India Versus South Africa T20: పొగమంచు.. మ్యాచ్ రద్దు
ABN , Publish Date - Dec 18 , 2025 | 06:22 AM
వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దు కావడం క్రికెట్ అభిమానులకు పరిచయమే. అయితే, మంచు కమ్మేయడంతో ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ రద్దు కావడమనే అరుదైన ఘటన భారత్‌లో చోటు చేసుకొంది. ఇక్కడ దట్టమైన...
టాస్ కూడా పడలేదు
సాగని భారత్-దక్షిణాఫ్రికా నాలుగో టీ20
బీసీసీఐకి ముందుచూపు లేదా?
లఖ్‌నవూ: వర్షం కారణంగా మ్యాచ్‌లు రద్దు కావడం క్రికెట్ అభిమానులకు పరిచయమే. అయితే, మంచు కమ్మేయడంతో ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ రద్దు కావడమనే అరుదైన ఘటన భారత్‌లో చోటు చేసుకొంది. ఇక్కడ దట్టమైన పొగమంచుతో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య బుధవారం జరగాల్సిన నాలుగో టీ20 రద్దయింది. మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా పడలేదు. మైదానాన్ని పూర్తిగా మంచు కమ్మేయడంతో ఎదురున ఉన్న వారు స్పష్టంగా కనిపించడమే గగనమైంది. దీంతో టాస్ కూడా వేయలేక పోయారు. రెండున్నర గంటలకు పైగా వేచిచూసిన అంపైర్లు ఈ మధ్యలో ఆరుసార్లు విజిబులిటీని పరిక్షించారు. ఇక, చివరగా రాత్రి 9.25 గంటలకు మరోసారి స్టేడియంలో కలియదిరిగారు. కానీ ఫలితం లేకపోవడంతో, మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మ్యాచ్ జరిగే అవకాశాలు లేవని ముందుగానే అర్థం కావడంతో చాలామంది ప్రేక్షకులు నెమ్మదిగా మైదాన్ని వీడారు. రద్దు ప్రకటన వచ్చే సమయానికి కొద్ది మంది మాత్రమే స్టాండ్స్‌లో కనిపించారు. దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యం టీమిండియా సిరీస్ గెలుస్తుందా? లేక సౌతాఫ్రికా సమం చేస్తుందా? అనేది శుక్రవారం అహ్మదాబాద్‌లో జరిగే ఐదో, ఆఖరి టీ20లో తేలనుంది.
వేళ్లన్నీ
బీసీసీఐ వైపే..
శీతాకాలంలో వాతావరణ పరిస్థితులను అంచనావేయకుండా బీసీసీఐ ఉత్తర భారతంలో మ్యాచ్‌లను షెడ్యూల్ చేయడం విమర్శలకు దారి తీసింది. లఖ్‌నవూ, న్యూ చండీగఢ్, ధర్మశాలలో ఈ రోజుల్లో చలి తీవ్రంగా ఉంటుంది. బుధవారం లఖ్‌నవూలో గాలి నాణ్యత కూడా ప్రమాదకర స్థాయికి పడిపోయింది. భారత జట్టు వామప్ చేసేటప్పుడు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాస్క్ ధరించి కనిపించాడు. దీంతో ఆటగాళ్ల ఆరోగ్యం విషయంలో బోర్డుకు ఎంత శ్రద్ధ ఉందో ఇట్టే అర్థమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, రొటేషన్ పాలసీని అనుసరిస్తున్న బీసీసీఐ ఈ వేదికలను ఖరారు చేసింది. కానీ, వాతావరణం గురించి ఏమాత్రం ఆలోచించలేదు. న్యూజిలాండ్‌తో జనవరి 11 నుంచి జరిగే వైట్‌బాల్ సిరీ్‌సలకు పశ్చిమ, దక్షిణ భారతంలోని వడోదర, రాజ్‌కోట్, ఇండోర్, నాగ్‌పూర్, విశాఖపట్నం, తిరువనంతపురాన్ని వేదికలుగా ఎంపిక చేశారు. కానీ, వీటిని ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లకు ఎంపిక చేస్తే తాజా సిరీస్ సజావుగా సాగేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రొటేషన్ పాలసీకి న్యాయం చేసినట్టు ఉండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధర్మశాలలోని తీవ్ర చలికి తాను ఎంతో ఇబ్బందిపడినట్టు స్పిన్నర్ వరణ్ చక్రవర్తి చెప్పాడు. ఈ నేపథ్యంలో బోర్డు ఆపరేషన్స్ టీమ్ పనితీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణాన్ని గమనించి మ్యాచ్‌ను కొన్ని గంటల ముందు నిర్వహించేలా ప్లాన్-బిని సిద్ధం చేసి ఉంటే కొంతలో కొంత మెరుగ్గా ఉండేదని అభిప్రాయం వినవస్తోంది.

కోచ్ జువాన్‌తో అల్కారజ్ కటీఫ్
వాషింగ్టన్: ప్రపంచ టెన్నిస్ నెంబర్‌వన్ ఆటగాడు కార్లోస్ అల్కారజ్.. సుదీర్ఘకాలంగా తనకు కోచ్‌గా వ్యవహరిస్తున్న 45 ఏళ్ల జువాన్ కార్లోస్ ఫెరెరోకు గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని అల్కారజ్ బుధవారం సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. స్పెయిన్ మాజీ ఆటగాడైన జువాన్.. అల్కారజ్‌కు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతని గురువుగా చేరాడు. చిరుప్రాయం నుంచే అల్కారజ్‌ను అద్భుత ఆటగాడిగా తీర్చిదిద్డడంలో జువాన్‌ది కీలకపాత్ర. జువాన్ హయాంలోనే అల్కారజ్ 6 గ్రాండ్‌స్లామ్స్ సాధించాడు. 24 టూర్ స్థాయి టైటిళ్లు నెగ్గాడు. అంతేకాదు.. 19 ఏళ్ల వయసులోనే వరల్డ్ నెంబర్‌వన్‌గా నిలిచి ఈ ఘనత అందుకున్న తొలి ఆటగాడిగా రికార్డుకెక్కాడు.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం