Women Premier League: హర్లీన్ గెలిపించెన్!
ABN , Publish Date - Mar 08 , 2025 | 03:54 AM
హర్లీన్ డియోల్ (70 నాటౌట్) అదరగొట్టడంతో మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ కీలకమైన విజయాన్ని అందుకుంది. వరుసగా మూడో గెలుపుతో...
డబ్ల్యూపీఎల్‌లో నేడు యూపీ X బెంగళూరు
రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
గుజరాత్ హ్యాట్రిక్
ప్లేఆఫ్ దిశగా అడుగు
ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఓటమి
వడోదర: హర్లీన్ డియోల్ (70 నాటౌట్) అదరగొట్టడంతో మహిళల ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్ కీలకమైన విజయాన్ని అందుకుంది. వరుసగా మూడో గెలుపుతో ముంబై ఇండియన్స్‌ను వెనక్కునెట్టి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. తద్వారా మెగా టోర్నీలో తొలిసారి ప్లే ఆఫ్స్ దిశగా బలమైన అడుగు వేసింది. శుక్రవారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుజరాత్ షాకిచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 177/5 స్కోరు చేసింది. మెగ్‌లానింగ్ (57 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 92), షఫాలీ వర్మ (27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40) మాత్రమే రాణించారు. శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టింది. ఛేదనలో గుజరాత్ 19.3 ఓవర్లలో 178/5 స్కోరు చేసి విజయం అందుకుంది. హర్లీన్ డియోల్ (49 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 70 నాటౌట్) సత్తా చాటగా, బేత్ మూనీ (35 బంతుల్లో 6 ఫోర్లతో 44), డాటిన్ (10 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24) మెరిశారు. శిఖా పాండే, జెస్ జొనాసెన్ చెరో రెండు వికెట్లు తీశారు. ఏ మాత్రం ఆశల్లేని పరిస్థితులనుంచి జట్టును విజయపథంలో నడిపిన హర్లీన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. ఇక..ఇంతకుముందే ప్లేఆఫ్స్‌కు చేరిన ఢిల్లీ..లీగ్ దశను పరాజయంతో ముగించింది. మరోవైపు గుజరాత్ విజయంతో యూపీ వారియర్స్ టోర్నమెంట్ నుంచి నాకౌట్ అయ్యింది. కాగా గుజరాత్ జట్టు తమ చివరి మ్యాచ్‌ని ముంబైతో ఈనెల పదోతేదీన ఆడనుంది.
సంక్షిప్తస్కోర్లు
ఢిల్లీ క్యాపిటల్స్: 20 ఓవర్లలో 177/5 (మెగ్‌లానింగ్ 92, షఫాలీ వర్మ 40, సదర్లాండ్ 14, మేఘనా సింగ్ 3/35, డాటిన్ 2/37)
గుజరాత్ జెయింట్స్: 19.3 ఓవర్లలో 178/5 (హర్లీన్ 70 నాటౌట్, మూనీ 44, శిఖా పాండే 2/31, జొనాసెన్ 2/38).