Chennai Super Kings Defeat: చెన్నై అదే కథ
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:29 AM
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఘోర పరాజయాన్ని చవిచూసింది. సునీల్ నరైన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది

103 పరుగులకే ఆలౌట్
వరుసగా ఐదో ఓటమి
కోల్‌కతా ఘనవిజయం
నరైన్ ఆల్‌రౌండ్‌షో
చెన్నై: మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి మరో నిరాశాజనక ప్రదర్శన. ఎంఎస్ ధోనీ జట్టు పగ్గాలు చేపట్టినా.. ఆట తీరులో ఎలాంటి మార్పూ కనిపించలేదు. ఈసారి బ్యాటింగ్‌లో మరింత దారుణ వైఫల్యం కనబర్చగా.. అటు స్వల్ప స్కోరును కాపాడే క్రమంలో బౌలర్లు కూడా తేలిపోయారు. ప్రత్యర్థి కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం అదరగొట్టింది. ముఖ్యంగా స్పిన్నర్ సునీల్ నరైన్ (3/13; 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 44) బంతితో, బ్యాట్‌తోనూ మెరిశాడు. దీంతో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో చెన్నై ఇలా వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడడం ఇదే తొలిసారి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. శివమ్ దూబే (31 నాటౌట్), విజయ్ శంకర్ (29) ఫర్వాలేదనిపించారు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో కోల్‌కతా కేవలం 10.1 ఓవర్లలో 107/2 స్కోరు చేసి గెలిచింది. డికాక్ (23), రహనె (20 నాటౌట్), రింకూ సింగ్ (15 నాటౌట్) రాణించారు. నూర్ అహ్మద్, అన్షుల్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా సునీల్ నరైన్ నిలిచాడు.
61 బంతుల్లోనే ముగించారు: చెన్నై బ్యాటర్లు చెమటోడ్చిన అదే పిచ్‌పై నైట్‌రైడర్స్ మాత్రం ఓవర్‌కు పది పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. ఓపెనర్లు నరైన్, డికాక్ మెరుపు ఆరంభం అందించారు. స్పిన్, పేస్ తేడా లేకుండా బౌండరీలతో హోరెత్తించారు. దీంతో 104 పరుగుల ఛేదనలో ఈ జట్టు పవర్‌ప్లేలోనే 71/1 స్కోరుతో నిలిచింది. మూడో ఓవర్‌లో డికాక్ రెండు సిక్సర్లు బాదగా.. తర్వాతి ఓవర్‌లో నరైన్ 4,6తో ఆకట్టుకున్నాడు. అయితే ఐదో ఓవర్‌లో డికాక్‌ను పేసర్ అన్షుల్ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ ఆరో ఓవర్‌లో రహానె 6, నరైన్ 6,4తో 18 పరుగులు రావడంతో పవర్‌ప్లేలోనే ఈ జట్టు సగానికి కంటే ఎక్కువ రన్స్ రాబట్టింది. అశ్విన్ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో జోరు చూపిన నరైన్‌ను స్పిన్నర్ నూర్ బౌల్డ్ చేశాడు. అప్పటికే విజయానికి అతి సమీపంలో వచ్చిన జట్టుకు రింకూ సింగ్ సిక్సర్ బాది 59 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.
