Share News

Womens Young Chess Prodigy: దివ్య చరితం

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:00 AM

తాను పుట్టకముందే ప్రత్యర్థి హంపికి గ్రాండ్‌ మాస్టర్‌ హోదా.. ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు గెలిచిన అనుభవం.. అయితేనేం, యువ కెరటం దివ్యా దేశ్‌ముఖ్‌ సంచలన ఆటతీరుతో అదరగొట్టింది. తనకంటే...

Womens Young Chess Prodigy: దివ్య చరితం

ప్రైజ్‌మనీ

దివ్యకు - రూ. 43 లక్షలు

హంపికి - రూ. 30 లక్షలు

మహిళల చెస్‌ ప్రపంచకప్‌ విజేత దేశ్‌ముఖ్‌

గ్రాండ్‌ మాస్టర్‌ హోదా కూడా సొంతం

ఫ ఈ ఘనత సాధించిన పిన్నవయస్కురాలిగా రికార్డు

ఫ ఫైనల్‌ టైబ్రేక్‌లో హంపికి నిరాశ

తాను పుట్టకముందే ప్రత్యర్థి హంపికి గ్రాండ్‌ మాస్టర్‌ హోదా.. ఎన్నో అంతర్జాతీయ టోర్నీలు గెలిచిన అనుభవం.. అయితేనేం, యువ కెరటం దివ్యా దేశ్‌ముఖ్‌ సంచలన ఆటతీరుతో అదరగొట్టింది. తనకంటే రెట్టింపు వయసున్న హంపిని ఓడించి.. వరల్డ్‌కప్‌ సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది. టీనేజ్‌లోనే అద్భుతం చేసిన 19 ఏళ్ల దివ్య.. 64 గళ్ల ఆటలో యువరాణిగా చెస్‌ ప్రపంచాన్ని శాసించేందుకు సిద్ధమైంది.

బటూమి (జార్జియా): ఎంతో ఉత్కంఠగా సాగిన మహిళల వరల్డ్‌కప్‌ టైబ్రేక్‌లో 19 ఏళ్ల దివ్యా దేశముఖ్‌ అదరగొట్టింది. తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపితో జరిగిన మెగా ఫైనల్లో సోమవారం జరిగిన టైబ్రేక్‌లో దివ్య 2.5-1.5తో విజయం సాధించింది. ఈ విక్టరీతో ప్రతిష్ఠాత్మక చెస్‌ వరల్డ్‌కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకొన్న తొలి భారత, పిన్నవయస్కురాలిగా దివ్య చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. గ్రాండ్‌ మాస్టర్‌ హోదాను కూడా దక్కించుకొంది. మహిళల వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్స, ప్రపంచకప్‌ మినహా అన్ని టైటిళ్లు నెగ్గిన హంపి.. చిరకాల స్వప్నానికి అడుగుదూరంలోనే నిలిచిపోయింది. విశ్వనాథన్‌ ఆనంద్‌ (2000, 2002) తర్వాత చెస్‌ వరల్డ్‌కప్‌ గెలిచిన భారత ప్లేయర్‌గా దివ్య రికార్డులకెక్కింది.

హోరా హోరీగా: టైటిల్‌ ఫైట్‌లో తొలి రెండు క్లాసిక్‌ గేమ్‌లు డ్రా కావడంతో హంపి, దివ్య 1-1తో సమంగా నిలిచారు. నిర్ణాయక టైబ్రేక్‌లో తొలి రెండు ర్యాపిడ్‌ గేమ్‌ల సెట్‌లో తీవ్ర ఒత్తిడి మధ్య దివ్య 1.5-0.5తో హంపికి ఝలకిచ్చింది. ర్యాపిడ్‌ గేమ్‌-1లో ఇద్దరూ బలగాలను నడిపించారు. 81 ఎత్తులపాటు పోరాడినా ఈ గేమ్‌ డ్రాగా ముగిసింది. తెల్లపావులతో ఆడిన దివ్య కింగ్‌ పాన్‌ ఓపెనింగ్‌ చేయగా.. పెట్రోఫ్‌ డిఫెన్స్‌ను ఎంచుకొన్న హంపి తొలి ఎత్తులోనే డ్రాకు ప్రయత్నిస్తున్నట్టు అర్థమైంది.


కూల్చేసిన ‘సమయం’: రెండో గేమ్‌లో తెల్లపావులతో ఆడిన హంపి కాటలాన్‌ ఓపెనింగ్‌ ఎంచుకోగా.. ముందుగానే సన్నద్ధమైన దివ్య అదే రీతిలో కౌంటర్‌ ఇచ్చింది. ఆరంభంలో దేశముఖ్‌ వేగంగా ఎత్తులు వేస్తే.. హంపి మాత్రం కొంత సమయం తీసుకోవడంతో ఆమెపై క్రమంగా ఒత్తిడి పెరిగింది. అయితే, ఇద్దరూ బలగాల్లో సమంగా నిలిచారు. దీంతో ఈ గేమ్‌ కూడా డ్రాగానే భావించారు. కానీ, 40వ ఎత్తులో ఒక్కసారిగా సంయమనం కోల్పోయిన హంపి.. పాన్‌ను త్యాగం చేసి ప్రత్యర్థి కోటలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసింది. మిడిల్‌ గేమ్‌లో వైట్‌ పాన్‌ను చంపిన దివ్య.. ఆ తర్వాత క్వీన్‌ను త్యాగం చేసింది. ఈ క్రమంలో 54వ ఎత్తులో ప్రత్యర్థి పాన్‌ను చంపిన హంపి తప్పిదం చేసింది. దీంతో ఎక్కువ ఖాళీ రావడంతో దేశ్‌ముఖ్‌ తన బలగాలను స్వేచ్ఛగా కదిలించగలింది. అయితే, ఎండ్‌గేమ్‌లో కోనేరు చేసిన తప్పిదం, సమయాభావంతో దివ్య గెలిచే స్థితిలో నిలిచింది. ఆఖరికి 75వ ఎత్తు అనంతరం హంపి రిజైన్‌ చేయడంతో.. దివ్య భావోద్వేగంలో మునిగిపోయింది.

