CCTV Footage Goes Viral: ట్రాన్స్‌జెండర్ల దారుణం.. కుటుంబంపై దాడి..
ABN , Publish Date - Nov 13 , 2025 | 10:57 AM
అడిగినంత డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ట్రాన్స్‌జెండర్లు రెచ్చిపోయారు. ఓ కుటుంబంపై కర్రలతో దాడి చేశారు. ఈ సంఘటన తెలంగాణలో ఆలస్యంగా వెలుగుచూసింది.
తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. కొంతమంది ట్రాన్స్‌జెండర్లు రెచ్చిపోయి ప్రవర్తించారు. కొత్తింట్లో చేరిన కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కీసర ప్రాంతానికి చెందిన సదానంద్ అనే వ్యక్తి బాలాజీ ఎన్‌క్లేవ్‌లో కొత్తగా ఇళ్లు కట్టించాడు. ఆదివారం గృహ ప్రవేశ వేడుక జరిగింది. ఉదయం కొంతమంది ట్రాన్స్ జెండర్లు ఇంటి దగ్గరకు వచ్చారు.
ఆశీర్వదిస్తామని చెప్పి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. ఇందుకు కుటుంబసభ్యులెవ్వరూ ఒప్పుకోలేదు. దీంతో ట్రాన్స్‌జెండర్లు ఆగ్రహానికి గురయ్యారు. కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత 15 మందిదాకా ట్రాన్స్‌జెండర్లు ఆ ఇంటి దగ్గరకు చేరుకున్నారు. సదానంద్ కుటుంబసభ్యులతో గొడవ పెట్టుకున్నారు. గొడవ సందర్భంగా ట్రాన్స్‌జెండర్లు బూతులు తిడుతూ రెచ్చిపోయారు. కుటుంబసభ్యులపై కర్రలతో దాడికి సైతం దిగారు. దీంతో కుటుంబసభ్యులకు గాయాలయ్యాయి.
సదానంద్ కుటుంబసభ్యులు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలా అమాయకులపై దాడులు చేసి దోచుకునే వారిని కఠినంగా శిక్షించాలి’.. ‘ఈ మధ్యకాలంలో ఇలాంటి దాడులు విపరీతంగా పెరిగిపోయాయి’ అని అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
చీమలను ఇలా ఇంటి నుండి తరిమికొట్టండి
ఒడిశా టు ముంబై.. వయా సికింద్రాబాద్.. విషయం ఏంటంటే..