Saudi Arabia: సౌదీలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఏలూరు యువకుడికి ఎట్టకేలకు ఊరట
ABN , Publish Date - Jun 26 , 2025 | 07:03 AM
వీసా రెన్యూవల్ కాకపోవడంతో సౌదీలో చిక్కుల్లో పడ్డ ఓ తెలుగు యువకుడికి అక్కడి ప్రవాసీయులు అండగా నిలవడంతో అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. అతడు స్వదేశానికి తిరిగెళ్లేందుకు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: పొట్టకూటి కోసం సౌదీ అరేబియాకు వచ్చి వీసా గడువు ముగియడంతో చిక్కుల్లో పడ్డ ఒక తెలుగు యువకుడికి అక్కడి తెలుగు ప్రవాసీయులు అండగా నిలిచారు.
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలానికి చెందిన వంపుగాళ్ళ బాలాజీ అనే 22 ఏళ్ళ యువకుడు హోటల్ మేనేజ్మెంట్ విద్యనభ్యసించి ఒక ప్రముఖ కంట్రాక్టింగ్ కంపెనీలోని క్యాటరింగ్ విభాగంలో పని చేయడానికి సంవత్సరం క్రితం సౌదీ అరేబియాకు వచ్చాడు. వచ్చిన మూడు నెలలకు ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. ఉద్యోగం కోల్పోయిన అతని అఖమాను అతని కంపెనీ పునరుద్ధరించలేదు. దీంతో అతను స్వదేశానికి రాలేక, ఉన్న చోట పని దొరక్క అనేక ఇబ్బందులను ఎదుర్కున్నాడు. ఉండడానికి నివాసం, తినడానికి తిండి సైతం లేక కష్టాలు అనుభవించాడు.
బాలాజీ దీనస్థితి గురించి తెలుసుకున్న దమ్మాంలోని తెలుగు ప్రవాసీ సంఘం సాట్స్ ఉపాధ్యక్షులు కండిబేడల వరప్రసాద్ బాలాజీకి అండగా నిలబడి ఎగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడంతో నెలల తరబడి చేసిన నిరీక్షణకు ఫలితం దక్కింది. బాలాజీ బుధవారం స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని వరప్రసాద్ వెల్లడించారు.
ఆపదలో ఉన్న ఈ రకమైన తెలుగు ప్రవాసీయుల కోసం తాము సాట్స్ పక్షాన వీలైనంతగా చేయూతను ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తమ సంఘం పక్షాన పాపారావు, కిశోర్ అద్దంకి, శ్రీనివాస్, ఉమా మహేశ్వరరావులు ఈ దిశగా నిరంతరం పని చేస్తున్నారని వరప్రసాద్ చెప్పారు.
ఇవీ చదవండి:
అట్లాంటాలో ఫోర్సిత్ కౌంటీ షెరీఫ్ సిబ్బందికి తానా నాయకుల సత్కారం
అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం