Share News

BCCI : టెస్ట్‌ క్రికెట్‌లో రెండంచెల విధానం?

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:11 AM

టెస్ట్‌ క్రికెట్‌ను కాపాడుకోవడంలో భాగంగా రెండంచెల విధానాన్ని తీసుకొచ్చేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య

BCCI : టెస్ట్‌ క్రికెట్‌లో రెండంచెల విధానం?

తెరవెనుక జోరుగా ప్రయత్నాలు

జై షా ఆసక్తి!

బీసీసీఐ కూడా ఓకే చెప్పే అవకాశం

న్యూఢిల్లీ: టెస్ట్‌ క్రికెట్‌ను కాపాడుకోవడంలో భాగంగా రెండంచెల విధానాన్ని తీసుకొచ్చేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరిగిన 5 టెస్ట్‌ల సిరీస్‌కు విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని టెస్ట్‌ క్రికెట్‌ ఆడే ప్రధాన దేశాలైన భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మధ్య తరచూ సిరీ్‌సలను నిర్వహించాలన్న చర్చ మొదలైంది. రెండంచెల విధానానికి ఐసీసీ చైర్మన్‌ జై షా సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో బీసీసీఐ, క్రికెట్‌ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డులతో ఈ నెలాఖరులో భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే, 2027 వరకు భవిష్యత్‌ టూర్‌ షెడ్యూల్‌ ఈపాటికే ఖరారైనా.. తాజా పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. రెండంచెల విధానం ప్రతిపాదన కొత్తదేం కాదు. 2016లోనే ఈ ఆలోచన తెరపైకి వచ్చింది. కానీ, చిన్న జట్లకు అన్యాయం జరుగుతుందని బీసీసీఐ, జింబాబ్వే, బంగ్లాదేశ్‌ బోర్డులు వ్యతిరేకించాయి. కానీ, తొమ్మిదేళ్లలో చోటు చేసుకొన్న మార్పుల నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్‌, ప్రముఖ కామెంటేటర్‌ రవిశాస్త్రి లాంటి వారు కూడా రెండంచెల విధానానికి ఓటేస్తున్నారు. టెస్ట్‌ క్రికెట్‌ను బతికించుకోవాలంటే ఇంతకుమించిన మార్గం లేదని శాస్త్రి బలంగా వాదిస్తున్నాడు. కాగా, వరల్డ్‌ టెస్ట్‌ క్రికెట్‌ చాంపియన్‌షి్‌ప విధానాన్ని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ కూడా తీవ్రంగా విమర్శించాడు. తనకు ఇది ఏమాత్రం అర్థం కాలేదన్నాడు.

టూ-టైర్‌

అంటే..

టెస్ట్‌ క్రికెట్‌ ఆడే దేశాలను రెండు డివిజన్లుగా వర్గీకరిస్తారు. డివిజన్‌-1లో అత్యుత్తమ టెస్ట్‌ క్రికెట్‌ జట్లు భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్‌ల మధ్య తరచూ సిరీ్‌సలు నిర్వహించేలా చూస్తారు. టెస్ట్‌ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే లాంటి జట్లను ద్వితీయశ్రేణి జట్లుగా గుర్తించి వాటి మధ్య మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో సుదీర్ఘ ఫార్మాట్‌లో అంతగా రాణించలేకపోతున్న వెస్టిండీస్‌ను కూడా దిగువస్థాయి జట్టుగానే పరిగణించే అవకాశం ఉంది. ఇలా వర్గీకరించడం వల్ల ప్రధాన జట్ల మధ్య ఎక్కువ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నాలుగేళ్లలో రెండుసార్లు తలపడే జట్లు.. ఇదే సమయంలో మూడుసార్లు ఆడే చాన్సులున్నాయి. కాగా, డివిజన్‌-2లోని జట్లకు ఉన్నతి ఉంటుందా? లేదా? అనే విషయంపై ఇంకా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ఒకరకంగా రంజీ ట్రోఫీలో ఎలీట్‌, ప్లేట్‌ గ్రూప్‌ తరహా విధానాన్ని అంతర్జాతీయ స్థాయిలో అమలు చేసే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.

Updated Date - Jan 07 , 2025 | 05:11 AM