కల నిజమాయె
ABN , Publish Date - Jun 04 , 2025 | 05:16 AM
ఒకటా..రెండా..ఏకంగా 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఏబీ డివిల్లీర్స్, క్రిస్ గేల్, డుప్లెసి, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, కలిస్, జహీర్ ఖాన్ వంటి సూపర్‌స్టార్లు ప్రాతినిధ్యం వహించిన జట్టది. కానీ నేటివరకు బెంగళూరు జట్టుకు టైటిల్ అందని ద్రాక్షే అయ్యింది..
ఒకటా..రెండా..ఏకంగా 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఏబీ డివిల్లీర్స్, క్రిస్ గేల్, డుప్లెసి, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, కలిస్, జహీర్ ఖాన్ వంటి సూపర్‌స్టార్లు ప్రాతినిధ్యం వహించిన జట్టది. కానీ నేటివరకు బెంగళూరు జట్టుకు టైటిల్ అందని ద్రాక్షే అయ్యింది. ప్రతి ఏడాదీ ‘ఈ సాల కప్ నమ్దే’ అంటూ ఊదరగొట్టడం.. కీలక సమయాల్లో బోల్తా కొట్టి తీవ్ర నిరాశలో కూరుకుపోవడం ఏళ్లుగా ఆటగాళ్లతోపాటు ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కూ అలవాటైపోయింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ రికార్డు చూస్తే....మూడుసార్లు (2009, 2011, 2016) తుది మెట్టుపై బోల్తా.. రెండుసార్లు (2015, 2022) క్వాలిఫయర్-2లో చుక్కెదురు..మరో మూడుసార్లు (2020, 2021, 2024) ఎలిమినేటర్లలో ఎదురు దెబ్బలుతిని నిష్క్రమించింది. మరీ ముఖ్యంగా 2016లో అద్భుత ఫామ్‌లో ఉన్న నాటి సారథి విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీలు సహా మొత్తం 973 పరుగులతో అదరగొట్టినా..ఆ జట్టుకు ట్రోఫీ అందుకోలేకపోయింది. ఆ సీజన్‌లో బెంగళూరు అభిమానుల బాధ వర్ణనాతీతం! ఎట్టకేలకు ఆర్‌సీబీ చిరకాల స్వప్నం సాకారమైంది. ‘మెగా ట్రోఫీ’ని ఆ జట్టు 18వ సీజన్‌లో ఒడిసి పట్టింది. తమ అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో తీవ్ర వేదనలో ఉన్న అతడి అభిమానులను ఆర్‌సీబీ జట్టు ఐపీఎల్ ఫైనల్ విజయం ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
స్పష్టమైన ప్రణాళికతో..
ఈ సీజన్‌లో టైటిల్ అందుకోవడాన్ని ఏకైక లక్ష్యంగా ఆర్‌సీబీ నిర్దేశించుకుంది. ఈ క్రమంలో జట్టును సమూలంగా ప్రక్షాళన చేయాలని వ్యూహకర్తలు నిర్ణయించారు. ఆ మేరకు పక్కా ప్రణాళికతో వేలంలోకి దిగారు. రిటైన్ చేసుకున్న కోహ్లీ, రజత్ పటీదార్, యశ్ దయాల్ అంచనాలను అందుకొని జట్టు విజయాలలో తమ వంతు పాత్ర పోషించారు. వికెట్ కీపర్, బ్యాటర్ ఫిల్ స్టాల్, కోహ్లీ మెరుపు ఆరంభాలివ్వగా....దేవదత్ పడిక్కళ్, రజత్ పటీదార్, లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ మిడిలార్డర్‌లో చెలరేగారు. ఆల్‌రౌండర్లు టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ లోయరార్డర్‌లో దంచికొట్టారు. ఇక ఆర్‌సీబీ బౌలింగ్ విభాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా ఆస్ట్రేలియా పేసర్ జోష్ హాజెల్‌వుడ్ వికెట్ల వేట కొనసాగించగా..భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ అండగా నిలిచారు. స్పిన్నర్లు క్రునాల్ పాండ్యా, సుయాష్ శర్మ ప్రత్యర్థులను పూర్తిగా కట్టడి చేశారు. ఇలా ప్రతి ఆటగాడు తమ బాధ్యతను అత్యంత సమర్థంగా నిర్వర్తించారు. మొత్తంగా సమష్టితత్వం ప్రధాన ఆయుధంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి