352.. ఊదేశారు
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:13 AM
జోష్ ఇంగ్లిస్ (86 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 120 నాటౌట్) శతకంతో విజృంభించడంతో ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా.. చాంపియన్స్ ట్రోఫీలో అదిరే బోణీ చేసింది..

ఆసీస్ రికార్డు ఛేదన
ఇంగ్లిస్ సుడిగాలి శతకం
5 వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు
డకెట్ పోరాటం వృథా
లాహోర్: జోష్ ఇంగ్లిస్ (86 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 120 నాటౌట్) శతకంతో విజృంభించడంతో ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా.. చాంపియన్స్ ట్రోఫీలో అదిరే బోణీ చేసింది. గ్రూప్-బిలో శనివారం పరుగుల వరద పారిన మ్యాచ్‌లో ఆసీస్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టోర్నీ చరిత్రలోనే ఇంగ్లండ్ అత్యధికంగా 352 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. కంగారూలు మరో 15 బంతులు మిగిలుండగానే గెలవడం విశేషం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 351 పరుగులు చేసింది. బెన్ డకెట్ (143 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్‌లతో 165), రూట్ (68) పోరాటాలు వృథా అయ్యాయి. డ్వార్షుయిస్ 3.. జంపా, లబుషేన్ చెరో 2 వికెట్లు తీశారు.
ఆదుకొన్న షార్ట్, లబుషేన్: భారీ ఛేదనలో ఆస్ట్రేలియా 47.3 ఓవర్లలో 356/5 స్కోరు చేసి గెలిచింది. రషీద్, లివింగ్‌స్టోన్, ఆర్చర్, ఉడ్ తలో వికెట్ దక్కించుకొన్నారు. హెడ్ (6), కెప్టెన్ స్మిత్ (5) స్వల్పస్కోర్లకే అవుటైనా..మరో ఓపెనర్ షార్ట్ (63), లబుషేన్ (47) మూడో వికెట్‌కు 95 పరుగులతో ఆదుకొన్నారు. అయితే, లబుషేన్‌ను రషీద్ అవుట్ చేసి.. ప్రమాదకరంగా మారిన ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. షార్ట్‌ను లివింగ్‌స్టోన్ రిటర్న్ క్యాచ్‌తో వెనక్కిపంపడంతో ఆసీస్ శిబిరంలో గుబులు రేగింది. కానీ, ఇంగ్లిస్, క్యారీ (69) ఐదో వికెట్‌కు 146 పరుగులు జోడించి జట్టులో ఆశలు రేపారు. 38వ ఓవర్‌లో రషీద్ బౌలింగ్‌లో ఆర్చర్ క్యాచ్‌ను చేజార్చడంతో బతికిపోయిన క్యారీ అర్ధ శతకం పూర్తి చేసుకొన్నాడు. అయితే, గెలుపునకు మరో 70 పరుగులు కావాల్సిన సమయంలో 42వ ఓవర్‌లో క్యారీని కార్సీ అవుట్ చేశాడు. కానీ, మ్యాక్స్‌వెల్ (32 నాటౌట్)తో కలసి ఆరో వికెట్‌కు అజేయంగా 36 బంతుల్లో 74 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇంగ్లిస్.. సిక్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 50 ఓవర్లలో 351/8 (డకెట్ 165, జో రూట్ 68; డ్వార్షుయిస్ 3/66, ఆడమ్ జంపా 2/64).
ఆస్ట్రేలియా: 47.3 ఓవర్లలో 356/5 (ఇంగ్లిస్ 120 నాటౌట్, అలెక్స్ క్యారీ 69; రషీద్ ఖాన్ 1/47, లివింగ్‌స్టోన్ 1/47).
1
టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాడిగా డకెట్ (165). 2004లో నాథన్ ఆస్టల్ (145 నాటౌట్), 2002లో ఆండీ ఫ్లవర్ (145)ను డకెట్ వెనక్కునెట్టాడు.
1
చాంపియన్స్ ట్రోఫీలో భారీ లక్ష్యాన్ని ఛేధించిన జట్టుగా ఆస్ట్రేలియా. మ్యాచ్‌లో తొలుత ఇంగ్లండ్ 351/8తో ఈ టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నెలకొల్పింది. అయితే, ఛేదనలో ఆసీస్ 356/5తో ఆ రికార్డును బద్దలుకొట్టింది. 2004లో అమెరికాపై న్యూజిలాండ్ 347/4 రికార్డు స్కోరు చేసింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..