NRI Blood Donation: యూఏఈలో తెలుగు ప్రవాసీ సంఘాల రక్తదాన శిబిరం
ABN , Publish Date - Jul 15 , 2025 | 06:34 PM
యూఏఈలో తెలుగు తరంగిణి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, ఇండియన్ పీపుల్స్ ఫోరం, ఎమిరేట్స్ హెల్త్ సర్వీసెస్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఓ వ్యక్తి మరొకరికి ఇవ్వగలిగిన అమూల్య బహుమానం రక్త దానం. ఈ అమూల్య దానం విషయమై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో గత కొన్నాళ్ళుగా ప్రముఖ తెలుగు ప్రవాసీ సంఘమైన ‘తెలుగు తరంగిణి’ తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈసారి నిర్వహించిన రక్తదాన శిబిరానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, ఇండియన్ పీపుల్స్ ఫోరం (ఐపీఎఫ్), ఎమిరేట్స్ హెల్త్ సర్వీసెస్ కూడా తోడవడంతో సేవ రెట్టింపయ్యింది. తెలుగు ప్రవాసీయులు ఎక్కువగా ఉన్న ఈ నాలుగు సంఘాలు సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. యువతలో రక్తదాన ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడంతో యువకులయిన వెంకట విజ్ఞాన్, సాయి సుభాష్ తదితరులు మొదటిసారిగా రక్తదానం చేశారని పేర్కొన్నారు. రస్ అల్ ఖైమాలోని అల్ సఖర్ ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ వైద్యులు డా. శ్రీనివాస స్వామి, గోరంట్ల రామరాజు రక్తదానం ప్రయోజనాలను వివరించారు.
ఒకరి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం చేయడం ఓ గొప్ప కార్యక్రమమని తెలుగు తరంగిణి అధ్యక్షుడు వక్కలగడ్డ వెంకట సురేశ్ అన్నారు. రక్తదానం అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తాన్ని కృత్రిమంగా ఉత్పత్తి చేయలేరని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషులు స్వచ్ఛందంగా దానం చేయవలసిందేనని వెంకట సురేశ్ నొక్కి చెప్పారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో దాదాపు 168 సార్లు రక్తదానం చేయవచ్చని వివరించారు.

కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, రస్ అల్ ఖైమా అధ్యక్షులు యం.యన్.వి. కేదార్, కార్యదర్శి సందీప్, కోశాధికారి చిలుకూరి విజయ్, వి.సి.ఐ డిస్ట్రిక్ట్ ఎన్నారై క్లబ్ వీ601ఏ గవర్నర్ నుకల మురళీ కృష్ణ, వి.సి.ఐ. ఐటి టెక్ ఫోరం అధ్యక్షులు శరత్ చంద్ర యెల్చూరి, శ్రీ సురేష్ గోకవరపు, డి.బాలాజీ, ఐ.యఫ్.ఏ డైరెక్టర్ విజయభాస్కర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు తరంగిణి ప్రతినిధులు సి.హెచ్. శ్రీనివాసరావు, రాజేష్, ప్రసాద్, సత్యానంద, శ్రీకాంత్, కిరణ్ కుమార్, డాక్టర్ రాఘవేంద్ర, శివానంద్, సయదా, బ్రహ్మానందం, నందమూరి రవి, నందమూరి లక్ష్మి కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఐపీయఫ్ కార్యదర్శి రాజీవ్ రంజన్ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డాలస్‌లో ఆకట్టుకున్న ‘అద్వైతం - డాన్స్ ఆఫ్ యోగా’ కూచిపూడి
సింగపూర్‌లో స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ టోర్నమెంట్ విజయవంతం