NRI: ఖతర్‌లో తెలుగు ఇంజనీర్ల ఫోరం.. అవకాశాలు, అభ్యర్థులు, అనుభవానికి మధ్య వారధి
ABN , Publish Date - Dec 16 , 2025 | 09:22 PM
ఖతర్‌లోని తెలుగు ఇంజనీర్ల ఫోరం ఆవకాశాలు, అనుభవాలు, అభ్యర్థులకు మధ్య గత నాలుగు సంవత్సరాలుగా ఒక వారధిగా వ్యవహరిస్తోంది. యం.ఇ.పి, యు.డి.పి.ఎ గుర్తింపునకు సంబంధించి చట్టపరమైన సమస్యను పరిష్కరించడంలో తెలుగు ఇంజనీర్ల ఫోరం కీలక పాత్ర పోషిస్తోంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: గల్ఫ్ దేశాలలో భారతీయుల ప్రతిష్ఠను పెంపొందించడంలో సాంకేతిక నిపుణులు.. ప్రత్యేకించి ఇంజనీర్ల పాత్ర ప్రశంసనీయం. ఇప్పటికీ నిత్యం వందలాది మంది యువ ఇంజనీర్లు ఎడారి దేశాలలో ఉపాధి కోసం వస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఖతర్, ఇతర గల్ఫ్ దేశాలలో కాలంతో పాటు పరిగెత్తే వారిలో భారతీయ ఇంజనీర్లు అగ్రగణ్యులు.
సుమారు 270 బిలియన్ డాలర్ల వ్యయంతో దాదాపు ఒక వేయి ప్రాజెక్టులు కొనసాగుతున్న ఖతర్‌లోని భారతీయ ఇంజినీర్ల సమూహంలో తెలుగు ఇంజినీర్లు కీలక పాత్ర వహిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు కాలానికి అనుగుణంగా అందుబాటులో వస్తున్న నవీన సాంకేతిక పరిజ్ఞానంలో మెళకువలు తెలుసుకుని ఖతర్ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తూ భారతావని గౌరవాన్ని పెంపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఖతర్‌లోని తెలుగు ఇంజనీర్ల ఫోరం ఆవకాశాలు, అనుభవాలు, అభ్యర్థులకు మధ్య గత నాలుగు సంవత్సరాలుగా ఒక వారధిగా వ్యవహరిస్తోంది. గల్ఫ్‌లోని కొన్ని దేశాలలో బీటెక్, బీఈ డిగ్రీల గుర్తింపు సమస్య కారణంగా అనేక మంది తెలుగు ఇంజనీర్లు వృత్తిపరమైన అధికారిక గుర్తింపు కోసం ఇబ్బంది పడ్డారు. ఖతర్‌లో కూడా ఈ అంశంతో పాటు యం.ఇ.పి, యు.డి.పి.ఎ గుర్తింపునకు సంబంధించి చట్టపరమైన సమస్యను పరిష్కరించడంలో తెలుగు ఇంజనీర్ల ఫోరం కీలక పాత్ర పోషిస్తోంది.
సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఐ.టి తదితర విభాగాలకు చెందిన ఇంజనీర్లతో కూడిన తెలుగు ఇంజినీర్ల ఫోరంలో మహిళలతో సహా మొత్తం 1000 మంది ఇంజనీర్లుగా ఉన్నట్లుగా ఇటీవల మరోసారి ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికయిన మొహమ్మద్ నవాజ్ అలీ ఖాన్ పేర్కొన్నారు. వృత్తిపరమైన నైపుణ్యం పెంపొందించెందుకు వివిధ గోష్ఠులు, సదస్సులను నిర్వహించడంతో పాటు తెలుగు ఇంజనీర్లు అందరినీ సమన్వయం చేసుకుంటూ నాణ్యతతో కూడిన నైపుణ్యం సాధించే దిశగా తెలుగు ఇంజనీర్ల ఫోరం కృషి చేస్తుందని నవాజ్ అలీ ఖాన్ అన్నారు.
ప్రాంతాలు, కులమతాలకు అతీతంగా కేవలం తెలుగు కేంద్రీకృతంగా ఖతర్‌లో తెలుగు ఇంజనీర్ల ప్రతిష్ఠను ఇనుమడింపజేయడానికి తెలుగు ఇంజనీర్ల ఫోరం కట్టుబడి ఉందని నవాజ్ ఖాన్, ఉపాధ్యక్షులు అనిల్ కుమార్ ఓరుగంటి అన్నారు.
ఖతర్‌లో అనుభవజ్ఞులైన మహిళ ఇంజనీర్లకు ఆకాశమే హద్దు అని ఇంజనీర్ల ఫోరం మహిళా ప్రతినిధి మందీప నందిగాం వ్యాఖ్యానించారు.