88వ

భారత జీఎం..

వరల్డ్‌కప్‌ విజేతగా నిలవడంతో గ్రాండ్‌ మాస్టర్‌ (జీఎం) హోదాకు కావాల్సిన నార్మ్‌ను దివ్య సొంతం చేసుకొంది. ఈ క్రమంలో భారత 88వ గ్రాండ్‌ మాస్టర్‌గా అవతరించింది. హంపి, హారిక, వైశాలి తర్వాత దేశ నాలుగో మహిళా జీఎంగా రికార్డులకెక్కింది. 2002లో హంపి జీఎం హోదా సాధించింది. అప్పటికి దివ్య జన్మించనే లేదు. 2005లో పుట్టిన దివ్య గత మూడేళ్లలోనే కెరీర్‌లో వేగంగా ఎదిగింది.

ధోనీలాగే..

ధోనీ తరహాలోనే దివ్య కూడా ఒత్తిడిలో ఎంతో అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని ఆమె మాజీ కోచ్‌ శ్రీనాథ్‌ చెప్పాడు. ‘ఆమె ఎంతో దూకుడుగా ఆడేది. కానీ, అనుభవం పెరుగుతున్న కొద్దీ మూడు ఫార్మాట్లలోనూ ఆల్‌రౌండర్‌గా మారింది. ఎంతో ఒత్తిడిలోనూ కూల్‌గా ఆడడం దివ్య ప్రత్యేకత. ధోనీ ఎలా రిస్క్‌ తీసుకొని మ్యాచ్‌లు గెలుస్తాడో.. ఆమె కూడా నరాలు తెగే ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేస్తుంది’ అని శ్రీనాథ్‌ ప్రశంసించాడు.


ఇది ఆరంభమే

దివ్యా దేశ్‌ముఖ్‌

ఈ విజయాన్ని జీర్ణించుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. ఒక్క జీఎం నార్మ్‌కూడా లేని నాకు.. ఈ తరహాలో గ్రాండ్‌ మాస్టర్‌ హోదా దక్కడాన్ని నమ్మలేకపోతున్నా. అంతా అదృష్టంగా భావిస్తా. ఈ విజయం ఆరంభం మాత్రమే..!

జూ ఫిడే మహిళల ప్రపంచకప్‌ నెగ్గిన దివ్యకు, రన్నరప్‌ హంపికి అభినందనలు. ఫైనలిస్టులు ఇద్దరు భారత్‌ నుంచే కావడం గర్వించదగ్గ అంశం. మన దేశంలో మహిళలకు అపారమైన ప్రతిభ ఉందనేందుకు ఇదే నిదర్శనం. - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

జూ అద్భుతమైన ఇద్దరు భారత క్రీడాకారిణుల మధ్య చరిత్రాత్మక ఫైనల్‌. విజేత దివ్యకు అభినందనలు. అమోఘమైన పోరాటం ప్రదర్శించిన హంపికి కూడా అభినందనలు. -ప్రధాని నరేంద్ర మోదీ

జూ ప్రపంచకప్‌ గెలవడం, జీఎం హోదా దక్కడం, క్యాండిడేట్స్‌ టోర్నీకి అర్హత సాధించడం.. ఒకేసారి ఇన్ని ఘనతలు అందుకున్న దివ్యకు అభినందనలు. ఉత్కంఠభరితమైన పోరు. హంపి గొప్ప పోరాటస్ఫూర్తిని కనబర్చింది. భారత చదరంగానికి అతిపెద్ద సంబరం తీసుకొచ్చిన క్షణం. - విశ్వనాథన్‌ ఆనంద్‌

చెస్‌లో మనదే ఆధిపత్యం

ప్రస్తుతం ప్రపంచ చదరంగంలో భారత్‌దే ఆధిపత్యం. ఏకంగా ఐదు టైటిళ్లు మన ఖాతాలోనే ఉండడమే ఇందుకు నిదర్శనం.

1 ప్రపంచ చాంపియన్‌ - గుకేశ్‌

2 పురుషుల ఒలింపియాడ్‌ విజేత - భారత్‌

3 మహిళల ఒలింపియాడ్‌ విజేత - భారత్‌

4 మహిళల ప్రపంచ ర్యాపిడ్‌ విజేత - హంపి

5 మహిళల ప్రపంచ కప్‌ విజేత - దివ్య

ఇవి కూడా చదవండి..

ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 29 , 2025 | 06:28 AM