గుకేష్ హంపికి మూడో స్థానం
ABN , Publish Date - Jun 08 , 2025 | 04:31 AM
ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీ పురుషులు, మహిళల విభాగాలలో భారత గ్రాండ్‌మాస్టర్లు గుకేష్, హంపి మూడో స్థానంలో నిలిచారు. ఫాబియానో కరువానా (అమెరికా)తో చివరి రౌండ్‌లో తీవ్రమైన తప్పిదంతో...
నార్వే చెస్ విజేతలు కార్ల్‌సన్, ముజిచుక్
స్టావంజర్ (నార్వే): ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీ పురుషులు, మహిళల విభాగాలలో భారత గ్రాండ్‌మాస్టర్లు గుకేష్, హంపి మూడో స్థానంలో నిలిచారు. ఫాబియానో కరువానా (అమెరికా)తో చివరి రౌండ్‌లో తీవ్రమైన తప్పిదంతో గుకేష్ ఓటమి పాలయ్యాడు. ఇక..ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ రికార్డు స్థాయిలో ఏడోసారి ‘నార్వే’ విజేతగా నిలిచాడు. కరువానాతో పదో రౌండ్‌లో సింహభాగం గుకేష్ వెనుకంజలోనే నిలిచాడు. అయితే చివరి దశలో పుంజుకొనే ప్రయత్నం చేశాడు. కానీ సమయభావంతో ఒత్తిడిలో పడిన భారత గ్రాండ్‌మాస్టర్ ఎత్తు వేయడంలో చేసిన పెద్ద తప్పిదం అతడి ఓటమికి బాటలు వేసింది. దాంతో పది రౌండ్ల ద్వారా మొత్తం 14.5 పాయింట్లు సాధించిన గుకేష్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. చివరి రౌండ్‌లో మరో భారత గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసితో గేమ్‌ను డ్రా చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ కార్ల్‌సన్ టైబ్రేకర్‌లో గెలిచాడు. ఫలితంగా మొత్తం 16 పాయింట్లతో మాగ్నస్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. కరువానా (15.5) రెండో స్థానం చేజిక్కించుకున్నాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్లు తలపడిన ఈ టోర్నీలో అర్జున్ (13) ఐదో స్థానంలో నిలిచాడు.
చివరి రౌండ్‌లో గెలిచినా..: మహిళల విభాగం పదో రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ జు వెన్‌జున్ (చైనా)ను టైబ్రేకర్‌లో హంపి చిత్తు చేసింది. అయితే మొత్తం 15 పాయింట్లతో హంపి మూడో స్థానానికే పరిమితమైంది. అనా ముజిచుక్ (ఉక్రెయిన్- 16.5) టైటిల్ కైవసం చేసుకుంది. లీ టింగ్ జీ (చైనా, 16) రెండో స్థానం దక్కించుకుంది. చివరి రౌండ్‌లో ముజిచుక్‌ను టైబ్రేకర్‌లో ఓడించిన వైశాలీ (11) ఐదో స్థానంలో నిలిచింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి