ఆర్‌సీబీకి ఓదార్పు
ABN , Publish Date - Mar 12 , 2025 | 02:16 AM
గెలిస్తే ఫైనల్లో చోటు లభించే కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తడబడింది. అటు వరుసగా ఐదు ఓటములతో ఇప్పటికే డబ్ల్యూపీఎల్ నుంచి వైదొలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉత్కంఠ పోరులో...

రాణించిన మంధాన
ముంబైపై విజయం
డబ్ల్యూపీఎల్
ముంబై: గెలిస్తే ఫైనల్లో చోటు లభించే కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తడబడింది. అటు వరుసగా ఐదు ఓటములతో ఇప్పటికే డబ్ల్యూపీఎల్ నుంచి వైదొలిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఉత్కంఠ పోరులో హర్మన్‌ప్రీత్ సేనకు షాకిచ్చింది. మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 11 రన్స్ తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్ చెలరేగడంతో ఆర్‌సీబీ భారీ స్కోరందుకుంది. ముఖ్యంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందిపడుతున్న ఓపెనర్ స్మృతి మంధాన (53)తో పాటు ఎలిస్ పెర్రీ (49 నాటౌట్), రిచా (36) రాణించారు. ఓపెనర్ సబ్బినేని మేఘన (26)తో కలిసి మంధాన తొలి వికెట్‌కు 41, ఆ తర్వాత ఎలి్‌సతో రెండో వికెట్‌కు 59 పరుగులు జత చేసింది. చివర్లో వేర్‌హామ్ (10 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 నాటౌట్) తుఫాన్ ఇన్నింగ్స్ జట్టు విజయంలో కీలకమైంది. మరో ఎండ్‌లో ఎలిస్ కూడా ధాటిని చూపగా ఆఖరి నాలుగు ఓవర్లలో ఆర్‌సీబీ 65 పరుగులు రాబట్టింది.
బ్రంట్ పోరాటం: అనంతరం భారీ ఛేదనలో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసి ఓడింది. వీరి ఇన్నింగ్స్‌లో నాట్ సివర్ బ్రంట్ (69) ఆరంభంలో పోరాడగా, చివర్లో సజన (23) ఆర్‌సీబీని వణికించినా ఫలితం లేకపోయింది. హర్మన్ (20), మాథ్యూస్ (19) విఫలమయ్యారు. ఆఖరి ఓవర్‌లో 28 పరుగులు కావాల్సిన వేళ సజన వరుస సిక్సర్లతో హడలగొట్టి ఐదో బంతికి వెనుదిరిగింది. స్నేహ్ రాణాకు మూడు.. గార్త్, పెర్రీలకు రెండేసి వికెట్లు దక్కాయి.'
ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్
ఆర్‌సీబీ చేతిలో ముంబై ఓడిపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డబ్ల్యూపీఎల్ ఫైనల్లో ప్రవేశించింది. వాస్తవానికి ఢిల్లీ-ముంబై ఖాతాలో పది పాయింట్లే ఉన్నా రన్‌రేట్ మెరుగ్గా ఉండడం ఢిల్లీకి వరంగా మారింది. అటు గురువారం జరిగే ఎలిమినేటర్‌లో ముంబై-గుజరాత్ జట్లు తలపడతాయి. ఇందులో విజేత ఫైనల్‌కు వెళ్తుంది.
సంక్షిప్త స్కోర్లు:
బెంగళూరు: 20 ఓవర్లలో 199/3 (మంధాన 53, పెర్రీ 49 నాటౌట్, రిచా ఘోష్ 36, వేర్‌హామ్ 31 నాటౌట్; హేలీ మాథ్యూస్ 2/37)
ముంబై: 20 ఓవర్లలో 188/9 (సివర్ 69, సజన 23, హర్మన్ 20; స్నేహ్ 3/26, గార్త్ 2/33, ఎలిస్ 2/53).
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి