Share News

Border-Gavaskar Trophy : ప్చ్‌.. అదేతీరు

ABN , Publish Date - Jan 04 , 2025 | 06:00 AM

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో వేదికలు మారుతున్నాయి కానీ భారత బ్యాటింగ్‌ తీరు మాత్రం మారడం లేదు. పేలవ ఫామ్‌ కారణంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై వేటు పడినా.. ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. కొత్త ఏడాదిలో ఆరంభమైన ఐదో

Border-Gavaskar Trophy : ప్చ్‌.. అదేతీరు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 185

ఆసీస్‌ మొదటి ఇన్నింగ్స్‌ 9/1

రోహిత్‌కు విశ్రాంతి

కొనసాగిన బ్యాటింగ్‌ వైఫల్యం

ఐదో టెస్టు

సిడ్నీ: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో వేదికలు మారుతున్నాయి కానీ భారత బ్యాటింగ్‌ తీరు మాత్రం మారడం లేదు. పేలవ ఫామ్‌ కారణంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై వేటు పడినా.. ఎలాంటి ఫలితమూ కనిపించలేదు. కొత్త ఏడాదిలో ఆరంభమైన ఐదో టెస్టులో శుక్రవారం తొలి రోజే జట్టు కుప్పకూలింది. బంతి అనూహ్యంగా బౌన్స్‌ కావడంతో ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి పరుగులు సాధించడంలో వెనుకబడ్డారు. అయితే రిషభ్‌ పంత్‌ (40) మాత్రం బౌన్సర్లను కాచుకుంటూ ఒళ్లు హూనమవుతున్నా ఓపిగ్గా క్రీ జులో నిలిచాడు. కానీ అతడి అద్భుత పోరాటం మరోసారి అనవసర షాట్‌తో ముగిసింది. అటు విరాట్‌ (17) సైతం తన బలహీనతను ఈసారీ అధిగమించలేకపోయాడు. దీంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 72.2 ఓవర్లలో 185 పరుగులు మాత్రమే చేసింది. పంత్‌కు జడేజా (26) సహకరించగా, చివర్లో తాత్కాలిక కెప్టెన్‌ బుమ్రా (22) చెలరేగాడు. పేసర్లు బోలాండ్‌కు 4, స్టార్క్‌కు 3, కమిన్స్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 ఓవర్లలో ఖవాజా (2) వికెట్‌ కోల్పోయి 9 రన్స్‌ చేసింది. క్రీజులో కాన్‌స్టా్‌స (7) ఉన్నాడు. రోహిత్‌ స్థానంలో గిల్‌, ఆకాశ్‌ స్థానంలో ప్రసిద్ధ్‌ బరిలోకి దిగారు.

ఆరంభం నుంచే..: భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగడం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. సిడ్నీ పిచ్‌ సహజంగా ఆరంభంలో బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందన్న అంచనాతో బుమ్రా ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఆకాశం మబ్బుపట్టి ఉండడంతో పాటు పిచ్‌పై పచ్చిక ఉండడంతో ఆసీస్‌ పేసర్లు పండగ చేసుకున్నారు. చక్కటి సీమ్‌తో భారత బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో ఒక్కో పరుగు కోసం కష్టపడిన జట్టు తొలి సెషన్‌లో 57 పరుగులు మాత్రమే సాధించి రాహుల్‌ (4), జైస్వాల్‌ (10), గిల్‌ (20) వికెట్లను కోల్పోయింది. విరాట్‌ సైతం గోల్డెన్‌ డకౌట్‌ అయ్యేవాడే. స్లిప్‌లో స్మిత్‌ అందుకున్న క్యాచ్‌ తిరిగి గాల్లోకి లేవగా బోలాండ్‌ అందుకున్నాడు. అయితే రీప్లేలో స్మిత్‌ చేతిలో ఉన్నప్పుడే బంతి నేలకు తాకినట్టు తేలింది. ఆ తర్వాత విరాట్‌ దీటుగా క్రీజులో నిలిచాడు. ఆఫ్‌సైడ్‌ ఆవలి బంతులను వదిలేస్తూ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఈసారి తన స్టాన్స్‌ను కూడా మార్చుకున్నాడు. కానీ 69 బంతులా డిన కోహ్లీ ఆసీస్‌ ఉచ్చులో పడక తప్పలేదు.

పంత్‌-జడేజా పోరాటం: కోచ్‌ గంభీర్‌ సూచనల మేరకు పంత్‌ ఈసారి భారీ షాట్లకు వెళ్లకుండా ఓపిగ్గా ఆడాడు. అటు జడేజా కూడా సహకరించడంతో ఐదో వికెట్‌కు 48 పరుగులు సమకూరాయి. జడ్డూ మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడు స్లిప్‌లో స్మిత్‌ సులువైన క్యాచ్‌ను వదిలేశాడు. అయితే చివరి సెషన్‌లో ఆసీస్‌ మరోసారి దెబ్బతీసింది. ఒకే ఓవర్‌లో పంత్‌, నితీశ్‌ (0)లను వరుస బంతుల్లో బోలాండ్‌ అవుట్‌ చేసి షాకిచ్చాడు. 120/6 స్కోరుతో నిలిచిన జట్టుకు చివర్లో బుమ్రా వేగంగా పరుగులు అందించాడు. 68వ ఓవర్‌లో 3 ఫోర్లతో, ఆ తర్వాత ఓ సిక్సర్‌ బాది ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.

