Actress Abhinaya: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన నటి అభినయ
ABN , Publish Date - Apr 17 , 2025 | 07:18 AM
Actress Abhinaya: రవితేజ హీరోగా.. పూరీ జగన్నాథ్ తీసిన నేనింతే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు.తమిళ స్టార్ హీరో విశాల్‌తో కలిసి ‘ మార్క్ ఆంటోనీ’ అనే సినిమాలో నటించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి.
ప్రముఖ బహుభాషా నటి అభినయ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. చిన్ననాటి మిత్రుడ్ని పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వీ కార్తీక్ అనే వ్యక్తితో అభినయ ఏడడుగులు వేశారు. బుధవారం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. అభినయ, కార్తీక్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.
నేనింతే సినిమాతో వెండి తెరపైకి
అభినయ 2008 నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. రవితేజ హీరోగా.. పూరీ జగన్నాథ్ తీసిన నేనింతే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఓ యాడ్ ఏజెన్సీ ద్వారా అభినయ ఫొటోలు చూసిన దర్శకుడు సముద్ర ఖని.. తాను తీసిన ‘నాడోడిగల్’ అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఇదే ఆమె మొదటి తమిళ సినిమా. ఈ సినిమాను తెలుగులో ‘ శంభో శివ శంభో’ పేరిటి రీమేక్ చేశారు. ఇందులో రవి తేజ చెల్లెలిగా నటించారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన ‘ముక్తి అమ్మన్’ అనే సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
పుకార్లకు చెక్..
నటి అభినయ తమిళ స్టార్ హీరో విశాల్‌తో కలిసి ‘ మార్క్ ఆంటోనీ’ అనే సినిమాలో నటించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇద్దరికీ సీక్రెట్‌గా నిశ్చితార్థం జరిగిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. ఈ పుకార్లపై విశాల్‌తో పాటు అభినయ కూడా స్పందించారు. అప్పుడే తన లాంగ్ టర్మ్ రిలేషన్, ప్రియుడి గురించి మీడియాకు చెప్పారు. అతడి ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. మార్చి 9వ తేదీన అభినయ, కార్తీక్‌ల నిశ్చితార్థం జరిగింది. నిన్న పెళ్లి బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఈ నెల 20వ తేదీన రిసెప్షన్ జరగనుందని సమాచారం.
ఇవి కూడా చదవండి
Hyderabad: రూ.15లక్షల రుణం కోసం 44.83 లక్షలు సమర్పణ
Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు