Telangana Formation Day: ఖతర్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
ABN , Publish Date - Jun 02 , 2025 | 09:41 PM
ఖతర్‌లోని తెలంగాణ గల్ఫ్ సమితి శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవంలో దేశవ్యాప్తంగా నివసిస్తున్న తెలంగాణ ప్రవాసీయులు పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల పరంపర కొనసాగుతుంది. ఈ క్రమంలో ఖతర్‌లోని తెలంగాణ గల్ఫ్ సమితి శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవంలో దేశవ్యాప్తంగా నివసిస్తున్న తెలంగాణ ప్రవాసీయులు పాల్గొన్నారు.
విదేశీ గడ్డపై కూడా ప్రబలంగా ఉన్న తెలంగాణ సంస్కృతి.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ఖతర్‌లో సాంస్కృతిక, సేవా కార్యక్రమాలను చేపడుతున్న తెలంగాణ గల్ఫ్ సమితిని ఆది శ్రీనివాస్ అభినందించారు.
గల్ఫ్ దేశాలలో ఉన్న తెలంగాణ ప్రవాసీయుల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే ప్రత్యేక అధ్యయన బోర్డును నెలకొల్పినట్లుగా ఆయన అన్నారు.
సామరస్య పూర్వకంగా కార్మిక సమస్యలను ఖతర్ చట్టపరధిలో పరిష్కరించడంలో తెలంగాణ గల్ఫ్ సమితి ప్రతినిధులు చేస్తున్న కృషిని ఖతర్ కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఖాలీద్ అబ్దుల్ రెహ్‌మాన్ ఫఖ్రూ అభినందించినట్లుగా నిర్వాహకులు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ తన మాటకు కట్టుబడి ఉంటుందని అది ప్రత్యేక తెలంగాణ విషయమైనా, ప్రవాసీ బోర్డు ఏర్పాటు విషయంలోనైనా తన నిజాయితీ, నిబద్ధతను చాటుకుందని తెలంగాణ పీసీసీ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రవాసీ అధ్యయన బోర్డు సభ్యుడు కూడా అయిన నరేశ్ రెడ్డి తమ పార్టీ ప్రభుత్వం గల్ఫ్ ప్రవాసీయులు, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రణాళికబద్ధంగా కృషి చేస్తుందని అన్నారు.
గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తమ బోర్డు ప్రయత్నాలు చేస్తుందని మరో సభ్యుడు గుగిళ్ళ రవి గౌడ్ అన్నారు.
తెలంగాణ ఆత్మగౌరవం ప్రాతిపదికన ఖతర్‌లోని ప్రవాసీ కార్మికుల సంక్షేమం, సాంస్కృతిక వికాసం తెలంగాణ గల్ఫ్ సమితి నిరంతరం పాటుపడుతుందని తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు సుందరిగి శంకర్ గౌడ్ సభికులకు వివరించారు. దశాబ్ద కాలంగా తమ సంఘం సేవా కార్యకలాపాలను శంకర్ గౌడ్ విశదీకరించారు.

ఎస్సీబీఎఫ్ అధ్యక్షుడు శానవాజ్ బావ తెలంగాణ గల్ఫ్ సమితి ఎల్లప్పుడూ సేవలలో ముందంజలో ఉంటుందని ప్రశంసించారు. ఎస్సీబీఎఫ్ అడ్వైజర్ చైర్మన్ కోడూరి శివప్రసాద్ మాట్లాడుతూ ఖతర్‌లో తెలుగు సంఘాలు ఐకమత్యంగా పండుగ చేసుకోవడం చాలా ఆనందకరమని అన్నారు. మరో అతిథి ఐసీసీ అడ్వైజర్ చైర్మన్ బాబు రాజన్ మాట్లాడుతూ తెలంగాణ గల్ఫ్ సమితి సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీఎఫ్ ఉపాధ్యక్షుడు రషీద్ మహమ్మద్ ఎస్సీబీఎఫ్ జనరల్ సెక్రెటరీ దీపక్ శెట్టి కార్యదర్శి జాఫర్, అమర్ సింగ్, ఐసీసీ పక్షాన సాంస్కృతిక కార్యదర్శి నందిని అబ్బగౌని, ఐసీసీ సభ్యులు వెంకప్ప, ఐసీసీ కార్యవర్గ సభ్యులు దీపక్ చుక్కల, సోమరాజు, తెలుగు సంఘాలు అధ్యక్షులు హరీష్ రెడ్డి, సుధ శ్రీరామోజుల, నరసింహ మూర్తి, అబ్బాగౌని శ్రీధర్, తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ సభ్యులు సంధ్యారాణి, ఎల్లయ్య బండపెళ్లి, వెంకటేష్, మనోహర్, ప్రీతిష్ రజిత రెడ్డి, రాకేష్, ప్రసాద్ నిమ్మల, రాజేశ్వర్ సలహా మండలి చైర్మన్ కృష్ణకుమార్, ఎల్లయ్య తల్లపెళ్లి, చింతకుంటా మహేందర్, గడ్డి రాజు, కృష్ణా శ్రీరామోజు, ప్రియ ముకల గోలి గత నెల రోజులుగా కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని శంకర్ గౌడ్ అభినందించారు.
ఇవి కూడా చదవండి:
బే ఏరియాలో ఘనంగా కృష్ణ 82వ జయంతి వేడుకలు
సౌదీలో వైభవంగా తెలుగు దేశం మినీ మహానాడు