స్పిన్‌కు దాసోహం: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై బ్యాటర్లకు కోల్‌కతా స్పిన్నర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా నరైన్ ధాటికి అటు పరుగులు కాదు కదా.. వికెట్లను కాపాడుకోవడం కూడా కష్టమైంది. నరైన్‌కు తోడు వరుణ్, మొయిన్ అలీ, పేసర్ హర్షిత్ మరో ఎండ్ నుంచి కట్టడి చేయడంతో చెన్నై ఆట టెస్టు మ్యాచ్‌ను తలపించింది. 9-18 ఓవర్ల మధ్య ఓ ఫోర్ కూడా రాబట్టలేకపోయింది. స్పిన్నర్ అలీ నాలుగో ఓవర్‌ను మెయిడిన్ వేసి మరీ ఓపెపర్ కాన్వే (12) వికెట్ తీయగా తర్వాతి ఓవర్‌లోనే మరో ఓపెనర్ రచిన్ (4)ను హర్షిత్ అవుట్ చేశాడు. ఆ వెంటనే విజయ్ శంకర్ కూడా వెనుదిరగాల్సి ఉన్నా మిడా్‌ఫలో అతడిచ్చిన సులువైన క్యాచ్‌ను నరైన్ వదిలేశాడు. రాహుల్ త్రిపాఠి (16)తో కలిసి శంకర్ కాసేపు వికెట్ల పతనం ఆపగలిగాడు. ఇక ఆరో ఓవర్‌లో విజయ్ రెండు ఫోర్లతో జట్టు పవర్‌ప్లేలో 31/2తో నిలిచింది. ఇన్నింగ్స్‌లో ఏకైక సిక్సర్ కూడా ఏడో ఓవర్‌లో విజయ్ శంకరే బాదాడు. అతడి మరో క్యాచ్‌ను వెంకటేశ్ అయ్యర్ వదిలేసినా పదో ఓవర్‌లో వరుణ్‌కు చిక్కాడు. దీంతో మూడో వికెట్‌కు వీరి మధ్య అత్యధికంగా 43 పరుగులు జత చేరాయి. అనంతరం నరైన్ వరుస ఓవర్లలో త్రిపాఠి, జడేజా (0) వికెట్లు తీయగా.. అశ్విన్ (1)ను హర్షిత్ పెవిలియన్ చేర్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దీపక్ హుడాను వరుణ్ డకౌట్ చేయగా.. ప్రేక్షకుల హోరు మధ్య క్రీజులోకి వచ్చిన ధోనీ (1) సైతం జట్టును ఆదుకోలేకపోయాడు. నరైన్ ఓవర్‌లో ఎల్బీ కాగా ధోనీ రివ్యూ కోరాడు. అయితే రీప్లేలో బంతి బ్యాట్‌కు తాకినట్టు స్పైక్స్ వచ్చినా థర్డ్ అంపైర్ అవుట్‌గానే ప్రకటించడంతో స్టేడియం మూగబోయింది. అటు స్పిన్‌ను అద్భుతంగా ఆడే దూబే క్రీజులోనే ఉన్నా భారీ షాట్లు ఆడడం కష్టమైపోయింది. చివరకు 63 బంతుల తర్వాత 19వ ఓవర్‌లో అతను చెన్నై జట్టుకు ఓ ఫోర్ అందించాడు. అలాగే ఆఖరి ఓవర్‌లో దూబే రెండు ఫోర్లతో జట్టు అతికష్టంగా వంద పరుగులు దాటగలిగింది.
స్కోరుబోర్డు
చెన్నై: రచిన్ (సి) రహానె (బి) హర్షిత్ 4, కాన్వే (ఎల్బీ) మొయిన్ అలీ 12, రాహుల్ త్రిపాఠి (బి) నరైన్ 16, విజయ్ శంకర్ (సి) మొయిన్ అలీ (బి) వరుణ్ 29, శివమ్ దూబే (నాటౌట్) 31, అశ్విన్ (సి) వైభవ్ అరోరా (బి) హర్షిత్ 1, జడేజా (సి) డికాక్ (బి) నరైన్ 0, దీపక్ హుడా (సి) వైభవ్ అరోరా (బి) వరుణ్ 0, ధోనీ (ఎల్బీ) నరైన్ 1, నూర్ అహ్మద్ (సి) వరుణ్ (బి) వైభవ్ అరోరా 1, అన్షుల్ (నాటౌట్) 3, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 103/9; వికెట్ల పతనం: 1-16, 2-16, 3-59, 4-65, 5-70, 6-71, 7-72, 8-75, 9-79; బౌలింగ్: వైభవ్ అరోరా 4-0-31-1, మొయిన్ అలీ 4-1-20-1, హర్షిత్ రాణా 4-0-16-2, వరుణ్ చక్రవర్తి 4-0-22-2, సునీల్ నరైన్ 4-0-13-3.
కోల్‌కతా: డికాక్ (బి) అన్షుల్ 23, నరైన్ (బి) నూర్ 44, రహానె (నాటౌట్) 20, రింకూ సింగ్ (నాటౌట్) 15, ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 10.1 ఓవర్లలో 107/2; వికెట్ల పతనం: 1-46, 2-85; బౌలింగ్: ఖలీల్ 3-0-40-0, అన్షుల్ 2-0-19-1, అశ్విన్ 3-0-30-0, నూర్ 2-0-8-1, జడేజా 0.1-0-9-0.