాట్‌ ఆడేనా?

పాక్‌తో పోలిస్తే భారత్‌ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్‌ గిల్‌ భీకర ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. పరిస్థితులకు తగ్గట్టు సంయమనంతో ఆడుతున్నాడు. అటు కెప్టెన్‌ రోహిత్‌ ఎటాకింగ్‌ గేమ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతున్నాడు. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మాత్రం బ్యాట్‌ ఝుళిపించాల్సి ఉంది. కానీ శనివారం ప్రాక్టీస్‌ సెషన్‌ ముగిశాక తను ఎడమ కాలిపై ఐస్‌ ప్యాక్‌ పెట్టుకుని సేద తీరడం ఫ్యాన్స్‌ను ఆందోళనపరుస్తోంది. ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో తొలి మ్యాచ్‌ కూడా తను మోకాలి గాయంతో దూరం కావాల్సి వచ్చింది. అయితే విరాట్‌ విషయమై బోర్డు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఒకవేళ తను అందుబాటులో లేకపోతే వన్‌డౌన్‌లో రిజర్వ్‌ ప్లేయర్‌ కూడా లేడు. ఇక మిడిలార్డర్‌లో శ్రేయాస్‌, రాహుల్‌, అక్షర్‌, హార్దిక్‌ చెలరేగితే భారీ స్కోరు ఖాయమే. బౌలింగ్‌లో షమి అదరగొడుతుండడం సానుకూలాంశం కానుంది. బంగ్లాపై ఐదు వికెట్లతో రాణించిన తను జోష్‌లో ఉన్నాడు. అలాగే పాక్‌పై అతడి ఎకానమీ 3.82గా ఉండడం విశేషం. షమికి మరో ఎండ్‌లో హర్షిత్‌ నుంచి మద్దతు లభిస్తోంది. స్పిన్‌ త్రయం జడేజా, కుల్దీప్‌, అక్షర్‌ నేటి మ్యాచ్‌లోనూ కీలకం కానున్నారు. విరాట్‌ గాయంపై స్పష్టత లేకపోవడంతో దాదాపుగా జట్టులో మార్పు ఉండకపోవచ్చు.


తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌, రాహుల్‌, హార్దిక్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌, షమి, కుల్దీప్‌.

పాకిస్థాన్‌: ఇమామ్‌ ఉల్‌ హక్‌, బాబర్‌, సాద్‌ షకీల్‌, రిజ్వాన్‌ (కెప్టెన్‌), సల్మాన్‌ ఆఘా, తయ్యాబ్‌ తహీర్‌, ఖుష్దిల్‌ షా, షహీన్‌ షా, నసీమ్‌ షా, హరీస్‌ రౌఫ్‌, అబ్రార్‌ అహ్మద్‌.

పిచ్‌

బంగ్లాతో జరిగిన పిచ్‌ మందకొడిగా మారడంతో పరుగుల వేటలో భారత్‌ కాస్త ఇబ్బందిపడింది. అయితే, ఇక్కడ మంచు ప్రభావం కూడా లేకపోవడంతో టాస్‌ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకోవచ్చు

.

స్పిన్‌పై కోహ్లీ చూపు

పాక్‌తో పోరుకు ముందు విరాట్‌ కోహ్లీ స్పిన్‌ బంతులను ఎదుర్కోవడంపై దృష్టి సారించాడు. టెస్టుల్లో ఆఫ్‌స్టం్‌పనకు ఆవలి బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడిన కోహ్లీ ఈ మధ్య వన్డేల్లో స్పిన్‌ను సరిగా ఆడలేకపోతున్నాడు. వరుసగా ఆరు వన్డేల్లో స్పిన్నర్లకే దొరికిపోయాడు. అందుకే ఈ మ్యాచ్‌లో పాక్‌ లెగ్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు, నెట్స్‌లో స్పిన్‌ను ఎక్కువగా ఆడాడు. లెగ్‌ బ్రేక్‌, ఆఫ్‌ స్పిన్‌, లెఫ్టామ్‌ స్పిన్నర్లతో బౌలింగ్‌ చేయించుకున్నాడు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2025 | 05:01 AM