Share News

Walmart: హెచ్-1బీ వీసా దుర్వినియోగం ఆరోపణలు.. ఖండించిన వాల్‌మార్ట్

ABN , Publish Date - Aug 26 , 2025 | 09:04 AM

వాల్‌మార్ట్‌లో ఇటీవల కొందరు అసోసియేట్స్ తొలగింపునకు, హెచ్-1బీ వీసా దుర్వినియోగానికి ఎలాంటి సంబంధం లేదని సంస్థ తాజాగా పేర్కొంది. విదేశీ వర్కర్ల నియామకానికి ప్రతిగా డబ్బులు చేతులు మారాయని సోషల్ మీడియాలో ఆరోపణలు రావడంతో సంస్థ ఈ మేరకు స్పందించింది.

Walmart: హెచ్-1బీ వీసా దుర్వినియోగం ఆరోపణలు.. ఖండించిన వాల్‌మార్ట్
Walmart H-1B Visa Fraud Denial

ఇంటర్నెట్ డెస్క్: వాల్‌మార్ట్‌లో హెచ్-1బీ వీసా దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సంస్థ తాజాగా స్పందించింది. సంస్థకు చెందిన అసోసియేట్స్‌పై దర్యాప్తు, తొలగింపు నేపథ్యంలో కీలక ప్రకటన విడుదల చేసిన వాల్‌మార్ట్.. ఈ అంశాలకు హెచ్-1బీ వీసాతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అంతర్గత దర్యాప్తు అనంతరం, వాల్‌మార్ట్‌కు అనుబంధంగా ఉన్న కొద్ది మందిని తొలగించినట్టు వెల్లడించింది. ఈ దర్యాప్తునకు హెచ్-1బీ వీసాతో ఎలాంటి సంబంధం లేదని కూడా స్పష్టం చేసింది.

వాల్‌మార్ట్‌ ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ బ్లైండ్ అనే ఆన్‌లైన్ చర్చా వేదికలో కొందరు ఆరోపణలు గుప్పించారు. కాంట్రాక్ట్ జాబ్స్ కోసం ముడుపులు చేతులు మారాయని అన్నారు. సంస్థలోని ఉన్నతస్థాయి ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్ట్ నియామకాలకు సంబంధించి అవకతవకల నేపథ్యంలో గ్లోబల్ టెక్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌ను తొలగించారని కొందరు అన్నారు. అమెరికన్ వర్కర్లకు బదులు హెచ్-1బీ వీసాదారులకు ప్రాధాన్యం ఇచ్చినందుకు ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు.


ఈ ఏడాది ప్రథమార్థంలో వాల్‌మార్ట్ మొత్తం 1500 మందిని తొలగించింది. దీంతో, అమెరికన్ల స్థానంలో విదేశీయులను చేర్చుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతాయి. అయితే, ఈ ఆరోపణలు వాల్‌మార్ట్ నిర్ద్వంద్వంగా తోసి పుచ్చింది.

ఈ అంశంపై అమెరికాలో రాజకీయ నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ వీసాకు బ్రేకులు వేయాల్సిన సమయం వచ్చిందేమో అంటూ యూటా సెనేటర్ మైక్ లీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. మరోవైపు ట్రంప్ సర్కారు వలసలపై ఉక్కుపాదం మోపుతోంది. వీసా నిబంధనలను కఠినతరం చేసింది. విదేశీ విద్యార్థుల ఉపాధికి ప్రధాన మార్గంగా ఉన్న ఓపీటీని కూడా ట్రంప్ సర్కారు టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న భయాలు వ్యక్తమవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

న్యూయార్క్ రోడ్డు ప్రమాదం.. మృతుల్లో భారతీయుడు ఉన్నట్టు పోలీసుల వెల్లడి

ఓపీటీని ట్రంప్ టార్గెట్ చేయనున్నారా.. విదేశీ విద్యార్థులకు చుక్కలే..

Read Latest and NRI News

Updated Date - Aug 26 , 2025 | 09:50 AM