Greg Chappell: సూర్యవంశీ పక్కదారి పట్టకుండా బీసీసీఐ కాపాడుకోవాలి.. మాజీ టీమిండియా కోచ్ గ్రెగ్ ఛాపెల్ సూచన
ABN , Publish Date - May 03 , 2025 | 02:49 PM
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని కాపాడుకోవాలంటూ బీసీసీకి టీమిండియా మాజీ కోచ్ తాజాగా సూచించారు. ఇది ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకే ఒక సెంచరీతో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల చిరు ప్రాయంలో తన సెంచరీతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భవిష్యత్ టీమిండియాకు ముఖచిత్రంగా నిలిచాడు. దీంతో, అతడి భవిష్యత్తుకు ఢోకా ఉండదన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అయితే, భారత క్రికెట్ సంబంధించి ప్రతి తరంలోనూ ఇలాంటి అద్భుత యువ క్రీడాకారులు తెరపైకి వచ్చారు. కొందరు మాత్రమే అంచనాలను అందుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించారు. మరికొందరు క్రికెట్ ప్రపంచంలోని పేరు ప్రఖ్యాతులు, డబ్బు చూసి పక్కదారి పట్టి కెరీర్‌ను నాశనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యవంశీని కాపాడుకోవాలంటూ బీసీసీకి సూచన చేశారు.
తన కాలమ్‌లో గ్రెగ్ ఛాపెల్.. సూర్యవంశీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘సచిన్ టెండుల్కర్ విజయానికి అతడి టాలెంట్ మాత్రమే కాదు. అతడి భావోద్వేగ పరిణితి, సచిన్‌కు చక్కటి మార్గనిర్దేశనం చేసిన చిన్ననాటి కోచ్, బాహ్య ప్రపంచపు సర్కస్‌లో పడి దారి తప్పకుండా కాపాడిన కుటుంబం సచిన్ విజయానికి కారణం. వినోద్ కాంబ్లీ సచిన్ అంత ప్రతిభావంతుడే. కానీ చిన్న వయసులో వచ్చిన గుర్తింపును హ్యాండిల్ చేయలేకపోయాడు. క్రమశిక్షణ తప్పాడు. చివరకు ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా పతనమయ్యాడు. ప్రథ్వీ షా కూడా మరో యువ సంచలనం. అయితే, అతడు మళ్లీ శిఖరాగ్రానికి చేరే అవకాశం ఉండి ఉండొచ్చు. కాబట్టి.. యువ క్రీడాకారుల టాలెంట్ సరిగ్గా మలచాల్సిన అవసరం కూడా ఉంది’’ అని అన్నారు. సూర్యవంశీని కాపాడుకోవాలని బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు సూచించారు. అతడికి మార్కెటింగ్ కోసం అతిగా వాడొద్దని అన్నారు.
క్రమశిక్షణతో సచిన్ క్రికెటింగ్ కెరీర్ అందలాలను చేరుకుంటే అనవసర ఆర్భాటాలు, పాటాటోపం, క్రమశిక్షణ రాహిత్యానికి లోనైన వినోద్ కాంబ్లీ తన కెరీర్‌ను చేజేతులా పతనం చేసుకున్నాడు. ఒకప్పుడు యువ సంచలనంగా పేరు పొందిన పృథ్వీ షాకు కూడా ప్రస్తుతం సీనియర్ టీమ్‌లో చోటులేకుండా పోయింది. అతడి సారథ్యంలో ఆడిన శుభ్‌మన్ గిల్ వంటి వారు స్టార్లుగా వెలుగొందుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు
హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం
మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి