New Kaps Cafe: కపిల్ శర్మ కాఫీ షాపుపై కాల్పులు.. ప్రారంభమైన 3 రోజులకే..
ABN , Publish Date - Jul 11 , 2025 | 06:54 AM
New Kaps Cafe: కారులో షాపు దగ్గరకు వచ్చి తుపాకితో కాల్పులు జరిపాడు. కేవలం కాఫీ షాపును మాత్రమే టార్గెట్ చేసి కాల్పులు జరపటంతో ప్రాణ నష్టం జరగలేదు. ఎవరూ గాయపడలేదు.
ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ‘ది కపిల్ శర్మ షో’తో దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి.. నేడు షోకు కోటి రూపాయలు పైనే తీసుకునే స్థాయికి ఎదిగారు. ఓ వైపు సినిమాలు.. మరో వైపు షోలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ఆయన కొత్తగా వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టారు. కెనడాలో ఓ కాఫీ షాపు ప్రారంభించారు. ఆ కాఫీ షాపు పేరు ‘కాప్స్ కేఫ్’.
జులై 9వ తేదీన కెనడాలోని సుర్రెలో ఈ కాఫీ షాపు ప్రారంభం అయింది. అయితే, ఈ కాఫీ షాపుపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. కారులో షాపు దగ్గరకు వచ్చి తుపాకితో కాల్పులు జరిపాడు. కేవలం కాఫీ షాపును మాత్రమే టార్గెట్ చేసి కాల్పులు జరపటంతో ప్రాణ నష్టం జరగలేదు. ఎవరూ గాయపడలేదు. ఖలిస్తానీ ఉగ్రవాదులే ఈ కాల్పులకు కారణం అని తేలింది. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్‌జీత్ సింగ్ లడ్డి ఈ కాల్పులు తామే జరిపినట్లు ప్రకటించాడు. గతంలో కపిల్ శర్మ చేసిన కొన్ని కామెంట్లకు ప్రతిగా ఈ కాల్పులు జరిపినట్లు తెలిపాడు. కాగా, లడ్డి ఎన్‌ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్నాడు.
కమెడియన్ నుంచి హోస్ట్‌గా..
కపిల్ శర్మ సింగర్ కావాలని పంజాబ్ నుంచి ముంబై వచ్చాడు. 2007లో ‘దిగ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్’సీజన్ 3లో పాల్గొన్నాడు. విజేతగా నిలిచి 10 లక్షల రూపాయలు గెలుచుకున్నాడు. 2013లో సొంతంగా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’పేరిట ఓ షో ప్రారంభించాడు. ఈ షోతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో ‘ది కపిల్ శర్మ షో’ పేరుతో కొత్త షో ప్రారంభించాడు. ఈ షోతో దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయితే, కపిల్ తాగుడు అలవాటు కారణంగా తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
నా కోడిని కొట్టినోడిని జైల్లో పెట్టాల్సిందే !