ఒక్క బౌండరీ కూడా బాదకుండా ఎక్కువ బంతులు (69) ఎదుర్కోవడం కోహ్లీకిదే తొలిసారి.

విదేశీ గడ్డపై ఓ సిరీస్‌లో ఎక్కువ వికెట్లు (31) తీసిన భారత బౌలర్‌గా బిషన్‌ సింగ్‌ రికార్డును సమం చేసిన బుమ్రా.

పోటెత్తిన ఫ్యాన్స్‌

సిడ్నీ టెస్టులో తొలి రోజు ఆటను తిలకించేందుకు అభిమానులు భారీ స్థాయిలో హాజరయ్యారు. గ్రౌండ్‌ సామర్థ్యం 48 వేలు కాగా, శుక్రవారం 47,556 మంది ఆటను తిలకించారు. 1976 తర్వాత ఈస్థాయిలో హాజరుకావడం ఇదే తొలిసారని క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది.

తొలి సెషన్‌లో చెలరేగితే..

సిడ్నీ పిచ్‌పై తొలి రోజు బంతి ఇంతలా బౌన్స్‌ కావడం గతంలో జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. పంత్‌కు తగిలిన బంతులు కూడా అలాంటివే. అందుకే ఆసీస్‌కు టాస్‌ కోల్పోవడమే లాభించిందని చెబుతున్నారు. ఇక రెండో రోజు శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఆరంభంలోనే బుమ్రా మరింతగా చెలరేగి ఆసీస్‌ వికెట్లను త్వరత్వరగా పడగొడితే మ్యాచ్‌పై భారత్‌ పట్టు బిగించే అవకాశం ఉంటుంది.

దెబ్బలే దెబ్బలు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ పేసర్ల నుంచి బుల్లెట్‌లాంటి బంతులు నేరుగా శరీరాన్ని తాకడంతో రిషభ్‌ పంత్‌ బాధతో విలవిల్లాడాడు. ఈక్రమంలో అతడి పొత్తి కడుపులో రెండుసార్లు, ఓసారి హెల్మెట్‌కు బంతి తాకింది. ఇక మిచెల్‌ స్టార్క్‌ ఓవర్‌లో దూసుకువచ్చిన ఓ బంతి అయితే అతడి మోచేతికి కాస్త పైన తాకడంతో ఆ ప్రాంతమంతా ఎర్రగా కమిలిపోయింది. ఇక వాషింగ్టన్‌ సుందర్‌, సిరాజ్‌ కూడా బంతి తగలడంతో ఇబ్బంది పడ్డారు.

స్కోరుబోర్డు’

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) వెబ్‌స్టర్‌ (బి) బోలాండ్‌ 10; రాహుల్‌ (సి) కాన్‌స్టా్‌స (బి) స్టార్క్‌ 4; గిల్‌ (సి) స్మిత్‌ (బి) లియోన్‌ 20; కోహ్లీ (సి) వెబ్‌స్టర్‌ (బి) బోలాండ్‌ 17; పంత్‌ (సి) కమిన్స్‌ (బి) బోలాండ్‌ 40; జడేజా (ఎల్బీ) స్టార్క్‌ 26; నితీశ్‌ (సి) స్మిత్‌ (బి) బోలాండ్‌ 0; సుందర్‌ (సి) క్యారీ (బి) కమిన్స్‌ 14; ప్రసిద్ధ్‌ (సి) కాన్‌స్టా్‌స (బి) స్టార్క్‌ 3; బుమ్రా (సి) స్టార్క్‌ (బి) కమిన్స్‌ 22; సిరాజ్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 26; మొత్తం: 72.2 ఓవర్లలో 185 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-11, 2-17, 3-57, 4-72, 5-120, 6-120, 7-134, 8-148, 9-168, 10-185. బౌలింగ్‌: స్టార్క్‌ 18-5-49-3; కమిన్స్‌ 15.2-4-37-2; బోలాండ్‌ 20-8-31-4; వెబ్‌స్టర్‌ 13-4-29-0; లియోన్‌ 6-2-19-1.

ఆస్ర్టేలియా తొలి ఇన్నింగ్స్‌: కాన్‌స్టా్‌స (బ్యాటింగ్‌) 7; ఉస్మాన్‌ ఖవాజా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 2; మొత్తం: 3 ఓవర్లలో 9/1. వికెట్‌ పతనం: 1-9; బౌలింగ్‌: బుమ్రా 2-0-7-1; సిరాజ్‌ 1-0-2-0.

Updated Date - Jan 04 , 2025 | 06:00 AM